సీపీఎం సీనియర్‌ నేత జక్కా వెంకయ్య కన్నుమూత

CPM senior leader Jakka Venkiah is dead - Sakshi

నెల్లూరురూరల్‌:  సీపీఎం సీనియర్‌ నేత, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన జక్కా వెంకయ్య (88) అనారోగ్యంతో మంగ ళవారం కన్నుమూ శారు. ఐదు రోజుల క్రితం ఆయనకు గుండె సమస్య తలెత్తడంతో స్థానిక సింహపురి స్పెషాలిటీ ఆస్ప త్రిలో సీపీఎం నాయకులు వైద్యం కోసం చేర్పిం చారు. పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం 10 గంటలకు తుది శ్వాస విడిచారు. దక్షిణభారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్యకు వరుసకు సోదరుడయిన జక్కా వెంకయ్య ఆయన సహచరుడిగా అనేక ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. సీపీఎం కేంద్ర కమిటీలో పనిచేశారు. జిల్లాలో భూపోరాటాలకు కేంద్రబిం ధువుగా నిలిచారు. పేదలకు వేలాది ఎకరాలు భూములు దక్కేందుకు కారణమయ్యారు. రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన సారా వ్యతిరేక ఉద్యయంలో కీలకపాత్ర పోషించారు.  జక్కా వెంకయ్య రాసిన రాజకీయ ‘అర్ధశాస్త్రం, అదనపు విలువ–శ్రమ దోపిడీ’ అనే పుస్తకాలు విస్తృత పాఠకాదరణ పొందాయి.ఉద్యమకారులకు కరదీపికలుగా ఉపయోగపడ్డాయి.

జక్కా వెంకయ్య నెల్లూరు జిల్లా దామరమడుగులో జక్కా రమణయ్య, శంకరమ్మ దంపతులకు 1930 నవంబర్‌ 3వ తేదీన జన్మించారు.1948 నుంచి 1951 వరకు కమ్యూనిస్టు పార్టీ నిషేధ సమయంలో రహస్యంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. దామరమడుగు గ్రామంలో పార్టీ నేతలకు రక్షణ కల్పించారు. అప్పటి ప్రభుత్వం ఆయనను 15 రోజులు జైలుకు పంపించింది. 1956లో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.1964లో కమ్యూనిస్టు పార్టీ చీలికతో సీపీఎంలో చేరారు. 1965లో డిటెన్యూగా రాజమండ్రి జైలులో సంవత్సరం ఐదునెలల జైలు జీవితం గడిపారు. 1975 ఎమెర్జెన్సీలో డిటెన్యూగా 17 నెలలు నెల్లూరు జైలులో ఉన్నారు. అక్కడ గౌతు లచ్చన్న, సత్యనారాయణరెడ్డి తదితరులకు రాజకీయ తరగతులు బోధించారు. 1985,1994లో అల్లూరు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995 నుంచి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా దీర్ఘకాలం పనిచేశారు. 2002లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 

పలువురి సంతాపం
సీపీఎం సీనియర్‌ నేత జక్కా వెంకయ్య మృతికి సీపీఎం రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఆయన మృతి పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని నివాళులు అర్పించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు విజయవాడలో ఓ ప్రకటన విడుదల చేశారు.జక్కా వెంకయ్య మృతికి సంతాప సూచకంగా రాష్ట్ర కార్యాలయంపై అరుణపతాకాన్ని అవనతం చేసినట్టు తెలిపారు.పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు తమ సంతాపాన్ని తెలియజేశారు.  సీపీఐ రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది.పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఓ ప్రకటనలో నివాళులు అర్పించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్‌రెడ్డితో పాటు వివిధ పార్టీకు చెందిన నాయకులు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top