ఈ నెల మూడో వారంలో ఎంసెట్‌ ఫలితాలు!

Eamcet results in the third week of May - Sakshi

ఫలితాల వెల్లడి సమస్యపై సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష

మార్కులు ఇవ్వాలని ఏపీ ఇంటర్‌ బోర్డుకు ఆదేశం 

ఎవరికీ చెప్పకూడదన్న షరతుతో మార్కులిచ్చేందుకు బోర్డు అంగీకారం 

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు తేలి మార్కులు అందాకే ఎంసెట్‌ ర్యాంకులు 

జూలై నుంచి ఇంజనీరింగ్‌ తరగతులు ప్రారంభించే అవకాశం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రి, మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఎంసెట్‌–2019 తుది ఫలితాలను ఈ నెల మూడో వారంలో విడుదల చేయనున్నారు. ఎంసెట్‌ ఫలితాల విడుదలపై సందిగ్థత, ఇతర సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇందులో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ విజయరాజు, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి, ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి, ఎంసెట్‌ చైర్మన్‌ రామచంద్రరాజు, కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌.సాయిబాబు, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి వరదరాజన్, ప్రవేశాల ప్రత్యేకాధికారి డాక్టర్‌ రఘునాధ్‌ తదితరులు పాల్గొన్నారు. ఎంసెట్‌ ఫలితాల విడుదలకు ఆటంకంగా ఉన్న పలు అంశాలపై సీఎస్‌ వారితో చర్చించారు. ఫలితాల విడుదలపై తొందర అవసరం లేదని, ఏపీ ఇంటర్మీడియెట్‌ మార్కులతోపాటు, తెలంగాణ ఇంటర్మీడియెట్‌ మార్కులు కూడా వచ్చాకే తుది ఫలితాలు విడుదల చేయాలని సీఎస్‌ అధికారులను ఆదేశించారు. మే మూడో వారంలో ఫలితాల విడుదలకు నిర్ణయించారు. తెలంగాణ ఇంటర్‌ మార్కులు వచ్చాక ఎంసెట్‌ ర్యాంకులను ప్రకటించనున్నారు. 

గోప్యంగా ఉంచుతామని హామీ ఇవ్వడంతో
ఏపీ ఇంటర్మీడియెట్‌ బోర్డు ఈ ఏడాది ఫలితాలను గ్రేడింగ్‌ విధానంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎంసెట్‌కు హాజరైన విద్యార్థుల ఇంటర్‌ మార్కులను అందించడంలో సమస్య ఏర్పడింది. మార్కులు బయటకు వెల్లడించడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయన్న భావనతో బోర్డు అధికారులు.. ఎంసెట్‌ అధికారులకు మార్కులు ఇచ్చేందుకు తర్జనభర్జన పడ్డారు. ఎటువంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని, మార్కులను ఎంసెట్‌ కమిటీకి అందించాలని సీఎస్‌ సుబ్రహ్మణ్యం ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మికి సూచించారు. బయటకు వెల్లడి కావన్న షరతుతో ఈ మార్కులు అందించేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి కూడా ఇంటర్మీడియెట్‌ మార్కుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామనడంతో సమస్య పరిష్కారమైంది.

తెలంగాణ బోర్డు నుంచి  వచ్చే వరకు నిరీక్షణ
తెలంగాణ ఇంటర్మీడియెట్‌ ఫలితాలు తీవ్ర గందరగోళంలో పడిన నేపథ్యంలో వాటి సమాచారం ఎప్పటికి వస్తుందో అనే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. ఏపీ ఎంసెట్‌–2019కు మొత్తం 2,67,627 మంది హాజరయ్యారు. వీరిలో తెలంగాణలో ఇంటర్‌ చదివినవారు 40,242 మంది ఉన్నారు. వీరిలో 14 వేల మంది వరకు తెలంగాణకు చెందిన విద్యార్థులు కాగా తక్కినవారు అక్కడ సెటిలైన ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఇలా వేలాది సంఖ్యలో తెలంగాణ విద్యార్థులు ఏపీ ఎంసెట్‌కు హాజరైనందున వారి మార్కులు కూడా వచ్చాకనే తుది ఫలితాలు విడుదల చేయాలని సీఎస్‌ అధికారులకు సూచించారు. తెలంగాణ ఇంటర్మీడియెట్‌ ఫలితాలపై అక్కడి హైకోర్టు ఈ నెల 8 వరకు గడువు ఇచ్చినందున రెండో వారంలో ఆ ఫలితాలను అక్కడి బోర్డు ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి మే మూడో వారంలో ఎంసెట్‌ ఫలితాలను విడుదల చేసేలా షెడ్యూల్‌ను నిర్ణయించుకోవాలని సీఎస్‌ సూచించారని సమావేశంలో పాల్గొన్న ఉన్నత విద్యామండలి అధికారులు పేర్కొన్నారు. 

జూన్‌లో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌
మే మూడో వారంలో ఎంసెట్‌ ఫలితాలు ప్రకటించాక ప్రవేశాలపై ఉన్నత విద్యా మండలి దృష్టి సారించనుంది. జూలై నుంచి ఇంజనీరింగ్‌ తరగతులను ప్రారంభించేలా షెడ్యూల్‌ను ఖరారు చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. దాని ప్రకారం ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను జూన్‌ రెండో వారం నుంచి ప్రారంభించి, జూలై నాటికి ప్రవేశాలను పూర్తి చేయించి, అనంతరం తరగతుల ప్రారంభానికి వీలుగా చర్యలు తీసుకోనున్నామని ఉన్నత విద్యా మండలి వర్గాలు వివరించాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top