దేవినేనింతే! | devineni uma | Sakshi
Sakshi News home page

దేవినేనింతే!

Apr 18 2015 2:49 AM | Updated on Jun 1 2018 8:52 PM

‘‘హంద్రీ-నీవాను పూర్తి చేసే బాధ్యత మాది. ఏడాదిలో పూర్తి చేసి అనంతపురం పొలాలకు సాగునీరు అందిస్తాం’’- ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మంత్రి దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలు.

‘‘హంద్రీ-నీవాను పూర్తి చేసే బాధ్యత మాది. ఏడాదిలో పూర్తి చేసి అనంతపురం పొలాలకు సాగునీరు అందిస్తాం’’- ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మంత్రి దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలు. అప్పటి బడ్జెట్‌లో వందకోట్లు మాత్రమే కేటాయించారు.
 
 ‘‘హంద్రీ-నీవాను పూర్తి చేసి 40 టీఎంసీల నీరు అందిస్తాం. ఏడాదిలో పూర్తి చేసేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.’’- గురు, శుక్రవారాల్లో హంద్రీ-నీవా గట్లపై మంత్రి వ్యాఖ్యలు.
 
  ‘‘హంద్రీ-నీవాపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. ఏడాదిలో పూర్తి చేస్తామని మాట ఇచ్చాం. ఆ మాటను తప్పకుండా నిలుపుకుంటాం. ఏడాదిలో పూర్తి చేసి తీరుతాం.’’- మార్చిలో మంత్రి దేవినేనితో పాటు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంయుక్తంగా హంద్రీ-నీవాపై పర్యటించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు. ఈ బడ్జెట్‌లో 220 కోట్ల రూపాయలు  కేటాయించి మమ అనిపించారు.
 
 సాక్షి ప్రతినిధి, అనంతపురం:  నవ్విపోదురుగాక మాకేటి.. అన్నట్లుంది దేవినేని తీరు. మరో రెన్నెళ్లు గడిస్తే ఏడాదిలో హంద్రీ-నీవాను పూర్తి చేస్తామని నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మొదట ప్రకటించి ఏడాది అవుతుంది. భారీనీటిపారుదలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడుసార్లు ‘అనంత’ పర్యటనకు వచ్చారు. వచ్చిన ప్రతిసారీ ఏడాదిలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పినమాటనే చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జిల్లా మంత్రులు కూడా అదే మాటలు వల్లె వేస్తున్నారు.
 
 వీరిలో ఏ ఒక్కరూ ప్రాజెక్టు పనులు ఏమేరకు పూర్తయ్యాయి? ఇంకెంత శాతం పనులు పూర్తి కావాల్సి ఉంది? ఏ మేరకు నిధులు కావాలి? ఎంత కాలంలో పూర్తవుతుంది? అని బహుశా ఆలోచించినట్లు లేదు. కేవలం మాటలతో ‘అనంత’ వాసులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆయన మంత్రి వర్గం, జిల్లా ఎమ్మెల్యేలు ఏ ఒక్కరూ ప్రాజెక్టు పూర్తిపై శ్రద్ధ చూపడం లేదు. సీఎంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్‌ల కేటాయింపుల్లోనూ హంద్రీ-నీవాకు ప్రాధాన్యత దక్కలేదు. మొదటి బడ్జెట్‌లో కేవలం వందకోట్లు కేటాయిస్తే, ఆ ఏడాది బడ్జెట్‌లో 220 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు.
 
 ప్రాజెక్టు పూర్తికి మరో రూ.1800 కోట్లు అవసరం: హంద్రీ-నీవా పథకం పనులు 80 శాతం మేర పూర్తయ్యాయి. మరో 20శాతం పూర్తికావాలి. డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ ఇంకా మొదలే కాలేదు. కర్నూలు జిల్లా మల్యాల నుంచి అనంతపురం జిల్లా వరకూ మొదటి విడత పథకం పూర్తి కావాలంటే మరో రూ. 520 కోట్ల అవసరమని అధికారులు చెబుతున్నారు. ఈ రెండు జిల్లాలతో పాటు వైఎస్సార్, చిత్తూరు జిల్లాలో రెండో విడత కూడా పూర్తి కావాలంటే మరో రూ.1800 కోట్ల అవసరం.
 
 ఏడాదిలో పూర్తి చేస్తామని గతేడాది చంద్రబాబుతో పాటు మంత్రి దేవినేని ఉమ ప్రకటించడంతో సరిపడా నిధులు పూర్తిస్థాయిలో విడుదల చేస్తారని రైతులు సంబరపడ్డారు. అయితే కేవలం రూ.100కోట్ల  మాత్రమే విడుదల చేశారు. ఉద్యోగుల వేతనాలు, కరెంటుబిల్లుల బకాయిలే రూ.170కోట్ల దాకా ఉన్నాయి. ఈ నిధులు ఏ మూలకు సరిపోలేదు. గత నెలలో సీఎం బావమరది బాలకృష్ణ, మంత్రి దేవినేని ఉమతో పాటు జిల్లా నేతలు హంద్రీ-నీవా కాలువపై రెండోసారి పర్యటన చేపట్టారు. ఏడాదిలో పూర్తి చేస్తామని మళ్లీ చెప్పారు.
 
 ఇదే క్రమంలో మదనపల్లిలో జరిగిన ఓ బహిరంగసభలో సీఎం కూడా ఇదే మాటలను వల్లె వేశారు. ఏడాదిలో హంద్రీ-నీవా ద్వారా చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకొస్తామన్నారు. సీఎం చెప్పడంతో ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తారని, రెండేళ్లలో పనులు పూర్తవుతాయని అంతా భావించారు. అయితే గత నెల బడ్జెట్‌లో రూ.220 కోట్లే కేటాయించారు. ఈ ఏడాదికి సంబంధించి 16.2 టీఎంసీల నీళ్లు హంద్రీ-నీవా ద్వారా ఎత్తిపోశారు.  దాదాపు రూ.130కోట్ల కరెంటు బిల్లులు, అధికారుల వేతనాలకు మరో రూ.70కోట్ల అవసరం. ప్రభుత్వం కేటాయించిన నిధులు వీటికే సరిపోతాయి. మరి కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేసేందుకు నిధులు ఎక్కడ ఉన్నాయో మంత్రి దేవినేని సమాధానం చెప్పాలి?
 
 చిత్తశుద్ధి లేని పర్యటనలు ఏల ‘దేవినేని’?:
 హంద్రీ-నీవాకు నిధుల కేటాయింపు వివరాలు పరిశీలిస్తే ప్రాజెక్టు పూర్తిపై సర్కారుకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఇట్టే తెలుస్తుంది. అయినా దేవినేని రెన్నళ్లకోమారు బుగ్గకారులో కాలువగట్లపైకి రావడం...జిల్లా టీడీపీ నేతలంతా ఆయనతో పాటు వెళ్లడం కాలువ గట్లపై ఫోటోలు దిగడం... షరా మామూలైపోతోంది. కనీసం జిల్లాలోని ఇద్దరు మంత్రలతో పాటు అధికారపార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్రాజెక్టుపై స్పందించడం లేదు. ‘ఏడాదిలో పూర్తి చేస్తామని పది నెలలుగా చెబుతున్నావు. నిధులు చూస్తే మరో పదేళ్ల కూడా ప్రాజెక్టు పూర్తయ్యేలా లేదు. చెప్పేమాటలకు,..చేసేపనులకు ఏమాత్రమైనా పొంతన ఉందా?’ అని పల్లె, పరిటాలతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరూ మంత్రిని అడగడం లేదు.  
 
 శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం
 - బీకే పార్థసారథి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు
 పెరిగిన ధరలతో హంద్రీ-నీవా కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు సమస్యగా ఉంది. దీనికి సంబంధించి అధికారులు రివ్యూ చేశారు. పెరిగిన రేట్లకు అనుగుణంగా ధరలు పెంచేలా ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంది. దీన్ని కిరణ్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది. త్వరలోనే అడ్డంకులను అధిగమించి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఈ ఏడాది గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు రప్పిస్తాం.
 
 
 ఒక్కసారైనా నిజం మాట్లాడండి
 - విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే, ఉరవకొండ.
 ప్రాజెక్టును పూర్తి చేయాలంటే సరిపడా నిధులు కేటాయించాలి. ఆపై ఏడాదిలో పూర్తి చేసేలా అధికారులను పరుగులు పెట్టించాలి. కాలువగట్లపై తిరగడం..నిద్ర చేయడం ప్రతిపక్షపార్టీలు చేస్తే అర్థం ఉంటుంది. అధికారం మీ చేతులో ఉంది? అలాంటప్పుడు ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా గట్లపై నిద్రపోతే ఏమొస్తుంది. ‘సీమ’కు ద్రోహం చేస్తున్న చంద్రబాబును నిద్రలేపండి. నిధులు కేటాయించండి. ప్రాజెక్టు పూర్తవుతుంది. అంతేకానీ ఏడాదిలో పూర్తి చేస్తామని 10 నెలలుగా చెబుతున్న అబద్దాలు...మరో పదేళ్లు చెప్పినా ప్రాజెక్టు పూర్తి కాదు.
 
 ఉత్తుత్తి పర్యటనలతో ఒరిగేది ఏమీ లేదు
 - జగదీష్, సీపీఐ జిల్లా కార్యదర్శి
 హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తికి నిర్ధిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ప్రకటించకుండా ఉత్తుత్తి పర్యటు చేయడం వల్ల ఒరిగే ప్రయోజనం ఉండదు. పనులు పూర్తికి అసవరమైన నిధులు కేటాయించాలి. చాలా చోట్ల భూసేకరణ జరగలేదు. 14వ ప్యాకేజీ కదిరి వద్ద మూడు అక్విడెక్ట్‌లు నిర్మించాల్సి ఉంది. వీటికి నిర్మాణానికి రెండేళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖరీఫ్‌కి 40 టీఎంసీల నీరు ఎలా ఇస్తారు. గుత్తేదారుల సమస్యలూ పరిష్కరించాలి. వీటన్నిటిపై కనీస ప్రకటన చేయకుండా పూర్తి చేస్తామని చెప్పడం మరోమారు ప్రజలను తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం మోసం చేయడమే అవుతుంది.
 
 
 పర్యటనలు చేస్తే ప్రాజెక్టు పూర్తి కాదు
 - రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి
 ఏడాదిలోగా హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతూ మంత్రులు పర్యటించడం ఇది మూడో సారి. ప్రాజెక్టు పూర్తి చేయడంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిధులు కేటాయించి పనులు ప్రారంభమయ్యేలా చూడాలి. ఆ తరువాత పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించేందుకు పర్యటనలు చేయాలి.
 
 అలా కాకుండా నిధులు ఇవ్వకుండా మభ్యపెట్టేందుకు పర్యటిస్తున్నారు.  ఏడాదిలో పూర్తి చేస్తామని అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పారు. రెండు నెలలు గడిస్తే ఏడాది పూర్తవుతుంది. ఇప్పటి వరకు ప్రాజెక్టు పనులు ఇంచు ముందుకు కదలలేదు. మంత్రి తన పర్యటనలో ఎక్కడా స్పష్టమైన ప్రకటన చేయకుండా ఖరీఫ్‌కి నీరిస్తామని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రజలను మోసం చేసేందుకు మంత్రి పర్యటిస్తున్నట్లుగా ఉంది. ప్రాజెక్టుకి నిధులు కేటాయించకపోతే భారీ స్థాయిలో ఉద్యమిస్తాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement