సంక్షేమానికి తొలి పద్దు

Chittoor Is A Top Priority In The Budget - Sakshi

జనం మెచ్చిన మేలిమి బడ్జెట్‌ 

బడుగు జీవుల వేతనాల పెంపులో ఉదారత 

రైతులకు ఉచిత బోర్లు, సున్నా వడ్డీ రుణాలు, ఉచిత పంటల బీమా

పాడిరైతుకు చేయూతనిస్తూ లీటరుకు రూ.4 బోనస్‌

వృత్తిదారుల సంక్షేమానికి ప్రత్యేక నిధులు

అగ్రిగోల్డ్‌ బాధితులకు అండ

ఆరోగ్యశ్రీతో పేదల వైద్యానికి భరోసా

పేదల వైద్యానికి భరోసా, అన్నదాతకు అండదండ, బడుగు జీవుల జీవనానికి మద్దతు, అక్కచెల్లెమ్మల ఉన్నతికి చేయూత, అవ్వాతాతలకు ఆసరా, కార్మికులు, విద్యార్థులకు ఆపన్నహస్తం.. ఇలా అన్ని వర్గాల ప్రజలు మెచ్చే రీతిలో రాష్ట్ర బడ్జెట్‌ నిలిచింది. శుక్రవారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి రూ.2,27,297 కోట్లతో 2019–20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. బుగ్గన కేటాయింపుల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. స్థిరమైన సమసమాజ ఆర్థికాభివృద్ధి, అన్ని వర్గాల సాధికారత శ్రేయస్సుకు బడ్జెట్‌ అద్దం పడుతోందని ఆర్థికరంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేద, బడుగుల ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాలు, మహిళల సంరక్షణ, మైనారిటీల సంక్షేమం వంటి కీలక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. సామాజిక సమీకరణ, అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశారని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వ్యవసాయం, సాగునీరు, విద్య, ఆరోగ్యం, ప్రజా సంక్షేమం, ఉపాధి అవకాశాలు, గ్రామీణాభివృద్ధి వంటి ప్రధాన రంగాలకు నిధుల కేటాయింపుల్లో ప్రభుత్వం తీరు ప్రతిబింబించిందని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

సాక్షి ప్రతినిధి తిరుపతి : అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా అన్ని రంగాలకు ప్రాధాన్యమిచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ రాజ్యంగా.. పేదల పెన్నిధిగా.. రైతు పక్షపాతిగా నిలుస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

రైతులకు అండదండ
రైతులకు అండదండగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిలుస్తోంది. ఆ విషయాన్ని ఆర్థిక మంత్రి నిధులు కేటాయిస్తూ బడ్జెట్‌ను రూపొందించడం ద్వారా స్పష్టమైంది. 62 శాతం ఉన్న రైతుల ఉన్నతికి కృషి చేయాలనే దిశగా కేటాయింపులు చేపట్టారు. వైఎస్సార్‌ రైతు భరోసాకు రూ.8,750 కోట్లు కేటాయించారు. తద్వారా పెట్టుబడి సాయం కోసం అక్టోబర్‌లో ప్రతి రైతుకూ రూ.12,500 కేటాయించనున్నారు. రైతులకు వ్యవసాయ రుణాలు సున్నా వడ్డీతో కేటాయింపులు చేపట్టనున్నారు. రైతుల పంటలకు ఉచితంగా బీమా ప్రీమియం చెల్లించనున్నారు.

వైఎస్సార్‌ రైతు బీమా ద్వారా ప్రీమియం చెల్లించేందుకు రూ.1,163 కోట్లు కేటాయించారు. రైతులకు వ్యవసాయ బోర్లు ఉచితంగా వేసేం దుకు రూ.200కోట్లు కేటాయించారు. వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమతో జీవనం నెట్టుకొస్తున్న పాడిరైతులకు సైతం ప్రభుత్వం అండగా నిలిచింది. పాడిరైతులను ప్రోత్సహించే నిమిత్తం లీటరు పాలకు రూ.4 బోనస్‌ కల్పించారు. జిల్లాలో 3.8 లక్షల కుటుం బాలు పాడి ద్వారా జీవనం సాగిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 32 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి ఉంది. పాడి రైతులకు నిత్యం రూ.1.36 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌గా ఇవ్వనుంది. 

బడుగులకు భరోసా 
అరకొర జీతాలతో జీవనం నెట్టుకొస్తున్న బడుగుజీవులకు అండగా రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి  కేటా యింపులు చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఆశావర్కర్లు గౌరవవేతనం రూ.3వేల నుంచి రూ.10వేలు పెంచారు. మున్సిపల్‌ ఔట్‌ సోర్సింగ్‌ పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.12వేల నుంచి రూ.18వేలు పెంచారు. హోంగార్డుల వేతనం రూ.18 వేల నుంచి రూ.21,300 చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవవేతనం రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు వెయ్యి రూపాయలు పెంచారు. ఇవన్నీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల మేరకు ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.

ఆటో డ్రైవర్లు, రజకులు, నాయీ బ్రహ్మణులు, టైలర్లు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయింపులు చేశారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించారు. గత పాలకులు అగ్రిగోల్డ్‌ ఆస్తులు కాజేయాలనే యత్నం చేపట్టగా, బాధితులకు అండగా నిలవడంలో చిత్తశుద్ధిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చూపింది. అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపుల నిమిత్తం రూ.1150 కోట్లు కేటాయించింది. జిల్లాలో 16,528 మంది అగ్రిగోల్డ్‌ బాధితులున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వీరందరికీ ఊరట దక్కుతోంది. ఎప్పటి నుంచో ఎదరుచూస్తున్న వారికి త్వరలో డబ్బులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. 

విద్య..వైద్యానికి పెద్దపీట 
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేసింది. బడ్జెట్‌లో నిధులు కేటాయింపు ఆ మేరకు రుజువు చేస్తున్నాయి. విద్యను ప్రోత్సహించే నిమిత్తం అమ్మఒడి ప«థకాన్ని ఇదివరకే ప్రకటిం చారు. ఆ మేరకు రూ.32,168 కోట్లు కేటా యించారు. చదువు కొనే రోజుల నుంచి ప్రోత్సాహకం అందించే రోజులను తీసుకొచ్చినందుకు విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు అందుబాటులో వైద్యం అందించాలనే దృక్పథం బడ్జెట్‌లో స్పష్టంగా కన్పించింది. రూ.వెయ్యి వైద్యం కూడా ఉచితంగా అందించాలనే దిశగా అడుగులు పడ్డాయి. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1,740 కోట్లు కేటాయించారు. రూ.5 లక్షలు వార్షిక ఆదాయం ఉన్న వారందరికీ  ఆరోగ్యశ్రీ వర్తించేలా నిర్ణయం తీసుకోవడంతో అత్యధికులకు ఉపయోగపడనుందని పలువురు వివరిస్తున్నారు. 

సాగునీటి రంగానికి ప్రాధాన్యం
రాష్ట్ర బడ్జెట్‌లో సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.13,139 కోట్లు కేటాయించగా అందులో చిత్తూరు జిల్లాకు భాగస్వామం ఉన్న ప్రాజెక్టులకు ప్రధాన కేటాయింపులున్నాయి. తెలుగు గంగ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, గాలేరి–నగరి పథకాలకు ప్రాధాన్యత దక్కింది. గత ప్రభుత్వంతో పోలిస్తే రెట్టింపు నిధులు దక్కాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top