నేడు, రేపు బ్యాంకులుబంద్


విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడానికి ఉద్యోగ సంఘాలు కార్యాచరణ సిద్ధం చేశాయి. ఈ నెల 19 నుంచి 30వ తేదీ వరకు రోజుకో విధంగా ఆందోళనకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా గురు,శుక్రవారాల్లో జిల్లాలోని అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలను దిగ్బంధం చేయనున్నారు. సమైక్యాంధ్ర కోసం ఆయా  కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలను స్తంభింప చేసి సహకరించాలని ఇప్పటికే ఎన్‌జీవోలు ఆయా సంఘాల నాయకులతో చర్చించారు.



దీనికి వారు కూడా అంగీకరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రెండు రోజులు కేంద్ర ప్రభుత్వ సంస్థలు పనిచేయకూడదని ఉద్యోగ సంఘాలు పట్టుదలగా ఉన్నాయి. ఈ విధంగా యూపీఏపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నాయి. రెండు రోజులూ బ్యాంకుల సేవలను కూడా అడ్డుకోవాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. దీం తో జిల్లాలోని 320 బ్యాంకుల శాఖలు మూతపడే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా రూ.600 కోట్లు లావాదేవీలు నిలిచిపోనున్నాయి.

 

21న రెండు గంటల పాటు విద్యుత్ నిలిపివేత




 ఈ నెల 21న జిల్లా అంతటా రెసిడెన్షియల్‌తో పాటు వాణిజ్య సంస్థలకు కూడా సాయంత్రం 6 నుంచి 8 వరకు విద్యుత్‌ను నిలిపివేయాలని ఏపీఎన్‌జీవోలు నిర్ణయించారు. స్వచ్ఛందంగా ఈ నిరసనను పాటించాలని సూచిస్తున్నారు. ఈ నెల 24న జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. అదే రోజు ఉద్యోగులందరూ జాతీయ రహదారిని దిగ్బంధించనున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో మరోసారి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధించనున్నారు. అప్పుడు కూడా బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు ప్రైవేటు స్కూళ్ల బంద్‌కు పిలుపునిచ్చారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top