సీఎం పర్యటన సజావుగా సాగాలి

CM Chandrababu Naidu Tour In Prakasam - Sakshi

ఒంగోలు సబర్బన్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం  ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటించనున్న సందర్భంగా శాంతిభద్రతలు, ప్రొటోకాల్‌ ప్రకారం ఏర్పాట్లు సజావుగా చేయాలని కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం జిల్లాస్థాయి అధికారులతో సీఎం పర్యటనపై ఆయన సమీక్షించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, జేసీ–2 డి.మార్కండేయులు, డీఆర్‌ఓ వెంకటసుబ్బయ్యతో కలిసి అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి తన నివాసం నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరి 2.40 గంటలకు ఒంగోలులోని ఏబీఎం కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారని వివరించారు. ఏబీఎం నుంచి 2.50 గంటలకు బస్సులో బయలుదేరి 3 గంటలకు మినీ స్టేడియంలోని ధర్మపోరాట దీక్ష సభాస్థలికి చేరుకుంటారన్నారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు తిరిగి ముఖ్యమంత్రి వెళ్లిపోతారన్నారు.

అందులో భాగంగా ఏబీఎం కళాశాలలో హెలిప్యాడ్‌ నిర్మాణం, ప్రముఖులు వేచి ఉండే విధంగా షామియానాలు, సీటింగ్, మంచినీరు, రిఫ్రెష్‌మెంట్లు, ముఖ్యమంత్రి కోసం తాత్కాలిక బయోటాయిలెట్, బారికేడింగ్, ఫైర్‌ టెండర్‌ ఏర్పాట్లు సజావుగా చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కాన్వాయ్‌లో వైద్య నిపుణులు, రక్తనమూనాలు, వైద్య పరికరాలు, మందులు కలిగిన అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని ప్రతి వాహనంలో మంచినీరు, రిఫ్రెష్‌మెంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రిమ్స్‌ వైద్యశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కాన్వాయ్‌ ప్రయాణించే మార్గంలో ఎక్కడా చెత్తాచెదారం లేకుండా చూడాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణంలో సాయంత్రం వీధిదీపాలు, ముఖ్యంగా ఎల్‌ఈడీ బల్బులు సరిగా వెలుగుతున్నాయా..లేదా..? అన్నది పరిశీలించాలని సూచించారు. సమావేశంలో ఒంగోలు ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ రాజ్యలక్ష్మి, ఎస్‌డీసీ నరిసింహులు, డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు మురళి, వెంకటేశ్వర్లు, శింగయ్య, డీటీడబ్ల్యూ రాజ్యలక్ష్మి, డీటీసీ సీహెచ్‌వీకే సుబ్బారావు, రిమ్స్‌ డైరెక్టర్‌ మస్తాన్‌ సాహెబ్, స్టెప్‌ సీఈఓ రవి, ఎస్‌ఎస్‌ఏ పీఓ వెంకటేశ్వరరావు, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటకృష్ణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఏర్పాట్లు పూర్తి : మంత్రులు నారాయణ, శిద్దా
సీఎం చంద్రబాబు పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి మినీ స్టేడియంలోని దీక్షా స్థలి వద్దకు వచ్చిన మంత్రులు.. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై ముఖ్యమంత్రి చేస్తున్న దీక్షకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. వారి వెంట ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కొమ్మూరి రవిచంద్ర, బాలాజీ తదితరులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top