నా జవాబులు.. నా ఇష్టం

Chandrababu Strange answer to the unemployed question - Sakshi

‘యువనేస్తం’ ప్రారంభంలో ఓ నిరుద్యోగి ప్రశ్నకు సీఎం వింత జవాబు

‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ... ఈ రెండింటిలో దేనిద్వారా లబ్ధి కలుగుతుంది?’ 
–మహేశ్‌బాబు (బీటెక్, ఏలూరు)

సీఎం చంద్రబాబు సమాధానం
హేతుబద్ధత లేని విభజన జరిగింది. రాజధాని లేదు... విద్యాసంస్థలు లేవు... పరిశ్రమలు లేవు. అందరూ నిరాశలో ఉన్నారు. అప్పుడే నవనిర్మాణ దీక్ష తీసుకున్నాం. రాష్ట్రావతరణ వేడుకలు కూడా జరుపుకోలేదు. మన డిమాండ్లు, అవసరాలు, హామీలు వేటినీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు. కేంద్రం చేసిన అన్యాయంపై అవిశ్వాస తీర్మానం పెట్టాం. కేంద్రం మోసం చేసినా మన కష్టంతో రెండంకెల వృద్ధి సాధించాం

ఎస్‌కే ముజా (ఆంధ్రా యూనిర్శిటీ): నిరుద్యోగ భృతిని కొనసాగిస్తారా? మధ్యలోనే ఆపివేస్తారా?
సీఎం: మిగిలిన రాష్ట్రాల్లో మధ్యలో నిలిపేయడానికి కారణం ఫ్రేమ్‌వర్క్‌లో లోపం. ఇక్కడ అలాంటి ప్రమాదం లేదు. పూర్తి సాంకేతికతతో బయోమెట్రిక్‌తో రూపొందించిన కార్యక్రమం ఇది. ఎన్నికల కోసం చేపట్టిన కార్యక్రమం కాదు. 
ఓ నిరుద్యోగి (కడప): మా జిల్లాలో 35 జిల్లా పరిషత్‌ ఉర్దూ స్కూళ్లు న్నాయి. పీఈటీలు 8 మందే ఉన్నారు. నేను కూడా పీఈటీ ట్రైనింగ్‌ చేశా. ఉర్దూ స్కూళ్ళలో పీఈటీ పోస్టులన్నీ భర్తీ చేయాలి.
సీఎం: ఫిజికల్‌ లిటరసీ ముఖ్యం. నేను ఉన్నప్పుడు ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించా. అన్నీ చేయాలని ఉంది. ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తాం. 
హారిక (కేఎల్‌ యూనిర్శిటీ): హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చారంటున్నారు. అమరావతిలో ఐటీపై మీకున్న విజన్‌ ఏమిటి?
సీఎం: హైదరాబాద్‌లో ఎకో సిస్టమ్‌ çసృష్టించడం వల్ల నాలెడ్జ్‌ ఎకానమీకి దోహదపడింది. అమరావతిని అంతకుమించి తీర్చిదిద్దుతాం. తిరుపతిని ఆటోమొబైల్‌ హబ్‌గా, ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా రూపొందిస్తున్నాం. తిరుపతిని షెంజెన్‌లా తయారుచేస్తున్నాం. తిరుపతి నుంచి చెన్నై వరకు ఐటీని అభివృద్ధి చేస్తున్నాం. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం. 
ప్రవీణ్‌కుమార్‌: 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు, అక్టోబరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందా? ఎన్నికల లోపు వాటిని భర్తీ చేస్తారా? ప్రభుత్వ ఉద్యోగం కోసం లంచం ఇవ్వాల్సిందేనా?
సీఎం: ఎవరైనా లంచం అడిగితే 1100కి ఒక్క ఫోన్‌ చేయండి. కఠిన చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో ఎక్కడా అవినీతికి చోటులేదు. అవినీతి లేని రాష్ట్రంగా ఏపీ పేరొందాలి. బాగా చదువుకున్న ఎవరికీ అన్యాయం జరగకూడదు.  
శ్రావణి (నాగార్జున యూనివర్శిటీ): పురుషులతో సమానంగా మహిళలకు ఏవైనా కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నారా?
సీఎం: హార్డ్‌వేర్‌ అంతా మహిళల కోసమే ఉంది. గార్మెంట్‌లో 95 శాతం మంది మహిళలే ఉన్నారు. 
గోపి (ఏఎన్‌యూలో ఎంబీఏ): మీ చర్యల వల్ల ప్రభుత్వ యూనివర్శిటీలు మూతపడతాయంటున్నారు, ప్రైవేట్‌ యూనిర్శిటీలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు?
సీఎం: అందుకే ప్రభుత్వ యూనివర్శిటీలు కూడా అక్రిడిటేషన్‌ తీసుకోవాలంటున్నాం. విట్, ఎస్సార్‌ఎం వంటి యూనివర్శిటీలకు ప్రోత్సాహం ఇస్తున్నాం. పోటీతత్వం ఉండాలి. 

మధు, బీటెక్‌: ‘డేర్‌ టు డ్రీమ్‌’ అని మీరు అంటుంటారు. కానీ మాకు 25 ఏళ్ల వయసులోనూ ఏం చేయాలో తెలియడం లేదు. మీరు ముఖ్యమంత్రి కావాలని చిన్నప్పటి నుంచే అనుకున్నారా?
సీఎం: నేను చదువుకునేటప్పుడు ఐఏఎస్‌ కావాలని అనుకున్నా. మన కష్టం ఆ స్థాయికి సరిపోదేమో అనిపించింది. దానికన్నా ఎమ్మెల్యే అవుదామని అనుకున్నా. ఎమ్మెల్యే అయితే ఐఏఎస్‌లనే నియంత్రించవచ్చని అనిపించింది. యూనివర్శిటీలో చదువుతూనే ఎమ్మెల్యేనయ్యా. 
దళవాయి లోకనాధం (ఎస్‌వీయూలో పీహెచ్‌డీ): తిరుపతి వేదికగా అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వచ్చాయి. కానీ వాటిలో స్థానికేతరులకు ఉద్యోగాలు ఇస్తున్నారు. స్థానికంగా రిజర్వేషన్లు ఇచ్చేలా చట్టం చేయండి.
సీఎం: నూటికి 90 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇస్తున్నాం. ఈ విషయంలో నేను అందరితో సమన్వయం చేస్తున్నా. ఎక్కడైనా ఉల్లంఘిస్తే చెప్పండి. చర్యలు తీసుకుంటాం. కానీ దీన్ని అడ్డం పెట్టుకుని ఉద్యమాలు చేస్తే ఉద్యోగాలు ఊడతాయి. పెట్టుబడులు నాపై నమ్మకంతో వస్తున్నాయి.

దళిత ఎంపీపీ మైక్‌ లాక్కున్న టీడీపీ ఇన్‌చార్జ్‌ 
సాక్షి, అమరావతి: ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సీఎం నివాసం వద్ద ప్రజావేదికలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన నిరుద్యోగులు ముఖ్యమంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు.  సీఎం సరైన సమాధానం చెప్పకుండా దాటవేశారు. సీఎంను నిరుద్యోగులు అడిగిన ప్రశ్నలివీ..

ఐఏఎస్‌ కావాలనుకుని ఎమ్మెల్యేనయ్యా: సీఎం
‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకాన్ని గాంధీ, లాల్‌బహదూర్‌శాస్త్రి లాంటి మహనీయుల జయంతి రోజున ప్రారంభిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. యువతకు భరోసా ఇవ్వడానికే దీన్ని ప్రారంభిస్తున్నామన్నారు. మంగళవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆయన ఈ పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. తొలుత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 1వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని అర్హత సాధించిన సుమారు 2.10 లక్షల మందికి నిరుద్యోగ భృతిని ఈనెల నుంచి ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎంపికైన వారి ఖాతాలో బుధవారం రూ.వెయ్యి జమ చేస్తామని, నెలనెలా దీన్ని కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో ‘ఆంధ్రప్రదేశ్‌ యువజన విధానం–2018’ని విడుదల చేశారు. సమాచారశాఖ రూపొందించిన బాపూజీ లఘు చిత్ర సీడీని సీఎం ఆవిష్కరించారు. చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని ఫాక్స్‌కాన్‌ ఇండియా లిమిటెడ్, కియా మోటార్స్, బ్రాండెక్స్‌ ప్రతినిధులు ప్రశంసించారు.   

పుంగనూరు: యువనేస్తం కార్యక్రమం సందర్భంగా మంగళవారం చిత్తూరు జిల్లా పుంగనూరులో అధికార టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్‌ ఉల్లంఘించి వైఎస్సార్‌ సీపీ దళిత ఎంపీపీ నరసింహులుతోపాటు ఇతరులను అవమానించారు. పట్టణంలోని బిఎంఎస్‌ క్లబ్‌లో స్పెషల్‌ ఆఫీసర్‌ అరుణ ఆధ్వర్యంలో యువనేస్తం కార్యక్రమం ప్రారంభించారు. ఎమ్మెల్సీ సునీతతోపాటు పుంగనూరు ఎంపీపీ  నరసింహులు, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, కౌన్సిలర్లు దీనికి హాజరయ్యారు. టీడీపీ ఇన్‌చార్జ్‌ అనీషారెడ్డి, ఆమె భర్త శ్రీనాథరెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనీషారెడ్డి ఎంపీపీ నరసింహులును వేదిక పైనుంచి దిగిపోవాలని ఆదేశిస్తూ మైక్‌ లాక్కునేందుకు ప్రయత్నించడం వివాదానికి దారి తీసింది. ‘దళితులకు ఇచ్చే గౌరవం ఇదేనా...?’ అంటూ ఎంపీపీ నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల జోక్యంతో డీఎస్పీ నారాయణస్వామి, సీఐ సాయినాథ్‌ల ఆదేశాల మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి వైఎస్సార్‌ సీపీ నేతలను అడ్డుకున్నారు. స్పెషల్‌ ఆఫీసర్‌ అరుణ ప్రోటోకాల్‌ ఉల్లంఘిస్తున్నారని, వైఎస్సార్‌ సీపీ నేతలను లోపలకు రానివ్వకుండా టీడీపీ నేతలను మాత్రం ఎలా అనుమతిస్తారని జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్‌ ప్రశ్నించారు. దీంతో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్‌ సీపీ నేతలను పోలీసులు అడ్డుకుని కౌన్సిలర్లు మనోహర్, నయాజ్‌ లను బలవంతంగా లాక్కెళ్లి అరెస్ట్‌ చేశారు. అనంతరం అధికార పార్టీ నేతలు పోలీసుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. పలువురు నిరుద్యోగులు వెనుతిరిగి వెళ్లిపోవటంతో కంగుతిన్న టీడీపీ నేతలు సర్టిఫికెట్లు ఇస్తాం, తీసుకుని వెళ్లాలంటూ మైకులో అభ్యర్థించారు.

ఎమ్మెల్యే ఐజయ్యపై దౌర్జన్యం
నందికొట్కూరు: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే జీర్ణించుకోలేని అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. మంగళవారం కర్నూలు జిల్లా నందికొట్కూరులో నిర్వహించిన ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ దీనికి వేదికగా మారింది. జైకిసాన్‌ పార్కులో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు నాలుగున్నరేళ్లుగా గుర్తులేని నిరుద్యోగ భృతి ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులుండగా కేవలం 1.62 లక్షల మంది ఖాతాల్లో మాత్రమే ప్రభుత్వం రూపాయి చొప్పున జమ చేసిందన్నారు. జిల్లాలో 11,911 మందిని, నందికొట్కూరు నియోజకవర్గంలో 2,100 మందిని మాత్రమే ఎంపిక చేయడం సరికాదన్నారు. నీరు–చెట్టు పథకంలో అధికార పార్టీ నేతల దోపిడీ గురించి ఎమ్మెల్యే వివరిస్తుండగా అధికార పార్టీ నేతల జోక్యంతో మైక్‌ను కట్‌ చేశారు. దొంగల సంగతి ప్రజా కోర్టులో తేలాలని ఎమ్మెల్యే పట్టుబట్టడంతో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాండ్ర శివానందరెడ్డి వాగ్వాదానికి దిగారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేపైకి దూసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ఐజయ్య ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top