నగర పోలీసు కమిషనరేట్‌లో మరోసారి తుపాకీ మోత మోగింది. కొన్నేళ్ల కిందటి ఘటన పునరావృతం కావడంతో కమిషనరేట్ అధికారులు అప్రమత్తమయ్యారు.
విజయవాడ సిటీ : నగర పోలీసు కమిషనరేట్‌లో మరోసారి తుపాకీ మోత మోగింది. కొన్నేళ్ల కిందటి ఘటన పునరావృతం కావడంతో కమిషనరేట్ అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలోని పెదావుటపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం దుండగులు జరిపిన కాల్పుల్లో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన గంధం నాగేశ్వరరావు, అతని కుమారులు పగిడి మారయ్య, మారయ్య దారుణంగా హతమయ్యారు.
ఒకే ఘటనలో ముగ్గురు వ్యక్తులు తుపాకీ కాల్పుల్లో మృతి చెందడం పోలీసు వర్గాలను ఆందోళనకు గురి చేసింది. వెంటనే నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమై అనుమానిత ప్రాంతాల్లో సోదాలు జరుపుతోంది. ఇటీవల తరచూ నగరంలో తుపాకులు పట్టుబడడం కూడా పోలీసుల ఆందోళనకు కారణంగా చెబుతున్నారు. కొద్ది నెలల కిందట రైల్వే స్టేషన్ సమీపంలో ఆగంతకులు వదిలి వెళ్లిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకోగా..ఇటీవల పెడన గ్రామానికి చెందిన మాజీ సైనిక ఉద్యోగిని అరెస్టు చేసి రెండు దేశవాళీ తపంచాలు, 10 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడను ఎంపిక చేసిన తర్వాత నెలకొన్న పరిణామాల్లో తుపాకులు భారీగా దిగుమతి జరుగుతున్నట్టు పోలీసు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ దిశగా పోలీసు అధికారులు దృష్టిసారించారు.
గతంలో జరిగిన ఘటనలు ఓ సారి పరిశీలిస్తే...
పాతికేళ్ల కిందట సూర్యారావుపేటలో ఇంటిలిజెన్స్ అధికారి ఇమ్మానియేల్ రాజును తీవ్రవాదులు తుపాకీతో కాల్చి చంపారు.
పాతబస్తీకి చెందిన సర్జికల్ వ్యాపారి కోటంరాజు లక్ష్మీనారాయణ అలియాస్ పంతులు తుపాకీ కాల్పుల్లో మృతి చెందారు. ఈ కేసులో నిందితులను అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమైన ఐఎస్‌ఐ ఉగ్రవాది అజంఘోరి సంఘటనలో పాల్గొన్నట్టు నిందితుని డైరీ ఆధారంగా అప్పట్లో పోలీసులు గుర్తించారు.
కేబుల్ వార్‌లో భాగంగా సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి సాయిబాబును విశాఖపట్టణానికి చెందిన దేవినేని శేషగిరిరావు తుపాకీతో కాల్చి చంపారు.
నగర తెలుగుదేశం పార్టీ నేత కాట్రగడ్డ నాగమల్లేశ్వరరావుపై కొందరు వ్యక్తులు అతని ఇంట్లోనే తుపాకీ కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచారు.
నగరానికి చెందిన వంగవీటి శంతన్‌కుమార్‌పై కోర్టు సమీపంలోనే దుండగులు కాల్పులు జరపగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత తిరిగి మరోసారి తుపాకీ మోత వినిపించడం నగరవాసులను కలవరపాటుకు గురిచేస్తోంది.