‘మరుగు’ మాటున పచ్చదందా!

‘మరుగు’ మాటున పచ్చదందా! - Sakshi


మొదటి విడతలో రూ.వెయ్యి చొప్పున వసూలు  

రెండో విడత పంపిణీలో రూ.3 వేల చొప్పున గుంజుకున్న వైనం  

చినతురకపాలెంలో అధికార పార్టీ నాయకుల అవినీతి

పంపిణీ కేంద్రంలోనే లబ్ధిదారుల నుంచి వసూళ్లు


 


నరసరావుపేటరూరల్ : మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రభుత్వం లబ్ధిదారులకు ఇస్తున్న మొత్తంలో కొంత అధికార పార్టీ నాయకులు దండుకుంటున్నారు. చినతురకపాలెం గ్రామంలో ఒక్కో లబ్ధిదారుని నుంచి రెండు విడతల్లో కలిపి రూ.4 వేల వరకు వసూలు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరుగుదొడ్డి నిర్మించుకున్న ఒక్కో లబ్ధిదారునికి కేంద్ర ప్రభుత్వం రూ.15 వేలు అందిస్తోంది. ప్రభుత్వం లబ్ధిదారులకు ఇస్తున్న ఈ మొత్తంలో కొంత పచ్చచొక్కా నేతలు బొక్కేస్తున్నారు.



   

 బహిరంగంగా వసూళ్లు..  

చినతురకపాలెంలో 263 మంది మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. మొదటి విడత చెల్లింపుల్లో భాగంగా ఒక్కొక్కరికీ రూ.6 వేలు  పంపిణీ చేయాల్సి ఉండగా, రూ.5 వేల చొప్పున మాత్రమే లబ్ధిదారుల చేతికందాయి. రెండో విడత చెల్లింపులను బుధవారం నిర్వహించారు. ఒక్కో లబ్ధిదారునికి రూ.9 వేలు చెల్లించాల్సి ఉంది. పంచాయతీ కార్యదర్శి నాని వీరికి రూ.9 వేలు అందజేసి సంతకాలు తీసుకుంటుండగా, కొందరు టీడీపీ గ్రామ నాయకులు అక్కడకు వచ్చారు. లబ్ధిదారుల వద్ద నుంచి రూ.3 వేల చొప్పున వసూలు చేశారు. దీనిపై గ్రామస్తులు సాక్షికి సమాచారం అందించారు. అక్కడికి వెళ్లిన సాక్షి ప్రతినిధిని చూసి పంపిణీ కేంద్రంలో ఉన్న టీడీపీ నాయకుడు మన్నం షరీఫ్, సర్పంచ్ భర్త మౌలాళి, ఎంపీటీసీ కుమారుడు సైదావలి అక్కడి నుంచి జారుకున్నారు.   

 

 

 అందరూ ఇస్తున్నారని ఇచ్చాం

రెండు నెలల క్రితం మరుగుదొడ్డి నిర్మా ణం పూర్తి చేసుకున్నాం. మొదటి విడతలో రూ.5 వేలు, రెండో విడతలో రూ.6 వేలు ఇచ్చారు. ప్రభుత్వం రూ.15 వేలు ఇస్తుందని తెలుసు. అయితే అందరూ ఇస్తున్నారు కాబట్టి ఏమీ మాట్లాడలేకపోయాం.  అధికారులకు ఇవ్వాలని చెబుతున్నారు.    సిలార్‌బీ, గ్రామస్తురాలు

 

 

 రూ.వెయ్యి అయితే పర్వాలేదు.. రూ.4 వేలు తీసుకుంటున్నారు

మొదటి విడతలో రూ.వెయ్యి తగ్గించి ఇచ్చా రు. నాయకులు, అధికారుల ఖర్చుల  కింద తగ్గిం చుకున్నారనుకున్నాం. ఇప్పుడు మరో రూ.3 వేలు తీసుకున్నారు. ఇలా అయితే ఎలాగా?. మేము పేదవాళ్లం. వాళ్లను ఎలా అడగగలం. హుస్సేన్‌బీ,చినతురకపాలెం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top