చేనేత, హస్తకళలకు మరింత ప్రోత్సాహం

CM YS Jagan Comments In YSR Nethanna Nestham launch - Sakshi

అక్టోబర్‌ 2న ఈ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

నాణ్యత, లాజిస్టిక్స్, పేమెంట్స్‌ కచ్చితంగా ఉండేలా చర్యలు

రెండో సారి ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌

అర్హులెవరైనా మిగిలితే దరఖాస్తు చేసుకోండి 

వచ్చే నెల ఇదే రోజున సాయం అందిస్తాం

చేనేత సహకార సంఘాలకు గత సర్కారు బకాయిలు రూ.103 కోట్లు విడుదల

మాస్కుల తయారీకి సేకరించిన ఆప్కో వస్త్రాలకు రూ.109 కోట్లు విడుదల 

13 నెలల్లో నవరత్నాల ద్వారా 3.89 కోట్ల మందికి రూ.43 వేల కోట్లు జమ 

ఇందులో నేతన్నలకు రూ.600 కోట్లు

కరోనా కారణంగా కష్టాలున్నాయి. మార్కెట్‌లో అమ్ముకునే పరిస్థితి లేదు. మార్కెట్లు పూర్తిగా ఓపెన్‌ కాలేదు. సరుకుల రవాణా లేదు. కొత్త కొత్త సమస్యలతో యుద్ధం చేస్తున్నాం. అందువల్లే నిజంగా చేనేతలకు మంచి జరగాలన్న తలంపుతో ఈ రోజు ఈ పథకం అమలు చేస్తున్నాం.  

సాక్షి, అమరావతి: చేనేత, హస్తకళల ఉత్పత్తుల మార్కెటింగ్‌కు మరింత ప్రోత్సాహం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా అక్టోబర్‌ 2వ తేదీన ఈ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో మూడు బ్రిడ్జిలు దాటాల్సి ఉందని, ఇందులో ఒకటి సరుకులు, ఉత్పత్తుల నాణ్యత కాగా.. రెండోది లాజిస్టిక్స్‌ (కొనుగోలు విధానం, రవాణా),  మూడోది ఉత్పత్తులకు ఆర్డర్స్‌ ఇస్తే సకాలంలో సరఫరా చేయడం, పేమెంట్స్‌ కచ్చితంగా ఉండేలా చూసుకోవడం అన్నారు. ఇందుకోసం అధికారులు చర్యలు చేపడుతున్నారని చెప్పారు. వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం కింద రూ.196.46 కోట్లను శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రాష్ట్రంలోని అర్హులైన సుమారు 80 వేల చేనేత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు పాత బకాయిల కింద జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో వేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని కలెక్టర్లు, లబ్ధిదారులు, ప్రజా ప్రతినిధులనుద్దేశించి సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

మీ కష్టాన్ని స్వయంగా చూశాను
► నా సుదీర్ఘ 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో దాదాపు అన్ని జిల్లాల్లో చేనేతన్నల కష్టాలు స్వయంగా చూశాను.. విన్నాను. వస్త్రాలు బాగా తయారు చేసినా, మార్కెటింగ్‌ లేకపోవడం.. మరోవైపు ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల వస్త్రాలను అమ్ముకోలేక ఇబ్బందులు పడటం చూశాను.
► అందుకే మగ్గం ఉన్న ప్రతి అక్క, చెల్లెమ్మకు ఏటా రూ.24 వేలు ఇస్తానని హామీ ఇచ్చాను. ఆ మేరకు గత ఏడాది డిసెంబరు 21న నా పుట్టినరోజున వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకాన్ని అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రారంభించాం. ప్రస్తుతం కరోనా కష్టాలు చూశాక, అన్ని రోజులు ఆగితే మీ కష్టాలు ఇంకా పెరుగుతాయని భావించి.. మళ్లీ ఆరు నెలలకే ఇవాళ ఈ పథకం కింద సాయం చేస్తున్నాం. 
వైఎస్సార్‌ నేతన్న నేస్తం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

13 నెలల్లో దాదాపు రూ.600 కోట్లు
► గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో చేనేత కుటుంబాలకు కనీసం రూ.200 కోట్లు కూడా ఇవ్వలేదు. అలాంటిది మనం కేవలం 13 నెలల్లోనే.. నిరుడు రూ.200 కోట్లు, ఇవాళ దాదాపు రూ.400 కోట్లు.. ఇచ్చాం. ఆ విధంగా కేవలం 13 నెలల్లోనే దాదాపు రూ.600 కోట్లు ఇచ్చామంటే దేవుడి దయ.
► గత ప్రభుత్వం ఆప్కోకు బకాయి పెట్టిన రూ.103 కోట్లతో పాటు మాస్కుల తయారీ కోసం ఆప్కో నుంచి తీసుకువచ్చిన వస్త్రాలకు రూ.109 కోట్లు ఇవాళే విడుదల చేస్తున్నాం. ప్రతి పేదవాడికి మంచి జరగాలని ఆరాటపడ్డాం.

ఇంకా మంచి చేయాలన్న తపన ఉంది
► అన్ని వర్గాల ప్రజల కోసం పలు పథకాలు అమలు చేస్తున్నాం. రైతు భరోసా, అమ్మ ఒడి, పెన్షన్‌ రూ.2,250కి పెంపు.. గతంలో 44 లక్షల పెన్షన్లు ఇస్తే ఇవాళ దాదాపు 60 లక్షల మంది అవ్వాతాతలకు పెన్షన్‌ ఇస్తున్నాం.  30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు వచ్చే నెల 8న ఇవ్వబోతున్నాం.
► పేద పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం, నామినేషన్‌ విధానంలో ఇచ్చే పనులు, నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించాం. ఆయా పథకాల ద్వారా 3.89 కోట్ల కుటుంబాలకు దాదాపు రూ.43 వేల కోట్లు నేరుగా వారి వారి ఖాతాలకు నగదు బదిలీ చేశాం.

ఇందులో రూ.600 కోట్లు నేతన్నలకే ఇచ్చాం. 
► 13 నెలల వ్యవధిలోనే పేదలందరికీ మంచి చేయగలిగినందుకు సంతృప్తికరంగా ఉంది. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేశాం. దేవుడి దయ, మీ అందరి దీవెనలతో ఇంకా మంచి చేయాలన్న తపన ఉంది.  

1902కు ఫోన్‌ చేయండి
► ఎవరికి ఏ సమస్య వచ్చినా 1902కు ఫోన్‌ చేయండి. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ప్రతి చేనేత కుటుంబానికి, చేనేతన్నకి భరోసా ఇస్తున్నాను. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎం.శంకరనారాయణ, బొత్స సత్యనారాయణతో పాటు, పలువురు అధికారులు, నేతన్నల ప్రతినిధులు పాల్గొన్నారు. 

పథకం అందకపోతే కంగారు పడొద్దు
► గ్రామ స్థాయి నుంచి గొప్ప మార్పులు చేశాం. వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ ఇందుకు దోహదపడింది. వ్యవస్థలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అవినీతి లేదు. లంచాలు లేవు. వివక్ష లేదు. అర్హత ఉంటే చాలు.. నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేశాం.  
► అందుకే 13 నెలల్లో ఇన్ని చేయగలిగాం. ఇప్పుడు దాదాపు 80 వేల మంది నేతన్నల కుటుంబాలకు మేలు జరుగుతోంది. మగ్గం ఉన్న ప్రతి ఇంటిని వలంటీర్లు పరిశీలించి, వారి పేర్లు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించారు. 
► అర్హులు మిగిలిపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు అర్హత ఉంటే వెంటనే గ్రామ సచివాలయానికి వెళ్లి, మా ఇంట్లో మగ్గం ఉంది కాబట్టి ఆర్థిక సాయం చేయాలని, చేనేత పెన్షన్‌ కావాలని దరఖాస్తు చేయండి. మీకు అర్హత ఉంటే వచ్చే నెల ఇదే తేదీన సహాయం చేస్తాం. మంచి చేయాలి అన్నదే తప్ప, ఎలా ఎగ్గొట్టాలని ఆలోచన అసలు చేయం.   

మా ఆదాయం పెంచుకున్నాం 
15 సంవత్సరాలుగా మగ్గం నేస్తున్నాం. గతంలో చాలా మంది చేనేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్నారు. మా కష్టాలు ఆలకించి ధర్మవరంలో చేనేత కార్మికుల దీక్ష సందర్భంగా నేనున్నానని ఆనాడు మీరు మాకు ధైర్యాన్నిచ్చారు. మీరు ఇచ్చిన ధైర్యంతో, చేసిన సాయంతో ముందుకు సాగుతున్నాం. మొదట్లో మేం గద్వాల్‌ చీరలు నేసేవారం, ఇప్పుడు పెద్ద చీరలు నేస్తున్నాం. గతంలో నెలకు రూ.8 వేలు సంపాదిస్తే.. ఇప్పుడు నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నాం. మరో 30 ఏళ్లు మీరే సీఎంగా ఉండాలన్నా. 
– బాలం లక్ష్మి, సిండికేట్‌ నగర్, రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం జిల్లా  

చేనేత కుటుంబాల్లో వెలుగు నింపారు 
ఏడాదికి రూ.24 వేలు అందించడం ద్వారా చేనేత కుటుంబాల్లో వెలుగు నింపిన దేవుడు మీరు. మీరు అందించిన సాయంతో మగ్గాలకు కావాల్సిన సామాన్లు కొనుక్కొని, మా ఆదాయాన్ని పెంచుకున్నాం. కరోనా కష్టకాలంలో మా ఇబ్బందులను గమనించి ఆరు నెలలు ముందుగానే రెండో సారి నేతన్న నేస్తం కింద మీరు రూ.24 వేలు ఇవ్వడం మాకు ఎంతో భరోసాను కల్పించింది. మీరు మాత్రమే మా కష్టాలు గుర్తించి మాకు అండగా నిలిచారు.  
    – వాసా సత్యవతి, వంగర గ్రామం, తూర్పు గోదావరి జిల్లా 
 
ఇప్పుడు డిజైన్‌ చీరలు నేస్తున్నాం 
గతంలో మాకు చాలీచాలని బతుకు దెరువుగా చేనేత వుండేది. మా స్తోమతను బట్టి ముతక రకాలను నేసే వాళ్లం. దానివల్ల మాకు ఆదాయం కూడా తక్కువగానే వచ్చేది. ఇప్పుడు మీరు నేతన్న నేస్తం ద్వారా అందిస్తున్న రూ.24 వేల సాయంతో సామన్లు కొనుగోలు చేసి డిజైన్‌ చీరెలు నేస్తున్నాం. గతం కంటే మా ఆదాయం కూడా పెరిగింది. మీరే కలకాలం సీఎంగా వుండాలి.  
    – కె.మల్లిబాబు, రాజుల గ్రామం, శ్రీకాకుళం జిల్లా 
 
వదిలేసిన వారు మళ్లీ వృత్తిలోకి వస్తున్నారు  
ఒకప్పుడు వ్యవసాయం తర్వాత చేనేత ప్రధాన రంగంగా వుండేది. కానీ ఆర్థిక ఇబ్బందులకు తాళలేక చాలా మంది ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోయారు. ఏడాదిగా మీరిస్తున్న భరోసాతో తిరిగి వారంతా మగ్గాలను ఏర్పాటు చేసుకుని ఈ వృత్తిలోకి వస్తున్నారు. మా గ్రామంలోనే కొత్తగా 70–80 మగ్గాలు వచ్చాయి. కరోనా వల్ల వస్త్రాల ఎగుమతులు ఆగిపోయాయి. కొనుగోలు చేసే వారు లేక, మాకు ఆదాయం లేకుండా పోయింది. ఈ సమయంలో ఆరు నెలల ముందే మీరిస్తున్న సొమ్ము మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది.   
    – లక్ష్మీనారాయణ, ఈతముక్కల గ్రామం, ప్రకాశం జిల్లా 

ఈ ఏడాదే ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టండి 
నేతన్న నేస్తం రెండో ఏడాది ఆర్థిక సాయం విడుదల కార్యక్రమం అనంతరం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను పలువురు లబ్ధిదారులు కలిశారు. ఈ ఏడాది నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను కచ్చితంగా ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇంగ్లిష్‌ మీడియం విద్యతో తమ పిల్లలకు భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని.. అందుకే మీరు తీసుకున్న నిర్ణయానికి తామంతా మద్దతిస్తున్నామని చెప్పారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top