విశ్లేషణలన్నీ ఊహాత్మకం.. ఫలితాలు వాస్తవికం 

Chandrababu in teleconferencing with tdp sequences - Sakshi

టీడీపీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు 

నేతల పనితీరుపైనివేదికలు పంపాలి 

ఎన్నికల్లో ధన ప్రవాహంలో మోదీయే ముద్దాయి 

యువతను మరింతగాఆకట్టుకోవాలి 

మే 1 నుంచి పార్లమెంటు సెగ్మంట్ల వారీగా సమీక్షలు

సాక్షి, అమరావతి: ఇప్పుడు చేసే విశ్లేషణలన్నీ ఊహాత్మకమని, రాబోయే ఎన్నికల ఫలితాలు వాస్తవికమని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు చెప్పారు. ఎవరు బాగా పనిచేశారు.. ఎవరు బాగా పనిచేయలేదు.. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేశారనే సమాచారంతో సమగ్ర నివేదికలు పంపాలని వారికి సూచించారు. టీడీపీ నాయకులు, బూత్‌ కమిటీ కన్వీనర్లు, సేవామిత్రలు, ఇతర పార్టీ బాధ్యులతో గురువారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. బూత్, ఏరియా, నియోజకవర్గం వారీగా మూడు దశలుగా నివేదికలు పంపాలని, ఓటింగ్‌ పెరగడానికి దారితీసిన అంశాలు వివరించాలని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాల్‌ సెంటర్, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ సేవలు, సర్వేలు ఎప్పటికప్పుడు ప్రతి దశలోనూ ఉపయోగపడ్డాయన్నారు. సీబీఎన్‌ ఆర్మీ బాగా పనిచేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల మంది ఆర్మీగా పనిచేశారని తెలిపారు. తన జీవితంలో ఏ ఎన్నికలోనూ ఇంత పోరాటాన్ని ఎదుర్కోలేదన్నారు. అక్కడక్కడా కొందరు నాయకులు డ్రామాలాడారని, ఒకరిని మరొకరు విమర్శించుకోవడం సరికాదన్నారు. కష్టాలు తెలుగుదేశం పార్టీకి కొత్తకాదని, మోదీ దుర్మార్గాల మధ్య ఈ ఎన్నిక ప్రజల సహనానికి పరీక్షని, ఎన్నికల్లో ధన ప్రవాహానికి మొదటి ముద్దాయి మోదీయేనని చెప్పారు. ప్రతి ఎన్నికలో 80 శాతం ఓటింగ్‌ టీడీపీకే రావాలని, కులాల వారీగా రాష్ట్రంలో ఓటింగ్‌ చీలకూడదని, ఈ ఎన్నికల్లో ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలలో టీడీపీకే ఆదరణ ఉందని, ఇంకా యువతరాన్ని టీడీపీ వైపు మరింతగా ఆకట్టుకోవాల్సి ఉందన్నారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి ఆర్ధికంగా అండగా ఉంటామని.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

1 నుంచి లోక్‌సభ స్థానాల సమీక్ష 
మే ఒకటి నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తానని చంద్రబాబు తెలిపారు. ఇప్పటివరకూ 17(సి) నివేదికలు 19 వేలు వచ్చాయని, మిగిలిన నివేదికలను కూడా వెంటనే పంపించాలని చెప్పారు. 17(సి) ఈవీఎంతో పాటు ఉంటుందని, 17(ఏ) రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వద్ద ఉంటుందని, కౌంటింగ్‌ పూర్తయ్యేవరకూ అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కౌంటింగ్‌ ఏజెంట్లకు నియోజకవర్గాల వారీగా శిక్షణ ఇవ్వాలని, పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల ఓట్లలో తేడాలున్నాయని, పోలైన ఓట్లలో పార్లమెంటుకు, అసెంబ్లీకి తేడాలున్నాయని తెలిపారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు, కౌంటింగ్‌పై అవగాహన ఉండాలన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక పర్యటనల ద్వారా అక్కడి పార్టీలు, ప్రజలను చైతన్య పరిచానని, ఈవీఎంలపై అవగాహన పెంచామని చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో ఓటింగ్‌ శాతం పెంచేలా చైతన్యపరిచామన్నారు. త్వరలోనే మిగిలిన రాష్ట్రాల్లోనూ పర్యటిస్తానని తెలిపారు.  
    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top