
పల్నాడు జిల్లా అనుపాలెంలో పింఛన్ కోసం పడిగాపులు కాస్తున్న వృద్ధులు
పింఛన్ల డబ్బులు.. ఇంటి పన్నుకు జమ..
ఇంటి పన్ను 100% వసూళ్లే సర్కారు లక్ష్యం.. పింఛన్ల పంపిణీపై గురి
ఇంటి పన్నుల కింద రూ.935 కోట్లు వసూలుకు ఆదేశం.. రంగంలోకి యంత్రాంగం
ఇంటి యజమానులకు నోటీసులు.. 15 రోజుల్లోగా పన్ను కట్టాలని ఒత్తిడి
ఏ రోజు, ఎక్కడ, ఎంత వసూలైందో వివరాలు పంచాయతీరాజ్ శాఖ వెబ్‌పోర్టల్‌లో నమోదు
గ్రామాల్లో పంటలు వచ్చాక డిసెంబర్ నుంచి మార్చి వరకు సాగే ప్రక్రియ ఇప్పుడు ఆగస్టులోనే మొదలు
జగన్ ప్రభుత్వంలో ఆత్మగౌరవంతో ఇంటివద్దే పింఛన్లు అందుకున్న అవ్వాతాతలకు అగచాట్లు
దివ్యాంగులకూ దురవస్థ.. వైకల్య శాతం పేరుతో దాదాపు లక్ష పింఛన్లు ఎగరగొట్టిన బాబు సర్కారు
ఏడాదిన్నరలో దాదాపు నాలుగున్నర లక్షలకుపైగా పింఛన్లు ఔట్.. వలంటీర్ల వ్యవస్థకు మంగళం.. సచివాలయాలు నిర్వీర్యం
అవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు అవ్వాతాతల పింఛన్ డబ్బులపై ఇంటి పన్నుల పిడుగు..
దేశంలో ఏ పాలకుడూ ఇంత నిర్దయగా వ్యవహరించలేదని, ఇది మానవత్వం లేని సర్కారని అవ్వాతాతల ఆక్రోశం
పింఛన్ డబ్బులో కోత వేశారు
పింఛనుపైనే ఆధారపడి జీవిస్తున్నా. ఇంటి పన్ను వసూలు కోసం ఈ నెల పింఛన్ల డబ్బుల్లో కోత విధించారు. మార్చి నెల వరకు గడువున్నా ఇప్పుడే ఇంటి పన్ను వసూలు చేశారు. నెలంతా ఆ డబ్బులే నాకు ఆధారం. ఏ పని చేయలేని పరిస్థితి. పింఛను సొమ్ముతోనే కుటుంబ పోషణ, మందులు కొనుక్కోవాలి.
– రామన్నదొర, దివ్యాంగుడు, గోపవరం
జగన్ హయాంలో ఇంటికే పెన్షన్లు, పథకాలు.. ఒకటో తారీఖు వచ్చిందంటే పండుగ! బాబు పాలనలో ఇంటింటికీ అగచాట్లు, కోతలు, పన్ను పోటు.. ఒకటే తేదీ అంటే వణుకే!
సాక్షి, అమరావతి, నెట్‌వర్క్: గత ప్రభుత్వంలో ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే ఇంటివద్దే ఆత్మగౌరవంతో పింఛన్లు అందుకున్న అవ్వాతాతలు, దివ్యాంగులను ఇప్పటికే రోడ్డుకీడ్చి దురవస్థ పాలు చేసిన చంద్రబాబు సర్కారు.. పండుగ పూట వారికి మరో షాక్ ఇచ్చింది. పండుటాకులకు ఒకచేతితో పింఛన్లు ఇస్తూ మరోచేతితో వాటిని ఇంటి పన్నుల కింద జమ చేసుకుంటోంది. బుధవారం పింఛన్ల పంపిణీలో ఇలాంటి దృశ్యాలే కనిపించాయి.
ఈ ఏడాది ఇంటి పన్నులు 100 శాతం వసూలు చేయాలని కూటమి సర్కారు ఆదేశించడంతో పింఛన్ల డబ్బుల నుంచి దాన్ని మినహాయించుకుంటున్నారు. పింఛన్ డబ్బులే తమకు జీవనాధారమని, నెలంతా వాటితోటే గడపాలని, మందులకూ అవే దిక్కని వృద్ధులు ఆక్రోశిస్తున్నారు. గత ప్రభుత్వంలో అవ్వాతాతలకు గుడ్ మార్నింగ్ చెప్పి మరీ ఇంటి వద్దే పెన్షన్లు ఇచ్చిన వలంటీర్ల వ్యవస్థను కక్షపూరితంగా రద్దు చేసిన చంద్రబాబు సర్కారు సచివాలయాల వ్యవస్థను కూడా పూర్తిగా నీరుగార్చింది.
సామాజిక పెన్షన్లకు ఎడాపెడా కోతలు పెట్టింది. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో గరిష్టంగా ఇచ్చిన పింఛన్ల సంఖ్య ఏకంగా 66.34 లక్షలు కాగా కూటమి సర్కారు ఈ ఏడాది సెపె్టంబర్ 1న డబ్బులు పంపిణీ చేసిన పింఛన్లు కేవలం 61,93,363 మాత్రమే కావడం గమనార్హం. అంటే ఏడాదిన్నరలో దాదాపు నాలుగున్నర లక్షల మంది పింఛన్లకు కోత వేసినట్టు స్పష్టమవుతోంది. ఇక దివ్యాంగుల పరిస్థితి మరీ దారుణం. వైకల్య శాతం పేరుతో దాదాపు లక్ష దివ్యాంగ పింఛన్లను చంద్రబాబు ప్రభుత్వం ఎగరగొట్టింది. దేశంలో ఏ పాలకుడూ ఇంత నిర్దయగా వ్యవహరించిన దాఖలాలు లేవని దివ్యాంగులు ఆర్తనాదాలు చేసినా కూటమి సర్కారు పట్టించుకోలేదు.
వంద శాతం వసూళ్లకు పింఛన్లే టార్గెట్..!
గ్రామాల్లో ఈ ఆర్థిక ఏడాది ఇంటి పన్ను వసూళ్లు 100 శాతం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. దీంతో సాధారణంగా గ్రామాల్లో పంటలు వచ్చాక డిసెంబరు నుంచి మార్చి వరకు జరిగే ఇంటి పన్ను వసూళ్ల కార్యక్రమాన్ని అధికార యంత్రాగం ఆగస్టు నుంచే ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పన్ను డిమాండ్ రూ.702 కోట్లతో పాటు పాత బకాయిలు మరో రూ.233 కోట్లు కలిపి మొత్తం రూ.935 కోట్లుగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది నుంచే కొత్తగా యజమానికి జారీ చేసే ఇంటి పన్ను నోటీసు, పన్ను చెల్లింపు ప్రక్రియ ఆన్‌లైన్‌లో కొనసాగేలా పంచాయతీరాజ్ శాఖ వెబ్‌పోర్టల్ తెచ్చింది.
నోటీసు అందుకున్న 15 రోజుల్లోగా డబ్బులు చెల్లించాలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ, జిల్లాల వారీగా ఏ రోజు ఎంత మేర ఇంటి పన్ను వసూలు జరిగిందో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పాత బకాయిలు రూ.233 కోట్లు నెల రోజుల్లో వసూలు చేయాలని ఆదేశించారు. దీంతో ఇంటి పన్ను వసూలుకు పెన్షన్ల పంపిణీ సరైన సమయంగా భావించారు. అవ్వాతాతలు, ఇతర లబ్ధిదారులకు 1వ తేదీన పింఛను ఇవ్వగానే ఆ డబ్బును ఇంటిపన్ను కింద లాగేసుకుని రశీదు చేతిలో పెడుతున్నారు.
ఉదయం 11 గంటలకు ప్రారంభం
చిత్తూరు జిల్లావ్యాప్తంగా పింఛన్ల పంపిణీ అవస్థల నడుమ ఆలస్యంగా సాగింది. వేకువజామున లబ్ధిదారుల ఇంటివద్దకు వెళ్లి ఇవ్వాల్సి ఉండగా ఉదయం 11 వరకు సచివాలయాల్లో పంపిణీ ప్రారంభించలేదు. ఇంటింటికి వెళ్లి తాము పంపిణీ చేసేందుకు వలంటీర్లం కాదంటూ నిరసన వ్యక్తం చేశారు.అల్లూరి జిల్లా తామరపల్లి పంచాయతీ గోపవరంలో బంధం కుమారికి పింఛన్ నుంచి ఇంటిపన్ను మినహాయించుకుని చేతిలో పెట్టిన రశీదు
పెన్షన్ డబ్బులిచ్చి.. పన్ను రశీదు చేతిలో పెట్టారు
సచివాలయ ఉద్యోగి పింఛను డబ్బులు ఇచ్చిన వెంటనే ఇంటి పన్ను రశీదు ఇచ్చి బలవంతంగా వసూలు చేశారు. పింఛన్లు డబ్బుల నుంచి ఇంటి పన్ను వసూలు చేయడం దారుణం. నెలంతా ఎదురు చూసే డబ్బులకు కోత పెట్టడం అన్యాయం. ఇంటి పన్నులు గతం కంటే ఎక్కువగా వస్తున్నాయి.
– బోరగ చిన్నలమ్మ, వృద్దురాలు, గోపవరం
ఇచ్చినట్టే ఇచ్చి...
ఇటు పింఛను డబ్బులిచ్చి అటు ఇంటి పన్ను అంటూ రూ.710 వసూలు చేశారు. పింఛను డబ్బులపైనే ఆధారపడి జీవించే మాలాంటి వారి నుంచి బలవంతంగా వసూలు చేయడం అన్యాయం. నెమ్మదిగా ఇంటి పన్ను చెల్లిద్దామనుకుంటే పింఛను డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాక్కున్నారు. గతంలో ఇంటి పన్ను రూ.400 మాత్రమే రాగా ఇప్పుడు బాగా పెరిగింది.
– బంధం సముద్రలమ్మ, వితంతువు ,గోపవరం
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం తామరపల్లి పంచాయతీ పరిధిలోని గోపవరంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పంపిణీ చేసిన సామాజిక పెన్షన్లలో బుధవారం కోత విధించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే పన్ను రశీదులు చేతిలో పెట్టారని పింఛనుదారులు వాపోయారు. పింఛను డబ్బులనే నమ్ముకుని నెలంతా గడిపే వారికి కోత విధించడంతో దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది.
తామరపల్లి పంచాయతీ పరిధిలో వివిధ రకాల పింఛనుదారులు 261 మంది ఉండగా పింఛన్ల పంపిణీ సమయంలో లబ్ధిదారుల వద్ద డబ్బులు ఉంటాయి కాబట్టి వాటిని రాబట్టాలని జిల్లా పంచాయతీ అధికారి ఆదేశించినట్లు చెబుతున్నారు. ఏజెన్సీ అంతటా పన్నులు వసూలు చేయాలని నిర్దేశించినట్లు పేర్కొంటున్నారు.
– రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా)
పింఛన్ కోసం పడిగాపులు
రాజుపాలెం: వెల్ఫేర్ అసిస్టెంట్ అత్యుత్సాహం పింఛనుదారులను ముప్పతిప్పలు పెట్టింది. కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసేవరకు వెళ్లింది. ఉదయం 6 నుంచి 10 వరకు అటుఇటు తిరిగిన పింఛన్‌దారులు గందరగోళానికి గురయ్యారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రీకృష్ణ గ్రీన్ అంబాసిడర్ ద్వారా 10 గంటలకు పంచాయతీ కార్యాలయం వద్ద పింఛన్‌లు ఇస్తామని దండోరా వేయించారు. దీంతో పింఛన్‌దారులు పెద్దఎత్తున చేరుకున్నారు. ఇన్‌చార్జి ఎంపీడీవో పగడాల ముక్కంటి హుటాహుటిన అనుపాలెం చేరుకుని సిబ్బందిని పురాయించి పింఛన్ల పంపిణీ చేపట్టారు.