చంద్రన్న సంచి... అవినీతిలో నుంచి... | corruption in Sankranti distribution of goods | Sakshi
Sakshi News home page

చంద్రన్న సంచి... అవినీతిలో నుంచి...

Feb 6 2015 3:16 AM | Updated on Sep 18 2018 6:38 PM

చంద్రన్న సంచి... అవినీతిలో నుంచి... - Sakshi

చంద్రన్న సంచి... అవినీతిలో నుంచి...

పేదలసంక్షేమ పథకాల కోసం డబ్బులు లేవంటూ చేతులెత్తేస్తున్న ప్రభుత్వం పచ్చచొక్కా కాంట్రాక్టర్ల కోసం కోట్ల రూపాయల ధనం దుర్వినియోగం చేస్తోందనడానికి చంద్రన్న సంక్రాంతి కానుకల సంచులే ఓ ఉదాహరణ.

చంద్రన్న సంక్రాంతి సరుకుల పంపిణీ అభాసుపాలు కాగా వాటి కోసం పంపిణీ చేసిన సంచులు గోడౌన్లలో మూలుగుతున్నాయి. కార్డుదారులకు ఇచ్చే సరుకుల కన్నా ... ఆ సరుకులు వేసుకునే సంచుల ప్రచారంపైనే పాలకులు దృష్టి పెట్టడంతో జిల్లా వ్యాప్తంగా లక్షల రూపాయల విలువైన సంచులు గోడౌన్లపాలయ్యాయి. ఆకలి తీర్చే ఆర్తి కన్నా కమీషన్ల కక్కుర్తే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. డబ్బులు లేవంటూ బీద అరుపులు అరుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంచులకే కోట్లు వ్యయం చేయడం ... ఆచరణలో వాటిని దుర్వినియోగం చేయడాన్ని ఏ విధంగా సమర్ధించుకుంటారని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
 
* లాభం గోరంత ... వ్యయం కొండంత
* ప్రజాధనం దుర్వినియోగం  
* గోడౌన్లలో మగ్గుతున్న చంద్రన్న సంచులు
* కమీషన్ల కక్కుర్తే ఇందుకు కారణం


దర్శి : పేదలసంక్షేమ పథకాల కోసం డబ్బులు లేవంటూ చేతులెత్తేస్తున్న ప్రభుత్వం పచ్చచొక్కా కాంట్రాక్టర్ల కోసం కోట్ల రూపాయల ధనం దుర్వినియోగం చేస్తోందనడానికి చంద్రన్న సంక్రాంతి కానుకల సంచులే ఓ ఉదాహరణ. రాష్ట్రంలో గత జనవరి నెలలో అత్యంత ఆర్భాటంగా కోట్ల రూపాయలు వెచ్చించి చంద్రన్న కానుకల పేరిట ఆరు ఉచిత సరుకుల సరఫరాకు శ్రీకారం చుట్టింది. ఆ సరుకులన్నీ కార్డుదారుడు వేసుకోడానికి వీలుగా సంచులు ఏర్పాటు చేయాలని భావించింది. అనుకున్నదే తడవుగా ఒక్కో సంచికి రూ.12 రూపాయలు వెచ్చించి సర్కారుకు అనుకూలమైన ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించింది.

ఒప్పందం ప్రకారం సకాలంలో సంచులు ఇవ్వలేకపోవడంతో అప్పటికప్పుడు ప్లాస్టిక్ సంచులు కొనుగోలు చేసి రేషన్ డీలర్లకు ప్రభుత్వం అందజేసింది. గడువు లోపల సంచులు ఇవ్వకపోతే కాంట్రాక్టును రద్దు చేసి బిల్లులను నిలిపి వేయాలి. కానీ దీనికి భిన్నంగా జిల్లాకు వచ్చిన సంచులన్నీ ఆయా డీలర్లకు సరఫరా చేసేయడంతో ఈ సమస్య తలెత్తింది. జిల్లాలో 8,38,423 మంది రేషన్ కార్డుదారులున్నారు. ఆ విధంగా చూస్తే జిల్లాకు 8 లక్షలకు పైగా సంచులు వచ్చినట్టే. అంటే ఒక్కో సంచి రూ. 12 ధర పలికితే 8 లక్షల సంచులకు కోటి రూపాయలపైగానే వెచ్చించారు.

జిల్లా పౌర సరఫరా కార్యాలయానికి వచ్చిన సంచులను కొంతమంది పెద్దల ఒత్తిడి ఫలితంగా ఆయా మండలాలకు పంపించేశారు. చాలా మండలాలకు గడువు అయిపోయాక రావడంతో గోడన్లలో వృధాగా పడి ఉన్నాయి. అవసరం లేకపోయినా కమీషన్ల కక్కుర్తితో ఆయా డీలర్లకు వీటిని అంటగట్టారన్న విమర్శలున్నాయి. దర్శి, దొనకొండ పరిధి గోడౌన్లలో స్థలం లేక బయటనే వీటిని పడవేశారు.

జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకుంది. దర్శి నియోజకవర్గంలో 66,308 మంది రేషన్‌కార్డుదారులున్నారు. దర్శి మండలంలో 18,652, దొనకొండ 11537, ముండ్లమూరు 14481, కురిచేడు 9847, తాళ్ళూరు 11791 మంది రేషన్ కార్డుదారులున్నారు. అంటే ఒక్క దర్శి నియోజకవర్గంలోనే సుమారు రూ.7 లక్షల విలువై న సంచులు బూడిదలో పోసిన పన్నీరులా తయారయ్యాయి.
 
సకాలంలో రాకపోవడం వల్లే...
ఎన్‌ఫోర్సుమెంట్ డీటీ కృష్ణారావును వివరణ కోరగా...గోడౌన్‌కు ‘చంద్రన్న సంక్రాంతి సంచులు’ వచ్చినట్లు నాకు తెలియదు. సమయానికి సంచులు రాకపోవడం వల్లనే వాడుకోలేకపోయాం. వాటికి బదులు ప్లాస్టిక్ కవర్లను ప్రభుత్వం సరఫరా చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement