ఇంత నిర్లక్ష్యమా ?

District Colelctor Attacks On GGH hospital Kakinada East Godavari - Sakshi

అధికారులను కదిలించిన ‘సాక్షి’ కథనాలు

జీజీహెచ్‌లో జిల్లా కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

జిల్లాలో ముసురుకుంటున్న రోగాలు ... చోటుచేసుకుంటున్న వరుస మరణాలపై వరుస కథనాలు ‘సాక్షి’లో ప్రచురితమవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఈ నెల 11వ తేదీన ‘వీడుతారా కుంభకర్ణ నిద్ర’ అనే శీర్షికతో జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా ఏమి చేస్తున్నారంటూ ప్రశ్నిస్తూ కథనం ఇవ్వగా...12వ తేదీన ‘చస్తున్నా...చలనమేదీ’ శీర్షికతో పంచాయతీల్లో రూ.200 కోట్ల నిధులున్నా...14వ ఆర్థిక సంఘం నిధులు రూ.90 కోట్లున్నా పారిశుద్ధ్య పనులకు ఎందుకు వెచ్చించడం లేదంటూ ప్రచురితమయింది. కాకినాడ జీజీహెచ్‌లో కనీస సౌకర్యాల లేమి, అధ్వాన పరిస్థితులను వెలుగులోకి తేవడంతో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆకస్మిక తనిఖీలు చేశారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

తూర్పుగోదావరి, కాకినాడ రూరల్‌/సర్పవరం: మృత శిశువుల వివాదం నేపథ్యంలో కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా శుక్రవారం కాకినాడ ప్రభుత్వాస్పత్రి(జీజీహెచ్‌)లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సుమారు మూడు గంటల పాటు అన్ని విభాగాల్లో తనిఖీలు చేశారు. రోగులు, వారి సహాయకులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ వైర్లు, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్ల(ఐసీయూ)లో ఏసీ పని చేయకపోవడం, చాలామంది రోగులకు పీజీ డాక్టర్లే వైద్య సేవలు అందించడంపై మండిపడ్డారు. ఆస్పత్రిలో తమకు మెరుగైన వైద్యం అందడంలేదని ఈ సందర్భంగా పలువురు రోగులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

దీంతో కలెక్టర్‌ వైద్యుల తీరుపై మండిపడ్డారు. ప్రతి విభాగంలోనూ సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలాగని ప్రశ్నించారు. పదేపదే విమర్శలు వస్తున్నా ఎప్పటికీ తీరు మార్చుకోరా అంటూ నిలదీశారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్, గైనిక్, మాతాశిశు విభాగం, మెడికల్, ఎమర్జెన్సీ, కేన్సర్, ఈఎన్‌టీ, కంటి, డెంటల్, సర్జికల్‌ విభాగాలు, సదరం సర్టిఫికెట్స్‌ మంజూరు విభాగం, ఆర్థోపెడిక్‌ విభాగంలోని ఆపరేషన్‌ థియేటర్, బ్లడ్‌బ్యాంకు వంటివాటన్నింటినీ కలెక్టర్‌ తనిఖీ చేశారు. వర్క్‌షాప్‌ భవనాన్ని పరిశీలించిన ఆయన వెంటనే దానిని కూల్చివేయాలని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. మందులు భద్రపరిచే గదిని పరిశీలించిన కలెక్టర్‌ ఒక క్రమ పద్ధతి పాటించడం లేదని, మందులు పెట్టే ప్రదేశాలు అధ్వానంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. తాళం వేసిన ప్రతి గదినీ ఆయన ప్రత్యేకంగా పరిశీలించడం కనిపించింది. కలెక్టర్‌ వస్తున్నారన్న సాకుతో మాతా, శిశువులకు అన్నం తీసుకువెళ్లే తమను మాతా శిశు విభాగం ముందు మిట్ట మధ్యాహ్నం రెండు గంటలకు పైగా ఎండలో నిలబెట్టడంపై రోగుల సహాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో ట్రైనీ కలెక్టర్‌ ధ్యాన్‌చంద్ర, జేసీ–2 సత్తిబాబు, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు, రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌.మహాలక్ష్మి, సీఎం ఆర్‌ఎంవో డాక్టర్‌ బి.సత్య సుశీల, ఆర్‌ఎంవో డాక్టర్‌ సుధీర్‌ పాల్గొన్నారు.

ముందస్తు సమాచారంతో జాగ్రత్త పడ్డ వైద్యులు
కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీకి వస్తున్నారన్న సమాచారం ముందుగానే తెలియడంతో జీజీహెచ్‌ అధికారులు అన్ని విభాగాల్లోనూ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వైద్యులకు తెలియకుండా వస్తేనే ఆస్పత్రిలో నిర్లక్ష్యం బయటపడేదని పలువురు అన్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటోందని, కలెక్టర్‌ వస్తున్నారని ముందుగానే సమాచారం అందడంతో యంత్రాలతో శుభ్రం చేయించడం కనిపించిందని రోగుల వద్ద ఉన్న సహాయకులు చెప్పారు. కనీసం వారానికి ఒకసారైనా కలెక్టర్‌ తనిఖీలు చేస్తే రోగులకు సరైన వైద్యం అందుతుందని అన్నారు. కలెక్టర్‌ తనిఖీ ఉందని తెలియడంతో గార్డెన్‌లో గడ్డి తొలగించడం, ప్రతి వార్డులోకి కలెక్టర్‌ వెళ్లే ముందే స్ప్రేలు వినియోగించడం వంటివాటితో సిబ్బంది హడావుడి చేశారు. పీజీ వైద్యులు ఒకరిద్దరు తప్ప అన్ని వార్డుల్లోనూ వైద్యులు ఉండేలా అధికారులు జాగ్రత్తలు చేపట్టారు.

మౌలిక సౌకర్యాలు కల్పిస్తాం : కలెక్టర్‌
జీజీహెచ్‌లోని అన్ని విభాగాల్లో రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించామని, కొన్నిచోట్ల వైద్య సేవలు సక్రమంగా లేవని, దీనిపై చర్యలు చేపడతామని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా వివరించారు. జీజీహెచ్‌ను పరిశీలించిన సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆస్పత్రిలో మౌలిక సౌకర్యాల మెరుగుదలకు తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రిలో ప్రతి విభాగానికీ ఒక జిల్లా స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించి, మెరుగైన వైద్యసేవలు అందించడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. జీజీహెచ్‌లో అవసరమైన సదుపాయాల కల్పనకు నివేదిక రూపొందించాల్సిందిగా జాయింట్‌ కలెక్టర్‌ ఎ.మల్లికార్జునను ఆదేశించామన్నారు. రానున్న 15 రోజుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయన్నారు. ఆస్పత్రిలో 75 నుంచి 80 శాతం రోగులకు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. మహిళా, శిశు విభాగంలో పడకల కొరత ఉందని, ఇక్కడివారికి మానసిక వైద్యం అందించే వార్డులో ఖాళీగా ఉన్న పడకలను వినియోగించాలని ఆదేశించినట్లు కలెక్టర్‌ వివరించారు. స్మార్ట్‌ సిటీ పనుల్లో భాగంగా ఆస్పత్రిలో మల్టీ లెవెల్‌ పార్కింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఆగస్టు నెలలో 62 మంది హైరిస్క్‌ గర్భిణులకు మెరుగైన వైద్యం అందించడం ద్వారా సుఖ ప్రసవాలు జరిగాయని కలెక్టర్‌ వివరించారు.

తగ్గిన మలేరియా : జిల్లాలో 20117–18 సంవత్సరంలో 4 వేల మలేరియా కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆగస్టు వరకూ 900 మాత్రమే నమోదయ్యాయని కలెక్టర్‌ మిశ్రా తెలిపారు. ఈ కేసులు 1,500కు మించకుండా చర్యలు తీసుకుంటున్నామని, వచ్చే ఏడాది మరింత తగ్గేలా చర్యలు చేపడతామని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top