వితంతు, ఒంటరి మహిళల పింఛన్‌ నిబంధనల మార్పు

Changes in Widow and Single Womens Pension Regulations - Sakshi

కేటగిరీ–2 పెన్షన్‌ తీసుకుంటే ఆ కుటుంబంలో ఎవరికీ కేటగిరీ–1 పెన్షన్‌ రాదు

కుటుంబ పెన్షన్‌ తీసుకున్న తల్లి మరణిస్తే పెళ్లికాని కుమార్తెకు కొనసాగింపు

అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు ∙సర్కారు ఉత్తర్వులు జారీ

సాక్షి, అమరావతి : ప్రభుత్వోద్యోగుల కుటుంబ పెన్షన్‌ నిబంధనల నిర్వచనాల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించి వాటికి మరింత స్పష్టతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు వితంతు, ఒంటరి మహిళల పెన్షన్‌కు అర్హత నిబంధనలను మార్పుచేశారు. దీని ప్రకారం..
- వితంతు లేదా విడాకులు తీసుకున్న మహిళలకు కేటగిరీ–2 పెన్షన్‌ వయస్సును 45 ఏళ్లుగా నిర్థారించారు. 
పిల్లలు లేకపోయినా, మైనర్‌ పిల్లలున్న వితంతు, విడాకులు తీసుకున్న మహిళలు తిరిగి వివాహం అయ్యేంత వరకు లేదా సంపాదన మొదలయ్యే వరకు.. పిల్లలు మేజర్లు అయ్యే వరకు, లేదా మరణం.. వీటిల్లో ఏది ముందు అయితే అంతవరకు ఈ కుటుంబ పెన్షన్‌ లభిస్తుంది. ఈ కేటగిరీ–2 పెన్షన్‌ తీసుకునే కుటుంబంలో వేరే వ్యక్తులు కేటగిరీ–1 పెన్షన్‌కు అర్హులైనా వారికి ఆ పెన్షన్‌ వర్తించదు. ఇలా కాకుండా పెన్షన్‌ తీసుకుంటున్నట్లు తేలితే క్రిమినల్‌ చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
అలాగే, కుటుంబ పెన్షన్‌ తీసుకుంటున్న తల్లి మృతిచెంది.. వివాహం కాని కుమార్తె ఉంటే ఆమెకు పాతికేళ్లు వచ్చే వరకు పెన్షన్‌ ఇస్తారు. వివాహమయ్యే వరకు లేదా ఆమె సంపాదన మొదలు పెట్టే వరకు పెన్షన్‌ అందిస్తారు. వివాహ ధ్రువీకరణకు సంబంధించి రెవెన్యూ శాఖలోని గెజిటెడ్‌ ఆఫీసర్‌ ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత కూడా పెన్షన్‌ తీసుకుంటున్నట్లు తేలితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటారు. 
కుటుంబ పెన్షన్‌ పొందుతున్న తల్లికి వివాహమైన తరువాత విడాకులు తీసుకున్న కుమార్తె ఉంటే.. ఆ కుమార్తె ముందుగానే అంటే 45 సంవత్సరాల వయస్సులోపే తన తల్లి మరణానంతరం పెన్షన్‌ తనకు ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు తల్లి మరణానంతరం ఆమె ఎన్ని సంవత్సరాలు జీవించి ఉంటే అన్ని ఏళ్లపాటు పెన్షన్‌ ఇస్తారు. 
కాగా, మారిన నిబంధనలకు అనుగుణంగా ట్రెజరీ, పెన్షన్‌ పేమెంట్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top