స్వయం పాలన దినోత్సవమంటే.. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులతో ఆరోజు బోధన, పాలన కార్యక్రమాలు చేయించడం.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్వయం పాలన దినోత్సవమంటే.. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులతో ఆరోజు బోధన, పాలన కార్యక్రమాలు చేయించడం. సాధారణంగా అన్ని పాఠశాలల్లో ఇదే తరహా కార్యక్రమం జరుగుతుంది. కానీ ఉప్పల్ మండలం చిలకనగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో మాత్రం..
నిత్యం పిల్లలే స్వయం పాలకులు. బడిలో తొమ్మిది మంది టీచర్లు ఉన్నా.. సమయ పాలన పాటించరు. దీంతో పిల్లలే ప్రార్థన కార్యక్రమం పూర్తిచేసి పద్ధతిగా తరగతి గదులకు బయల్దేరుతారు. గురువారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని చాలాచోట్ల స్వయం పాలక దినోత్సవాన్ని నిర్వహించారు. దీంతో ఈ ఉత్సవాలను పరిశీలించేందుకు జిల్లా రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి ఎన్.కిషన్‌రావు, ప్రత్యామ్నాయ పాఠశాలల సమన్వయ కర్త టి.రాంచెంద్రారెడ్డి తదితరులు ఉప్పల్ మండలం చిలకనగర్ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. ఉదయం 8.50 నిమిషాల ప్రాంతంలో పాఠశాలకు చేరుకుని ఒక్కసారిగా అవాక్కయ్యారు.
ప్రధానోపాధ్యాయురాలితో సహా పాఠశాలలో పనిచేసే తొమ్మిది మంది టీచర్లూ బడికి రాలేదు. దీంతో పాఠశాల విద్యార్థులే ప్రార్థన పూర్తిచేసి వారివారి తరగతులకు వెళ్లిపోయారు. ఉదయం 9.20నిమిషాలు కావస్తున్నా టీచర్లు హాజరుకాలేదు. దీంతో విద్యార్థులు తరగతి గదిలో పుస్తక పఠనానికి ఉపక్రమించారు. రెండు నెలల క్రితం రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఈ పాఠశాలను తనిఖీ చే సినప్పుడు కూడా ఉపాధ్యాయులు గైర్హాజరయ్యారు. దీంతో ఉపాధ్యాయులకు తీవ్ర హెచ్చరికలు చేశారు. తాజాగా ఆర్వీఎం ప్రాజెక్టు అధికారి సందర్శించినప్పుడు సైతం ఉపాధ్యాయులు జాడలేకపోవడంతో వారిపై తగిన చర్యలు తీసుకోవల్సిందిగా సిఫార్సు చేస్తూ గురువారం సాయంత్రం జిల్లా విద్యాశాఖ అధికారి సోమిరెడ్డికి నివేదిక సమర్పించారు.