మహా విశాఖతోపాటు జిల్లాలోని పలుప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
- విశాఖతోపాటు అనకాపల్లి,భీమిలిలో...
- స్వల్పంగా కంపించిన భూమి
- ఆందోళనకు గురైన జనం
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖతోపాటు జిల్లాలోని పలుప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శనివారం ఉదయం స్వల్పంగా భూమి కంపించడంతో ప్రజలు కొద్ది సేపు ఆందోళనకు గురయ్యారు. నేపాల్ రాజధాని ఖాట్మాండు పరిసర ప్రాంతాల్లో శనివారం సంభవించిన భూకంప ప్రభావం విశాఖ జిల్లాలో కన్పించింది. ఉదయం 11.55 గంటల సమయంలో విశాఖ నగరంతోపాటు అనకాపల్లి, భీమిలి, పెందుర్తి తదితర ప్రాంతాల్లో పలు చోట్ల భూమి కొద్దిసెకన్లపాటు కంపించింది.
విశాఖనగరంలో మధురవాడ, నరసింహనగర్, మురళీనగర్, అంగడి దిబ్బ, శివాజీపాలెం, ఎన్‌ఎడి కొత్తరోడ్, మాధవధార, అక్కయ్యపాలెం, కైలాసగిరి తదితర ప్రాంతాల్లో భూమి సుమారు రెండు నుంచి పది సెకన్లపాటు కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు. అదే విధంగా అనకాపల్లి, భీమిలి, పెందుర్తి ప్రాంతాల్లో కూడా ఇదేరీతిలో భూమి కంపించినట్టుగా స్థానికులు గుర్తించారు. విశాఖ మురళీనగర్, అనకాపల్లి రింగ్‌రోడ్ జంక్షన్‌లలో ప్రకంపనల ప్రభావం స్పష్టంగా కన్పించినట్టుగా స్థానికులు చెబుతున్నారు. హుద్‌హుద్ తర్వాత ప్రకృతి పరంగా ఏ చిన్నపాటు హెచ్చరికలొచ్చినా జిల్లా వాసులు ఇట్టే భయపడే పరిస్థితి ఏర్పడింది.
ఒక పక్క జిల్లాలో పలు చోట్ల రెండోరోజు కూడా ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవగా అదే సమయంలో జిల్లాలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయ న్న వార్తలు దావానలంలా వ్యాపించడంతో జిల్లావాసులు కొద్దిసేపు కలవరపాటుకు గురయ్యారు. ముఖ్యంగా భూమి కంపించిన ప్రాంతాల్లో అయితే ప్రజలు మరింత కంగారుపడ్డారు. దీ నికి తోడు నేపాల్ భూకంప దృశ్యాలను చూపిస్తూనే విశాఖ జిల్లాలో ఫలానా ప్రాంతంలో భూమి కంపించింది.. ప్రజలు పరుగులు తీసారంటూ ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరగడం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేసింది.
భూ ప్రకంపనలకు మురళీనగర్‌లోని సుఖశాంతి అపార్టుమెంట్‌లో గోడలు బీటలు వారినట్టుగా నివాసితులు మీడియాకు వివరించారు. అదే విధంగా మాధవధార, మధురవాడ, శివాజీపాలెం, అంగడిదిబ్బ ప్రాంతాల్లో కూడా ఇదే రీతిలో టీవీలో వార్తల నేపథ్యంలో జర్కిచ్చినట్టుగా అన్పించడంతో ఇళ్లు, అపార్టుమెంట్లు వదిలి బయటకు వచ్చినట్టుగా స్థానికు లు మీడియాకు వివరించారు. ఈ విషయమై జిల్లా పర్యటనలో ఉన్న డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డెరైక్టర్ ధనుంజయరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా నేపాల్‌లో సంభవించిన భూకంపం నేపథ్యంలో విశాఖతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో కూడా పలు ప్రాంతాల్లో అతిస్వల్పంగా భూమి కంపించినట్టుగా తమకు సమాచారం అందిందని చెప్పారు. అయితే ఎక్కడా ఎలాంటి నష్టం వాటిల్లినట్టుగా సమాచారం లేదన్నారు.