మట్టి.. లూటీ

Clay Smuggling - Sakshi

అనుమతుల మాటున యథేచ్ఛగా మట్టి తరలింపు

పేరుకు పొలాలకు.. చేసేది వ్యాపారం

క్యూబిక్‌ మీటర్‌కు ప్రభుత్వానికి రూ.1 చెల్లింపు

ట్రాక్టర్‌ మట్టి రూ.300 నుంచి రూ.400 విక్రయం

పాతకడప చెరువులో మట్టి వ్యాపారం చేస్తున్న టీడీపీ నాయకుడు

పొలాలకు మట్టి తరలింపునకు అనుమతులు ఇచ్చామన్న అధికారులు

సాక్షి, కడప సిటీ : అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదాయం కోసం తొక్కని అడ్డదారి లేదు. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా అధికారాన్ని ఉపయోగించి అక్రమార్జనకు తెరలేపుతున్నారు.   పాతకడప చెరువులో మట్టి దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. పేరుకేమో అధికారుల వద్ద అనుమతులు తీసుకున్నామన్న సాకుతో మట్టిని వ్యాపార వనరుగా మార్చుకున్నారు. క్యూబిక్‌ మీటరు ప్రభుత్వ జీఓ ప్రకారం రూపాయి లెక్కన చెల్లిస్తున్నారు. మూడు క్యూబిక్‌ మీటర్లయితే ఒక ట్రాక్టర్‌ మట్టి అవుతుంది. ఈ నేపథ్యంలో పాతకడపకు చెందిన టీడీపీ నాయకుడు, ఆ చెరువు సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి మూడు క్యూబిక్‌ మీటర్లకు రూ. 3 చెల్లించి.. ఒక్కొక్క ట్రాక్టర్‌ మట్టికి రూ. రూ.300–రూ.400 అక్రమార్జనకు శ్రీకారం చుట్టారు. ఇలా ఇంతవరకు దాదాపు రూ. కోటి రూపాయల వరకు సంపాదించినట్లు తెలుస్తోంది.

రెండున్నరేళ్లుగా ఈ తంతు కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. భూములకు మట్టిని తరలించేందుకు అనుమతులు తీసుకుని వ్యాపార ధోరణిలో తతంగం కొనసాగుతోంది. ప్రైవేటు వ్యక్తుల పునాదులకు, టవర్ల చదునుకు, ఇతర అవసరాలకు ఒప్పందం కుదుర్చుకుని కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెరువును అభివృద్ది చేస్తారని అక్కడి ప్రజలు ఆశతో అధ్యక్షుడిని చేస్తే ఆ నాయకుడు ఆ చెరువును ఆదాయ వనరుగా మార్చుకుని ముందుకు సాగడంపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన సొంత పొక్లెయిన్‌ పెట్టుకుని కొన్ని ట్రాక్టర్లు బాడుగకు సమకూర్చుకుని ఈ అవసరాలకు మట్టిని తరలిస్తూ కొనసాగుతున్నారు. కేసీ కెనాల్‌ కింద అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. పొలాలకు మట్టిని తోలుకోవాలని అనుమతులు ఇచ్చామని, మేమేం చేయలేమని అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మరి అధికార పార్టీ నాయకులని భయపడుతున్నారా? లేక చేయి తడిపినందువల్ల మిన్నకున్నారా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది. అనుమతులు ఇచ్చిన అధికారులు మట్టిని పొలాలకు తరలిస్తున్నారా? లేక ఇతర ప్రాంతాలకు తరలించి వ్యాపారం చేస్తున్నారా? అనే విషయాన్ని తనిఖీ చేయకుండా తమకేం సంబంధం లేనట్లుగా మాట్లాడటం పలు విమర్శలకు తావిస్తోంది.

చెరువును కాపాడేవారే చెరబట్టారు
 మామూలుగా నీటి సంఘాలు చెరువుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినవే. ఈ నీటి సంఘాల వల్ల ఆ చెరువులకు మరమ్మతులుగానీ, పూడికతీత పనులుగానీ నిబంధనల ప్రకారం చేపట్టాల్సి ఉంటుంది. అలాంటిది ‘కంచె చేను మేస్తే కాపు ఏమి చేయగలడు?’ అన్న చందంగా పాతకడప చెరువు నీటి సంఘం అధ్యక్షుడిగా పాతకడపకు చెందిన కృష్ణారెడ్డి కొనసాగుతున్నారు. ఈయన చెరువు అభివృద్ధి పనులను తుంగలో తొక్కి చెరువును చెరబట్టే విధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 

మట్టి తరలింపునకు అనుమతులు ఇచ్చాం
పాతకడప చెరువు నుంచి పొలాలకు మట్టి తోలుకునేందుకు అనుమతులు ఇచ్చాం. జల వనరులశాఖ ఇందుకు సంబంధించిన జీఓ ఎంఎస్‌ నంబర్‌. 40ని జారీ చేసింది. క్యూబిక్‌ మీటరుకు రూపాయి చొప్పున చెల్లిస్తే ఎవరికైనా అనుమతులు ఇస్తాం. అలాంటి అనుమతులను కృష్ణారెడ్డి తీసుకున్నారు. నిబంధనల ప్రకారం మట్టిని తరలించాలి. పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
– జిలానీబాషా, డీఈ, కేసీ కెనాల్, కడప 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top