అప్పుల బాధ భరించలేక ఓ వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
భార్య పరిస్థితి విషమం
గోరంట్ల: అప్పుల బాధ భరించలేక ఓ వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భర్త మృతిచెందగా, భార్య ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. గురువారం ఉదయం అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పుట్టగుడ్లపల్లిలో ఈ సంఘటన జరిగింది. వివరాలు.. పుట్టగుడ్లపల్లికి చెందిన నందిరెడ్డి (72), నంజమ్మ (68) దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ప్రస్తుతం వారు కుమారుడు వద్దనే ఉంటున్నారు. తమకున్న ఐదెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుని జీవించేవారు.
భూగర్భజలాలు అడుగంటిపోవడంతో అప్పుచేసి నాలుగు బోర్లు వేసినా నీళ్లు పడలేదు. దాంతో అప్పుల వాళ్ల ఒత్తిడి ఎక్కువైంది. నాలుగు రోజుల క్రితం అప్పులవాళ్లు ఇంటివద్దకు వచ్చి ఇష్టమొచ్చినట్లు అవమానకరంగా మాట్లాడారు. దాంతో అప్పులు తీర్చే మార్గంలేక ఉన్న భూమి అమ్మి అప్పులు తీర్చేద్దామంటే కుమారుడు అంగీకరించలేదు. తానే ఎలాగో అప్పు తీరుస్తానని, భూమి అమ్మాల్సిన పనిలేదని భీష్మించాడు. నలుగురిలో మర్యాద పోయిందని కుమిలిపోయిన వృద్ధ దంపతులు గురువారం ఉదయం పురుగులమందు తాగి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ప్రమాదంలో నందిరెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా, నంజమ్మను హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.