శాసనసభలో ప్రజా సమస్యలపై చిత్తూరు ఎమ్మెల్యేల గళం

District MLAs Who Spoke In Assembly On Chittoor Issues - Sakshi

పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకు ఉపాధి

నీరు–చెట్టు అవినీతిపరుల భరతం పట్టేందుకు విజి‘లెన్సు’

‘గజ’ బాధితులకు అన్యాయంపై ధ్వజం

అసెంబ్లీ వేదికగా గళమెత్తిన ప్రజాప్రతినిధులు

ప్రజల కోసం, ప్రాంతం కోసం జిల్లా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ ప్రాంతా ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ హయాంలో ప్రజాధ నం దుర్వినియోగం, ప్రభుత్వ పథకాల్లో దోపిడీని ఎండగట్టారు. ఎంతో కాలంగా తిష్టవేసిన ఏనుగుల సమస్య, వాటి దాడిలో నష్టపోయిన బాధితులకు పరిహారంపై ప్రస్తావించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు బిల్లుల వల్ల జిల్లాకు లభించే ప్రయోజనాలను వివరించారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి: అసెంబ్లీ సమావేశాల్లో వ్యక్తిగత దూషణలు, ఎత్తిపొడుపులు, ప్రజాగొంతుకను నియంత్రించడం ఇదివరకూ కన్పించిన దృశ్యం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సరికొత్త చర్చకు నాంది పలికింది. ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. అసెంబ్లీ వేదికను సద్వినియోగం చేసుకుని ప్రజల కోసం కొందరు పరితపిస్తే, రాజకీయాలు చేయాలనే దిశగా మరికొందరు ప్రయత్నిం చారు. వెరసి 20 రోజుల బడ్జెట్‌ సమావేశాలకు మంగళవారంతో తెరపడింది. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనం దోపిడీపై ధ్వజమెత్తారు. జిల్లావ్యాప్తంగా సుమారు రూ.750 కోట్లతో 7,937 వివిధ పనులు చేపట్టారు. వాటిలో ప్రజాప్రయోజనాల నిమిత్తం చేపట్టిన పనులు అతి స్వల్పమనే చెప్పాలి.

నీరు–చెట్టు పథకం రూపేణా టీడీపీ కార్యకర్తలు ప్రజాధనాన్ని దోపిడీ చేశారు. ఈ విషయాన్ని సమీక్షించిన మంత్రి పెద్దిరెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించి, విజిలెన్సు విచారణకు ఆదేశించారు. డెప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలకు అండగా పథకాలు రూపొందిస్తున్నారని తెలిపారు. అవినీతిని అంతమొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. గత పాలనలో కుట్రలు, కుయుక్తులు అడుగడుగునా కన్పించేవని, ప్రజాశ్రేయస్సే ఎజెండాగా ప్రస్తుత ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని వివరించారు. పదవుల్లో, పనుల్లో 50శాతం మహిళలకు వాటా కల్పించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రస్తావించారు. తోబుట్టువులకు అన్నలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలుస్తున్నారని తెలిపారు.

ఏనుగుల సమస్య పరిష్కారం కోసం..
కుప్పం, పలమనేరు, చంద్రగిరి నియోజకవర్గాల పరిధిలో వ్యవసాయ పంటలపై ఏనుగులు దాడులు చేసి తీవ్రంగా నష్టాలపాలు చేస్తున్నాయి. ఇప్పటివరకూ ఏనుగుల దాడుల్లో 9మంది రైతులు మృతి చెందగా, సుమారు 6వేల ఎకరాల్లో వివిధ పంటలు ధ్వంసం అయ్యాయి. దాదాపు 3,500 బాధిత రైతులున్నారు. వీరికి గత ఐదేళ్లుగా అతి తక్కువ మొత్తంలో పరిహారం అందించారు. ఎకరాకు రూ.25వేలు పరిహారం కోరగా, రూ.6వేలు మాత్రమే పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారు. ఈ విషయమై చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. రైతులకు న్యాయం చేయాలని అభ్యర్థించారు.

హౌసింగ్, భూఆక్రమణలపై విచారణకు డిమాండ్‌
అధికారం అండతో పీలేరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా భూములు ఆక్రమించారు. పక్కాగృహాల నిర్మాణాల పేరుతో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. వీటిపై సమగ్రంగా విచారణ చేపట్టి అక్రమార్కులౖపై చర్యలు చేపట్టాలని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అసెంబ్లీలో డిమాండ్‌ చేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లు ఎంతో ప్రయోజనమని, స్థానికులకు ఉపాధి మెరుగవుతోందని వివరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎక్కువమంది యువతకు ఉపాధి దక్కుతోందని తెలిపారు. జిల్లాలో పాఠశాలలు మూతపడిపోతున్నాయి. వాటిని తెరిపించి, నాణ్యమైన విద్యను అందించాలని పలమనేరు, సత్యవేడు ఎమ్మెల్యేలు వెంకటేగౌడ్, ఆదిమూలం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా ప్రభుత్వం చేపట్టగా ఎమ్మెల్యేలు ద్వారకనాథరెడ్డి, నవాజ్‌బాషా, జంగాలపల్లె శ్రీనివాసులు, ఎంఎస్‌ బాబు పాల్గొన్నారు.

చిత్తూరులో మౌలిక వసతులు కల్పించండి – అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆరణి
చిత్తూరు కార్పొరేషన్‌: చిత్తూరులో మౌలిక వసతులు లేకపోవడంతో ప్రజలు సతమతమవుతున్నారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంగళవారం అసెంబ్లీలో తెలియజేశారు. నియోజకవర్గంలో 30 సంవత్సరా లుగా తాగునీటి సమస్య ఉందని, ప్రస్తుతం నగరపాలక సంస్థ తరఫున అందిస్తున్న ట్యాంకర్ల నీరే దిక్కుగా మారిందని అన్నారు. నగరానికి అమృత్‌పథకం కింద నిధులు మంజూరు చేసి సమస్య తీర్చాలని అధికారులు నివేదిక పెట్టి 16 నెలలవుతోందని గుర్తు చేశారు. పది పంచాయతీల విలీనంతో చిత్తూరు కార్పొరేషన్‌గా ఆప్‌గ్రేడ్‌ అయి ఏడు సంవత్సరాలవుతున్నా నిధుల లేమితో అవస్థలు పడుతున్నామన్నారు. నీటి సరఫరా, మురుగు కాలువలు, రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచినా ఇంతవరకు పనులు జరగలేదని గుర్తు చేశారు. చెరువుల అనుసంధానం చేసి నీటి సమస్య తీర్చాలని కోరారు. డెయిరీ, షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపించాలని కోరారు.

శ్మశాన వాటిక సమస్యలు పరిష్కరించండి – సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం
వరదయ్యపాళెం : సత్యవేడు నియోజకవర్గ పరిధిలో శ్మశాన స్థలాల సమస్య పరిష్కరిం చాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరా రు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమంలో ప్రధానంగా శ్మశాన స్థలాల సమస్య తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. కొన్నింటికి దారి లేదని, మరి కొన్ని చోట్ల స్థలం లేదని, ఉన్నా కబ్జాకు గురయ్యాయని చెప్పారు. దీనిపై రెవెన్యూ శాఖ మంత్రి దృష్టి పెట్టి పరిష్కరించాలని కోరారు. తమ నియోజకవర్గం తమిళనాడు సరిహద్దులో ఉందని, ఎన్నికల హామీలను త్వరగా నెరవేరుస్తుండడంతో జగన్‌మోహన్‌రెడ్డి లాంటి సీఎం తమకూ కావాలని ఆ రాష్ట్ర ప్రజలు అంటున్నారని చెప్పడంతో సభలో చప్పట్లు మార్మోగాయి.

పీలేరు భూ అక్రమాలపై సభా సంఘం వేయాలి  - ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి డిమాండ్‌
వాల్మీకిపురం: పీలేరులో జరిగిన భూ అక్రమాలపై సభా సంఘం వేసి, టీడీపీ నేతల దోపిడీపై విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. పీలేరుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేల కోట్లు విలువ చేసే వందల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాన్నారు. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి భూములను అమ్ముకున్నారన్నారు. ఉగాది రోజున పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి  సంకల్పించారని, అయితే పీలేరులో సెంటు కూడా ప్రభుత్వ భూమి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విచారణ చేపట్టి ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ బడా నాయకులు ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారన్నారు. దీనిపై రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్పందిస్తూ ప్రభుత్వం కచ్చితంగా విచారణ చేపట్టి, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top