ప్రచారానికి తెర..

Election Campaign Completed In YSR District - Sakshi

ఎక్కడి మైకులు అక్కడే గప్‌చుప్‌

ప్రచారంలోనూ వైఎస్సార్‌సీపీదే పైచేయి

నేటి ఉదయం నుంచే ఈవీఎంల తరలింపునకు ఏర్పాట్లు

పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుంటున్న ఎన్నికల సిబ్బంది

ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకులన్నీ మూగబోయాయి. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ఎక్కడ ప్రచారం అక్కడ ముగించారు. జిల్లాలో ఎన్నికల ప్రచారం విషయంలో వైఎస్సార్‌సీపీ మినహా మిగిలిన రాజకీయ పార్టీలకు ఈసారి ముచ్చెమటలు పట్టాయి. గతనెలలో షెడ్యూలు వెలువడ్డాక అనూహ్యంగా తక్కువ వ్యవధి ఉండటంతో అధికార టీడీపీ తడబడింది. చాలా చోట్ల అభ్యర్థుల ఎంపిక నామినేషన్ల ఘట్టం వరకూ తేల్చలేకపోయింది. ఫలితంగా అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారంలో వెనుకబడిపోయారు. నామినేషన్ల ఘట్టం ముగిశాక తొందరపడ్డారు. కానీ అప్పటికే సమయం హరించుకుపోయింది. మిగిలిన పార్టీలదీ అదే పరిస్థితి. జనసేన లాంటి పార్టీలు కనీసం అభ్యర్థులందరినీ పరిచయం చేసే ప్రచారం సైతం నిర్వహించలేపోయాయి. మరోపక్క అధికారులు రేపటి ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నారు. బుధవారం ఉదయం నుంచి ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంల తరలింపునకు శ్రీకారం చుట్టనుంది. ఎన్నికల అధికారులు..సిబ్బంది కూడా నేటి నుంచి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.   

సాక్షి కడప :  ప్రచారానికి మంగళవారం సాయంత్రం 6.00 గంటలకు ఫుల్‌స్టాప్‌ పడింది. అన్ని రాజకీయ పక్షాలు అన్ని రకాల ప్రచారాలను నిలిపేశాయి. జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐదు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. గతనెల 18న రాయచోటిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్నారు. 22న పులివెందులలో సీఎస్‌ఐ చర్చి మైదానంలో అశేష జనవాహినినుద్దేశించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. 29న బద్వేలు, మైదుకూరు నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో పాల్గొన్నారు. ఈనెల 5వ తేదీన జమ్మలమడుగులో ఎన్నికల సభలో ప్రసంగించారు. అన్ని సభలకూ జనం పోటెత్తారు. కేడరులో ఆయన ప్రసంగం ఉత్సాహాన్ని నింపింది. 

ప్రతిపక్ష నేత హామీలపై ప్రజల విశ్వాసం

  • తమ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న పథకాలు వివరించారు. ప్రజాకాంక్షలకు పట్టం కట్టేలా హామీలిచ్చారు. నవరత్న పథకాలతో ప్రతి కుటుంబానికి జరిగే ప్రయోజనాలను వివరించారు. 
  • రాయచోటిలో హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలు పారించడంతోపాటు శ్రీనివాసపురం, వెలిగల్లు, ఝరికోనలను నీటితో నింపుతాం. 
  • రాయచోటికి చెందిన మైనార్టీ నేతకు ఎమ్మెల్సీ ఇస్తాం. 
  • బద్వేలు, మైదుకూరు సభల సందర్భంగా కుందూనది నుంచి బ్రహ్మంసాగర్‌కు పంపింగ్‌ స్కీమ్‌ ద్వారా నీరు సరఫరా.
  • సోమశిల బ్యాక్‌ వాటర్‌తో బద్వేలు, అట్లూరు, గోపవరానికి తాగు, సాగునీటి సరఫరా.
  • వెలిగోడు నుంచి కలసపాడు, కాశినాయన, పోరుమామిళ్లలకు జలాలు.
  • చెన్నూరు చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధ్దరించి కార్మికులకు ఉపాధి, రైతులకు గిట్టుబాటు ధర 
  • రాజోలి ప్రాజెక్టును నిర్మాణం.బద్వేలు నియోజకవర్గంలోని అన్ని చెరువులకూ జలకళ.
  • కేపీ ఉల్లితోపాటు పసుపు రైతులకు మద్దతు ధర 
  • ఉక్కు పరిశ్రమకు ఆరు నెలలలోపు పునాది రాయి వేసి....మూడేళ్లలో పూర్తి. 
  • చేనేత కుటుంబానికి రూ. 24 వేలు సాయం..
  • గండికోట ప్రాజెక్టు బాధితులకు రూ. 10 లక్షల పరిహారం 
  • గోడౌన్లలో నిల్వ ఉన్న శనగలన్నింటినీ క్వింటా రూ. 6500 చొప్పున కొనుగోలు 

బాబు సభలకు స్పందన కరువు
అధికార పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రచారం నిర్వహించినా పెద్దగా ప్రజాస్పందన కనిపించలేదు.దీంతో కేడర్‌  డీలా పడింది.  కడపలో జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాను తీసుకొచ్చినా జనం లేక సభ వెలవెలబోయింది. రోడ్‌షోలకు కూడా ఆశించిన మేర జనం కనిపించలేదు. పులివెందులలో కూడా సీఎం సభకు జనం పలుచగా  కనిపించారు. జమ్మలమడుగు, బద్వేలు, రాయచోటిల్లో కూడా సీఎం ఎన్నికల సభలను నిర్వహించారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కడపలో ఒకసారి మాత్రమే సభ నిర్వహించారు. అది కూడా జనం లేక వెలవెలబోయింది. బీజేపీ పక్షాన ఆపార్టీ నాయకులు జీవీఎల్‌ నరసింహారావు ఎన్నికల ప్రచారం ముగింపురోజున పాల్గొన్నారు. కాంగ్రెస్‌ తరఫున అగ్రనేతలెవ్వరూ ప్రచారంలో పాల్గొనలేదు. దీంతో ఆపార్టీ ఉనికి ప్రశ్నార్ధకమైందని రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. స్వతంత్రులు అక్కడక్కడా మైకుల ప్రచారానికి పరిమితమయ్యారు. ప్రచారం ముగించిన అధికార పక్ష నేతలు మంగళవారం సాయంత్రం నుంచి ప్రలోభాలకు గురిచేసే పనిలో పడ్డారు.

కడప లోక్‌సభకు:    15మంది

రాజంపేట లోక్‌సభకు:    9మంది

అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తున్న వారు  133మంది

మొత్తం ఓటర్లు  22,04,964
మహిళలు     11,17,547
ఇతరులు    300
పోలింగ్‌ కేంద్రాలు     2,723

  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top