నారాయణా.. అనుమతి ఉందా!

Coaching For Competitive Exams Without Permission In Narayana College - Sakshi

నారాయణలో అనుమతుల్లేకుండా పోటీ పరీక్షలకు కోచింగ్‌  

ప్రైవేటు కాలేజీల్లో కోచింగ్‌ ఇవ్వకూడదని ప్రభుత్వ ఆదేశం 

ఆదేశాలను లెక్కచేయని కార్పొరేట్‌ కాలేజీలు 

నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్న అధికారులు

కర్నూలు సిటీ: కొన్ని కార్పొరేట్, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు ప్రభుత్వ ఆదేశాలను, అధికారుల సూచనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్‌ ఇస్తున్నా బోర్డు అధికారులు తనిఖీలు చేయడం లేదు. ఇందుకు గాయత్రి ఏస్టేట్‌లోని నారాయణ జూనియర్‌ కాలేజీలో కోచింగ్‌ ఇస్తుండటమే నిదర్శనం. దీంతో పాటు లక్ష్మీనగర్‌లోని ఓ నూతన భవనంలోకి ఇటీవల కోచింగ్‌ తరగతులను మార్చారు. అలాగే ఈద్గా సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీ కూడా తరగతులు నిర్వహిస్తోంది. మిగిలిన కార్పొరేట్‌ కాలేజీల్లో తరగతులతో పాటే పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్‌ బోర్డు అధికారులు పట్టనట్ల వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.  

నామ మాత్రపు తనిఖీలు..  
జిల్లాలో ఇంటర్మీడియట్‌ కాలేజీలు 266 ఉండగా వీటిలో 226 మాత్రమే పనిచేస్తున్నాయి. ఇందులో ప్రైవేటు కాలేజీలు 105, కార్పొరేట్‌ కాలేజీలు 18 ఉన్నాయి. ప్రభుత్వ గుర్తింపు ఉన్న జూనియర్‌ కాలేజీల్లో కేవలం ఇంటర్మీడియట్‌ విద్య అందించాలి. పోటీ పరీక్షల తరగతులు నిర్వహించకూడదని, ప్రతి కాలేజీని తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు చేయడంలేదు. స్థానిక గాయత్రి ఎస్టేట్‌లోని నారాయణ కాలేజీలో లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ క్లాస్‌లు నిర్వహిస్తున్నా యాజమాన్యానికి నోటీస్‌లు ఇవ్వలేదు. నీట్, జేఈఈ లాంగ్‌టర్మ్‌ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.70 వేల నుంచి లక్ష వరకు ఫీజులు వస్తున్నా ఆ విషయం తమ దృష్టికి రాలేందంటున్నారు. శ్రీచైతన్యలో తరగతులతో పాటే కోచింగ్‌ క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు నగరంలోని మరికొన్ని ప్రైవేటు కాలేజీల్లో కూడా ఇదే తంతు జరుగుతోందని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు.

తనిఖీలు చేస్తున్నాం.. 
ప్రభుత్వ గుర్తింపు ఉన్న జూనియర్‌ కాలేజీలను తనిఖీ చేస్తున్నాం. కాలేజీల్లో పోటీ పరీక్షలకు కోచింగ్‌ ఇస్తున్నట్లు తెలిసి తనిఖీ చేసి విద్యార్థులను అడిగితే లేదని చెబుతున్నారు. గాయత్రి ఎస్టేట్‌లోని నారాయణ కాలేజీలో కోచింగ్‌ ఇస్తున్నట్లు తెలియడంతో తనిఖీలు చేసి తరగతులు నిర్వహించకూడదని ఆదేశించాం. అయితే వారు మరో భవనంలోకి మార్చినట్లు తెలిసింది. కొన్ని కాలేజీల్లో తరగుతులతో పాటు కోచింగ్‌ క్లాస్‌లు ఇస్తున్న మాట వాస్తవమే. విషయం బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.                
– సాలబాయి, ఇంటర్మీడియట్‌ బోర్డు ఆర్‌ఐఓ   

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ విద్యను కార్పొరేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ గుప్పిట్లో పెట్టుకొని  నిబంధలకు విరుద్ధంగా కాలేజీలను నిర్వహిస్తున్నారని, ఏ కాలేజీలో కూడా కోచింగ్‌ పేరుతో తరగతులు నిర్వహించకూడదని, బోర్డు అధికారులు తనిఖీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం  ఆదేశించింది.

ప్రభుత్వ గుర్తింపు ఉన్న కాలేజీ దగ్గర విద్యార్థుల ఫొటోలతో ప్రచార బోర్డులు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రతి కాలేజీలో కేవలం తరగతులు మాత్రమే నిర్వహించాలి. పోటీ పరీక్షలకు తరగతులు నిర్వహించకూడదు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీలు తీరు మార్చుకోవాలి. అక్టోబర్‌ 22న ప్రైవేటు జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఇంటర్మీడియట్‌ బోర్డు ఆర్‌ఐఓ సాలబాయి సూచించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top