తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ ఆపలేరని ప్రభుత్వ విప్ అనిల్ అన్నారు.
పరిగి, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ ఆపలేరని ప్రభుత్వ విప్ అనిల్ అన్నారు. సోమవారం ఆయన పీసీసీ కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డితో కలిసి పరిగిలో విలేకరులతో మాట్లాడారు. సీఎంతోపాటు సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అది సాధ్యంకాదని వెల్లడించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం మాత్రమేనని, అధిష్టానం కాదని పేర్కొన్నారు. తెలంగాణ టీడీపీ నాయకులు చంద్రబాబును వదిలించుకుని బయటపడాలని సూచించారు. తెలంగాణలో ఆ పార్టీకి నూకలు చెల్లాయని, సీమాంధ్రలోనూ ఆదరణ కరువైందని చెప్పారు. తెలంగాణ విషయంలో బాబుకు స్పష్టతలేదని, సమన్యాయం అంటే ఏంటో చెప్పాలని ప్రశ్నించారు.
కేసీఆరే కలిపేస్తానన్నారు..
తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్‌ఎస్‌ను కేసీఆరే కాంగ్రెస్‌లో కలిపేస్తానన్నారని అనిల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, పార్టీ విలీన అంశాన్ని కేసీఆర్ విజ్ఞతకే వదిలేశామని వెల్లడించారు. పరిగిలోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని పేర్కొన్నారు. పీసీసీ కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన సోనియా గాంధీకి కేసీఆర్ కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకపోవటం దారుణమన్నారు.
సమావేశంలో ఎన్‌ఆర్‌ఐ భరత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బి.నారాయణ్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఎర్రగడ్డపల్లి కృష్ణ, బిచ్చయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.