ఎర్రదండు గర్జన | Sakshi
Sakshi News home page

ఎర్రదండు గర్జన

Published Thu, Feb 27 2014 4:32 AM

cpi conducted Porugarjana in khammam

ఖమ్మం/ ఖమ్మం సిటీ, న్యూస్‌లైన్: తెలంగాణ పునర్నిర్మాణం..జిల్లా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కదంతొక్కింది. పోరుగర్జన పేరిట ఖమ్మంలో బుధవారం భారీ ప్రదర్శన, బహిరంగసభ నిర్వహించింది. జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ సభకు తరలివచ్చారు. తమ సమస్యలపై గర్జించారు. సభా ప్రారంభానికి ముందు తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. పలు రకాల డిమాండ్లను సభ ముందు ఉంచారు. ఆంక్షలు లేని ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటు, ముంపు ప్రాంతాలను తెలంగాణ నుంచి విడదీయరాదు, పోడు భూములకు పట్టాలివ్వాలి, మౌలిక వసతులు కల్పించాలి, గ్రీన్‌హంట్ ఆపరేషన్లు నిలిపివేయాలి, తెలంగాణ ఉద్యమ వీరుల విగ్రహాలను హైదరాబాద్, జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి, ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలి...మొత్తం 28 డిమాండ్లను పార్టీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు సభ ముందుంచారు. వీటికి సభ ఆమోదం తెలిపింది.

 జిల్లాలోని గిరిజనులు, ఇతర అట్టడుగు వర్గాలకు ప్రత్యేక తెలంగాణ ఫలాలు అందినప్పుడే ఆరు దశాబ్దాల కల సాకారమైనట్టని సభకు ముఖ్య అతిథిగా హాజరైన జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జిల్లా ప్రజలు, ఉద్యమకారులు చూపిన పోరాట పటిమ చిరస్మరనీయమన్నారు. వేలాదిమంది తెలంగాణ అమరుల త్యాగాల ఫలమే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అని ఎన్డీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. రాష్ట్రం వస్తుందనే సంతోషం ఉన్నా.. జిల్లాలోని గిరిజనులు, కొండరెడ్లు, కోయ, ఇతర ఆదివాసీలు, వారి సంస్కృతి జలసమాధి అవుతుందనే బాధ వెంటాడుతోందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఇచ్చినంత మాత్రాన యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీని దేవత అని సంబోధించడం సరికాదన్నారు. 60 ఏళ్లుగా ఇక్కడి ప్రజలు చేస్తున్న ఉద్యమాలకు జంకి జంకి రాష్ట్రం ఇచ్చారన్నారు. భౌగోళికంగా రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన జిల్లాలో సమస్యలు తీరవని, వాటి పరిష్కారానికి పోరాటాలు చేయాల్సిందే అన్నారు. పోలవరం ముంపు, సింగరేణి ఓపెన్‌కాస్టుల విధ్వంసం, టేల్‌పాండ్ భూముల నష్టం...తదితర అంశాలు మనముందు శాపాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, గిరిజన, మైనింగ్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు, ఉపాధి మార్గాలు చూపడం వంటి లక్ష్యాలు మనముందున్నాయన్నారు. రాష్ట్రంలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు రమ అన్నారు.

 అంగన్‌వాడీలు, బీడీ, పారిశుధ్య మహిళా కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.  మహిళలకు న్యాయం జరిగే వరకు ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు పోరుపథంలో నడిచి తెలంగాణ ఉద్యమానికి శక్తిని ఇచ్చారని ఆమె అన్నారు. ఈ సభలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పంజాబ్ నాయకులు ఎస్‌ఎస్ మాల్, రాష్ట్ర నాయకులు గాదె దివాకర్, బలచంద్ర సంగిడి, కెచ్చెల రంగయ్య, గుమ్మడి నర్సయ్య, రాయల చంద్రశేఖర్, జేఏసీ నాయకులు ఏలూరి శ్రీనివాసరావు, వెంకటపతిరాజు, కూరపాటి రంగరాజు, బిచ్చాల తిరుమలరావు, ఖాజామియా, అరుణోదయ కళాకారులు నాగన్న, రామారావు, సురేష్, ఎన్డీ నాయకులు చంద్ర అరుణ, జగ్గన్న, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి అశోక్, పీవైఎల్ నాయకులు పుల్లయ్య, మాదా భిక్షం, చిల్లగుండ నాగేశ్వరరావు, ఆవులు వెంకటేశ్వర్లు, చలపతి పాల్గొన్నారు.

Advertisement
Advertisement