ఎడ్ల బండ్లకు ఇసుక ఉచితం

CM YS Jagan Comments in review on Sand - Sakshi

ఇసుకపై సమీక్షలో సీఎం జగన్‌ 

సొంత అవసరాలకే వర్తింపు 

నిల్వ చేసి విక్రయిస్తే కఠిన చర్యలు

పోర్టల్‌ నుంచి బల్క్‌ ఆర్డర్ల తొలగింపు 

గ్రామ సచివాలయాల్లో బుకింగ్స్‌

సాక్షి, అమరావతి: నదుల పరిసర గ్రామాల ప్రజల సొంత అవసరాలకు ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లడానికి అనుమతించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్‌కు అవకాశం కల్పించాలని సూచించారు. ఇసుకపై శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. శాండ్‌ పోర్టల్‌ ఓపెన్‌ చేయగానే నిల్వలు ఖాళీ అవుతున్నాయనే భావన ఉండరాదని, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక బుకింగ్స్‌ సమయం కొనసాగించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే..

► శాండ్‌ పోర్టల్‌ నుంచి బల్క్‌ ఆర్డర్లను తొలగించాలి. బల్క్‌ ఆర్డర్లకు సరైన నిర్వచనం ఇవ్వాలి. బల్క్‌ ఆర్డర్లకు అనుమతుల అధికారం జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ)కు అప్పగించండి.
► డిపోల్లో ఇసుకను ఎక్కువగా అందుబాటులో ఉంచండి. ప్రభుత్వ నిర్మాణాలకు బల్క్‌ బుకింగ్‌ ఉంటే సూపరింటెండెంట్‌ ఇంజినీర్, జేసీల ద్వారా అనుమతులు ఇవ్వండి.
► డిపోల నుంచే ఇసుక సరఫరా చేయాలి. నియోజకవర్గమంతా ఒకే రేటు ఉండేలా చూడాలి. ఇసుక రీచ్‌ల్లో అక్రమాలకు తావివ్వకూడదు. 
రోజుకు 3 లక్షల టన్నుల సరఫరాకు సన్నద్ధం
► కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ వల్ల రీచ్‌లన్నీ మూత పడ్డాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడిప్పుడే రీచ్‌లు మళ్లీ ప్రారంభమవుతున్నాయని చెప్పారు. వారం, పది రోజుల్లో రోజుకు 3 లక్షల టన్నుల ఉత్పత్తికి చేరుకుంటామని తెలిపారు. 
► చిన్న చిన్న నదుల నుంచి పరిసర గ్రామాల వారికి ఎడ్ల బండ్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతిస్తామని చెప్పారు. అయితే ఇందుకు పంచాయతీ కార్యదర్శి నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్న షరతు పెడతామని తెలిపారు. 
► ఎడ్ల బండ్ల ద్వారా తీసుకెళ్లి వేరే చోట నిల్వ చేసి, విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. సొంత అవసరాలకే ఎడ్ల బండ్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేలా నిబంధనలు అమలు చేస్తామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top