
అవినీతి ఎమ్మెల్యే జలీల్‌ఖాన్
పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సెటిల్‌మెంట్ కోసమే తెలుగుదేశంపార్టీలో చేరారే తప్ప, నియోజకవర్గం అభివృద్ధి....
మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత వెలంపల్లి శ్రీనివాస్
సాక్షి, విజయవాడ : పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సెటిల్‌మెంట్ కోసమే తెలుగుదేశంపార్టీలో చేరారే తప్ప, నియోజకవర్గం అభివృద్ధి గురించి కాదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. శనివారం వన్‌టౌన్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో జలీల్‌ఖాన్ అవినీతి భాగోతాన్ని వెలంపల్లి శ్రీనివాస్ ఎండగట్టారు. జలీల్‌ఖాన్ అవినీతినిపై మాట్లాడుతూ ఆధారాల సహా వెల్లడించారు. తారాపేటలో కరీంకాంప్లెక్స్ స్థలం వక్ఫ్‌బోర్డుదని, దాన్ని తక్కువ రేటుకుకొని భార్య, తమ్ముడు పేరుతో మార్చుకున్నారని చెప్పారు. ఆ తరువాత ఆ కాంప్లెక్స్‌ను వ్యాపారులకు విక్రయించి రూ.50 కోట్ల మేరకు లబ్ధిపొందారన్నారు. ఈ కాంప్లెక్స్‌ను వక్ఫ్‌బోర్డు స్వాధీనం చేసుకునేందుకు హైకోర్టులో కేసు వేయడంతో వాటిని కొనుగోలు చేసిన వారు జలీల్‌ఖాన్ పై వత్తిడి తేవడంతో, కాంప్లెక్స్‌ను క్రమబద్ధీకరించుకునేందుకు టీడీపీలో చేరారని వివరించారు.జలీల్ భార్య పేరుతో ఆస్తులు కొన్న డాక్యుమెంట్ నకళ్లను మీడియాకు ఇచ్చారు.
తారాపేటలోని ఇంటి పైఅంతస్తు నిర్మించి పేద లకు ఉయోగిస్తానంటూ కార్పొరేషన్‌నుంచి అనుమతిపొంది, రవీంద్రభారతి స్కూల్‌కు లీజుకు ఇచ్చి లక్షలు గడిస్తున్నారన్నారు. భవానీపురం సర్వే నంబర్ 10లో వక్ఫ్‌బోర్డు స్థలంలో 45 మంది వ్యాపారుల లీజును రద్దు చేయిస్తానని బెదిరించి రూ.45 లక్షలు వసూలు చేశారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా షేక్ రాజా హాస్పటల్‌ను 30 పడకల హాస్పటల్‌గా మార్చేందుకు జీవో తెచ్చానని, విద్యాధరపురంలో 9 ఎకరాల లేబర్ కాలనీలోని స్థలాన్ని స్టేడియంగా మార్చేందుకు రూ.2.10 కోట్లు మంజూరు చేయించానని చెప్పారు.
ఈ రెండేళ్లలో ఈ ఉత్తర్వులను అమలు చేయించలేని అసమర్థ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ అని వెలంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నగరాభివృద్ధి కోసం రూ.450 కోట్లు మంజూరు చేశారని ఈ నిధుల్ని ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమాలు తమ నియోజకవర్గాల్లో సద్వినియోగం చేసుకుంటే జలీల్‌ఖాన్ పట్టించుకోవడం లేదన్నారు. పశ్చిమ కార్పొరేటర్లే కార్పొరేషన్ నిధులు తెచ్చుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారని తెలిపారు.
జలీల్‌ఖాన్ బెదిరింపులకు భయపడకండి
గత ఎన్నికల్లో తనకు ఓటు వేసిన వారిని గుర్తించి ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ బెదిరిస్తున్నారని వెలంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. రోడ్లను విస్తరిస్తామంటూ అధికారులతో 25 అడుగులకు మార్కింగ్ చేయించి, ఆతర్వాత రోడ్డు విస్తరణ పది అడుగులకు తగ్గిస్తానంటూ వ్యాపారులతో బేరలు సాగిస్తున్నారని తెలిపారు. ఆయన బెదిరింపులకు భయపడి డబ్బు ఇవ్వవద్దని, తనని కలిస్తే వారికి అండగా ఉండి పోరాటం చేస్తామన్నారు. ఈ విషయాన్నిమంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గుర్తుంచుకోవాలన్నారు.సమావేశంలో ఏలూరు వెంకన్న, వక్కలగడ్డ శ్రీకాంత్, మైలవరపు దుర్గారావు, బీఎస్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.