అయిననూ.. వచ్చి పోవలె! | CM tour finalized | Sakshi
Sakshi News home page

అయిననూ.. వచ్చి పోవలె!

Aug 14 2015 12:34 AM | Updated on Sep 3 2017 7:23 AM

అయిననూ.. వచ్చి పోవలె!

అయిననూ.. వచ్చి పోవలె!

పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పంద్రాగస్టు నాడే వినియోగంలోకి తీసుకురావాలని మొండిపట్టుపట్టిన ప్రభుత్వం చివరకు వెనక్కి తగ్గింది...

- ‘పట్టిసీమ’ పూర్తికాకున్నా సీఎం పర్యటన ఖరారు
- పంద్రాగస్టు నాడు నీళ్లివ్వకుండానే ప్రజలకు అంకితం
- ఏలూరులో జెండా పండగకు అంతరాయం!
సాక్షి ప్రతినిధి, ఏలూరు:
పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పంద్రాగస్టు నాడే వినియోగంలోకి తీసుకురావాలని మొండిపట్టుపట్టిన ప్రభుత్వం చివరకు వెనక్కి తగ్గింది. పనులు కొలిక్కిరాని నేపథ్యంలో ఆ రోజున నీటిని విడుదల చేయడం కాకుండా.. కనీసం ఆ పథకాన్ని ప్రజలకు అంకితం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆగస్టు 15న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పట్టిసీమ రానున్నారు. శనివారం విశాఖపట్నంలో స్వాతంత్య్ర దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకలు ముగించుకుని మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రబాబు పట్టిసీమ చేరుకుంటారు.

అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 5గంటలకు పట్టిసీమ నుంచే హెలికాప్టర్‌లో తిరిగి వెళతారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. కాగా, పట్టిసీమ వద్ద పంపులు బిగించే పనులు పూర్తి కాకున్నా.. తాడిపూడి కాలువను అనుసంధానం చేసే పనులు కొలిక్కి రాకున్నా.. పోలవరం కుడి కాలువ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నా.. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్నిజాతికి అంకితం చేయడం వల్ల ప్రయోజనం ఏమిటనే చర్చ అధికారవర్గాల్లోనూ మొదలైంది.
 
కాంక్రీటు పనులే కొలిక్కి రాలేదు
వాస్తవానికి ఆగస్టు 15 నాటికి పట్టిసీమ పథకం వద్ద కాంక్రీటు పనులు కూడా పూర్తయ్యే పరిస్థితులు లేవు. రూ.1,300 కోట్ల వ్యయంతో ఎత్తిపోతలను నిర్మించి  24 పంపులు, 24 మోటార్లతో 12 పైపులైన్ల ద్వారా 8,500 క్యూసెక్కుల నీటిని కృష్ణాకు తరలించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కాగా, పంద్రాగస్టు నాటికి కనీసం 8 పంపులతోనైనా నీటిని తరలిస్తామని సీఎం రెండు నెలల కిందట ప్రకటించారు. పనులు జరగకపోవడంతో కనీసం నాలుగు పంపుల ద్వారా అయినా నీరు పంపాలని ఇటీవల నిర్ణయించారు.

ఆ తరువాత 2 పంపులు.. చివరకు ఒక పంపుతోనైనా నీరు తరలించేందుకు విశ్వప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఒక మోటారు, ఒక పంపు ఏర్పాటుకు సంబంధించి కాంక్రీటు పనులు కూడా కాలేదు. వీటిని పూర్తి చేయడానికి కనీసం వారం రోజులు పట్టే అవకాశం ఉంది. దీనికితోడు ఇప్పటివరకు మోటార్లు, పంపులు కూడా రాలేదు. అలాగే విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి తాత్కాలిక పనులూ కొలిక్కి రాలేదు.
 
ఆ పనులు పెండింగ్‌లోనే..
పోలవరం కుడికాలువ నిర్మాణానికి సంబంధించి ఆరు ప్యాకేజీల్లో 39.22 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్‌వర్క్ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 21.91 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు జరిగాయి. ఇంకా 17.31 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు జరగాల్సి ఉంది. రోజుకు సగటున 2.50 నుండి 3 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు జరుగుతున్నాయి. ఈ లెక్కన కాలువ తవ్వకం పనులు పూర్తయ్యేందుకు ఇంకా వారం రోజులు పడుతుంది. దీనికి తోడు కాలువల లైనింగ్ పనులు మరో మూడు రోజులు పట్టే అవకాశం ఉంది.  

పోనీ తాత్కాలికంగా పట్టిసీమను పక్కనపెట్టి  తాడిపూడి కాలువ ద్వారా పోలవరం కుడి కాలువకు నీళ్లు మళ్లించాలని భావించినా అది కూడా సాధ్యమయ్యేలా కనిపించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ముందునుంచి ఆగస్టు 15 నాటికి పథకం ప్రారంభిస్తామని విపరీతమైన ప్రచారం చేసిన నేపథ్యంలో చివరకు సీఎం వచ్చి జాతికి అంకితం చేసే కార్యక్రమాన్నైనా చేపట్టాలని నిర్ణయించారు.

పంద్రాగస్టు వేడుకలకు అంతరాయం!
సీఎం చంద్రబాబు రాకతో జిల్లా కేంద్రం ఏలూరులో శనివారం పంద్రాగస్టు వేడుకలు హడావుడిగా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అన్ని శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు పాల్గొనే వేడుకలు ఉదయం 9గంటలకు  మొదలుపెట్టినా మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగుతాయి. శకటాల ప్రదర్శన, అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాల పంపిణీ జరగాలి. కానీ.. మధ్యాహ్నం 2.30 గంట లకు సీఎం పట్టిసీమ రానున్న నేపథ్యంలో కలెక్టర్ కె. భాస్కర్, డీఐజీ హరికుమార్, ఎస్పీ భాస్కర్ భూషణ్ సహా అధికారులంతా హడావుడిగా పట్టిసీమ చేరుకోవాల్సి ఉంటుంది.

పోనీ.. ఏలూరులో వేడుకలను కుదించినా.. ఉన్నతాధికారులు ఎంతవేగంగా అక్కడికి చేరుకున్నా  మిగిలిన ఉద్యోగులు జెండా పండగ పూర్తి చేసుకుని అక్కడకు రావడం ఇబ్బందికరంగా పరిణమించనుంది. ఇక పోలీసుశాఖాపరంగా కూడా ఆ రోజు సీఎం పర్యటనకు బందోబస్తు ఏర్పాటుచేయడం తలకు మించిన భారంగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement