విభజనపై ప్రజాభిప్రాయ సేకరణకు ఆదేశించండి | Conduct Plebiscite on Andhra Pradesh Partition, PIL filed in supreme court | Sakshi
Sakshi News home page

విభజనపై ప్రజాభిప్రాయ సేకరణకు ఆదేశించండి

Aug 25 2013 3:21 AM | Updated on Sep 1 2017 10:05 PM

ఆంధ్రప్రదేశ్‌ను విభజించడానికి ముందు ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) నిర్వహించేలా, అలాగే రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తెలుసుకొనేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం (పిల్) దాఖలైంది.

* సుప్రీంకోర్టులో పిల్ దాఖలుచేసిన అడుసుమిల్లి జయప్రకాశ్
 
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను విభజించడానికి ముందు ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) నిర్వహించేలా, అలాగే రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తెలుసుకొనేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం (పిల్) దాఖలైంది. దీన్ని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత అడుసుమిల్లి జయప్రకాశ్ దాఖలు చేశారు. విభజన అంశంపై రెండో రాష్ట్రాల పునర్విభజన కమిటీ (ఎస్సార్సీ) ఏర్పాటు చేసేలా కేంద్రానికి మార్గనిర్దేశం చేయాలని ఆ పిటిషన్‌లో విన్నవించారు.

సీమాంధ్ర, తెలంగాణలో మాండలికం భిన్నమనే వాదన తప్పని ఈ పిటిషన్‌లో ప్రస్తావించారు. రాష్ట్రంలో 28 విభిన్న తెలుగు మాండలికాలు వాడుకలో ఉన్నాయని, వాటిలో 12 తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ నాయకులు మాట్లాడుతున్నది స్వచ్ఛమైన తెలుగేనని, అది ఏ ప్రాంత మాండలికమో కాదని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కోసం 53 ఏళ్లుగా ఉద్యమం జరుగుతుందన్న వాదన కూడా వాస్తవం కాదని తెలిపారు.

భాషాప్రయుక్త రాష్ట్రంగా 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1969 వరకు ఎలాంటి ఉద్యమాలూ జరగలేదని నివేదించారు. 1969లో జరిగినప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నేతృత్వం వహించిన తెలంగాణ ప్రజాసమితి 1971లో కాంగ్రెస్ పార్టీలో విలీనమైందని పేర్కొన్నారు. మళ్లీ 2009లోనే ఉద్యమం జరిగిందని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కావాలనే ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించేలా సరైన ఆధారమేమీ లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
 
ఆమోదయోగ్యంగా ‘విభజన’ను పరిష్కరించాలి: హైకోర్టులో పిల్ దాఖలు.
 సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రజల సందేహాలను నివృత్తి చేసి, మూడు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా రాష్ట్ర విభజన సమస్యను పరిష్కరించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి డి.నరేంద్రరెడ్డి శనివారం ఈ పిల్ దాఖలు చేశారు. రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయంతో సీమాంధ్రలో అశాంతి ఏర్పడిందని, ఆత్మహత్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో స్ధిరపడిన సీమాంధ్రుల భద్రత, ఉద్యోగుల సందేహాలు, నీటి సమస్యను పరిష్కరించిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. పిటిషన్‌లో కేంద్ర హోం శాఖ కార్యదర్శిని ప్రతివాదిగా పేర్కొన్నారు. ఈ పిల్ సోమవారం విచారణకు రానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement