అదుపులోనే నేరాలు : సీపీ | Crime control: CP | Sakshi
Sakshi News home page

అదుపులోనే నేరాలు : సీపీ

Dec 21 2014 1:42 AM | Updated on Sep 2 2017 6:29 PM

అదుపులోనే నేరాలు : సీపీ

అదుపులోనే నేరాలు : సీపీ

గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది నేరాలను అదుపులోనే ఉంచగలిగామని నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు.

విజయవాడ సిటీ : గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది నేరాలను అదుపులోనే ఉంచగలిగామని నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. వచ్చే ఏడాది నేరాల సంఖ్యను తగ్గించడంతోపాటు కేసుల దర్యాప్తు, సొత్తు స్వాధీనంలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. పోలీసు కమిషనరేట్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలి అర్ధ సంవత్సరంలో పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నందున నేరాల సంఖ్య పెరిగిందన్నారు. రెండో అర్ధ సంవత్సరంలో పోలీసులు నేరాలను గట్టిగా నిలువరించే ప్రయత్నం చేశారన్నారు. ఈ ఏడాది రూ.8,64,81,828 సొత్తు చోరీకి గురి కాగా, రూ.3,31,15,020 రికవరీ చేశామని తెలిపారు. ఇంటి దొంగతనాలు, మోసాలు, అత్యాచారం కేసులు కూడా అదుపులోనే ఉన్నాయన్నారు. రోడ్డు ప్రమాద మృతులను తగ్గించడంలో పోలీసులు సఫలీకృతమైనట్లు చెప్పారు. మగ పోలీసులతో సమస్యలు చెప్పుకోలేని మహిళలు తమకు పరిచయస్తులైన మహిళా పోలీసులతో చెప్పుకోవచ్చన్నారు.

ఇందుకు స్టేషన్ పరిధితో నిమిత్తం లేదని తెలిపారు. న్యాయవాది తానికొండ చిరంజీవిపై అపార్టుమెంట్ ప్లాటు ఆక్రమణ కేసు నమోదు చేయడం వెనుక హైకోర్టు ‘ఆపరేషన్ నైట్ డామినేషన్’పై స్టే విధించడానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ స్టేపై తాము హైకోర్టులో కౌంటర్ దాఖలు చేస్తున్నామన్నారు. ఇంటి వద్దకే ఎఫ్‌ఐఆర్‌కు విశేష ఆదరణ లభిస్తున్నట్టు సీపీ తెలిపారు. ఇప్పటివరకు శోధన వాహనాల్లో  200పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని తెలిపారు. పోలీసు సేవలు కావాల్సిన వారు డయల్-100ను విరివిగా వినియోగించుకోవాలని ఆయన చెప్పారు. వచ్చే సంక్రాంతిలోపు డయల్-100 విజయవాడ నుంచే పని చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. చోరీకి గురైన మోటారు సైకిళ్ల ఆచూకీ కోసం త్వరలోనే ప్రత్యేక తనిఖీ చేపట్టనున్నామని చెప్పారు. ఈ సమావేశంలో డీసీపీలు తఫ్సీర్ ఇక్బాల్, జీవీజీ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement