ఇసుకవిధానంపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

CM Ys Jagan Held A Review On Sand Shortage Issue - Sakshi

సాక్షి,  అమరావతి : ఇసుక మాఫియా, స్మగ్లింగ్‌ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇసుక విధానంపై సీఎం వైఎస్‌ జగన్‌ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక ధరలకు కళ్లెం వేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అంతేకాకుండా  ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా ఆర్డినెన్స్‌ సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. జిల్లాలు, నియోజకవర్గాల వారిగా ధలను నిర్ణయించాలని కలెక్టర్లు, గనుల శాఖ అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పోలీసు, గనుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇంకా ఈ సమావేశంలో అధికారులతో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

సరిహద్దుల్లో నిఘా పెంచండి
‘ఎక్కువ ధరకు అమ్మితే జైలుకు పంపేలా చట్టం తీసుకు రండి. ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో ఎంత రేటు పెట్టాలో కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయించండి. రేటు నిర్ణయించాక ధరలను ప్రకటించాలి. నిర్ణయించిన ధరలు ప్రజలకు అర్థమయ్యేలా కలెక్టర్లు ప్రచారం చేయాలి. నిర్ణయించిన రేటుకే ఇసుకను అమ్మాలి. ఈలోగా ఇసుక సరఫరాను బాగా పెంచాలి. సరిహద్దుల్లో నిఘాను పెంచండి. ఎట్టిపరిస్థితుల్లోనూ స్మగ్లింగ్‌ చేయకూడదు. టెక్నాలజీని వాడుకోండి. స్మగ్లింగ్‌ జరిగితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. 

టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలి
ఇసుకను అధిక రేటుకు అమ్ముతున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి,  జైలుకు పంపాలి.  అవినీతికి తావులేకుండా చేస్తున్నాం, అయినా సరే మనం విమర్శలకు గురవుతున్నాం. ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతికి దూరంగా ఉన్నారు, అయినా సరే బండలు వేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. వచ్చే వారం స్పందన నాటికి ఈ రేట్లు, టోల్‌ ఫ్రీ నంబర్‌ ప్రకటించాలి. వచ్చేవారం స్పందన కేవలం ఇసుక సమస్యపైనే నిర్వహిస్తాం. స్పందనలో ఇసుక వారోత్సవం తేదీల ప్రకటిస్తాం.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
275 రీచ్‌ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా? లేదా?. 275 రీచ్‌ల్లో ఏం జరుగుతుందనే దానిపై మనం చూడగలగాలి. ఇసుక తవ్వకాలు నిలిచిపోతే ఎందుకు నిలిచిపోయాయో మనం తెలుసుకునే అవకాశం కలగాలి. మొత్తం 275 చోట్ల కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, మనం లైవ్‌లో చూడగలగాలి. మైనింగ్‌ అధికారులు, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు కంట్రోల్‌ రూంద్వారా చూడగలగాలి. రాత్రి పూట కూడా పనిచేయగలిగే సీసీ కెమెరాలు పెట్టాలి.

అవసరమైతే స్టాక్‌ పాయింట్లు పెంచాలి
వరద నీరు తగ్గగానే అన్ని రీచ్‌లనుంచి ఇసుక సరఫరా ప్రారంభం కావాలి. ప్రతి రీచ్‌ వద్ద సీసీ కెమెరాలు పెట్టాలి. ఇసుక సరఫరా కోసం వాహనాలు పుష్కలంగా అందుబాటులో ఉండాలి. కిలోమీటర్‌కు రూ.4.90 చొప్పున ఇసుక రవాణాకు ఎవరు ముందుకు వచ్చినా వారికి వెంటనే అనుమతి ఇవ్వాలి. ఇసుక నిల్వలు సరిపడా ఉన్నంతవరకూ విరామం లేకుండా పనిచేయాలి. అవసరమైతే ఇంకా స్టాక్‌ పాయింట్లు పెంచాలి. ఇసుక విషయంలో ఎవ్వరూ వేలెత్తిచూపకుండా ఇసుక సరఫరా కావాలి. అలాగే రీచ్‌ల వద్ద ఈ నెలాఖరు నాటికి కెమెరాలు, వే బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలి. ఆలస్యంకాకుండా వేర్వేరు సంస్థలనుంచి సాంకేతిక సహకారం తీసుకోండి.

ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయి
వరదలన్నవి మన చేతిలో లేవు. ఆగస్టునుంచి ఇవ్వాళ్టి వరకూ నదుల్లో అలానే వరద కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చి 5నెలలు అయింది. మంత్రులు జూన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు, పాలనకు సన్నద్ధమయ్యేలోగా ఆగస్టులో వరదలు ప్రారంభం అయ్యాయి. అధికారం చేపట్టిన 5నెలల్లో 3 నెలలు వరదలు వచ్చిన విషయాన్ని గర్తుంచుకోవాలి. ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయి. ఏ ఇష్యూ లేక ప్రతిపక్షాలు ఇసుక అంశాన్ని పట్టుకున్నాయి. మంచి మనసుతో పనిచేస్తున్నప్పుడు కచ్చితంగా దేవుడు సహకరిస్తాడు’అని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులతో పేర్కొన్నాడు. 

మద్యం నియంత్రణపై సమీక్ష
ఇసుక విధానంతో పాటు మద్యం నియంత్రణపై కూడా సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఎవరైనా లిక్కర్‌ అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లిక్కర్‌ అమ్మినట్టు ఫిర్యాదు రాగానే కచ్చితంగా జైలుకు పంపాలని,  దీనిపై కూడా టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలన్నారు. మద్యం నియంత్రణపై కూడా చట్టం తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. దీనిపై విధివిధానాలకు మరో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top