
బాబు ప్రమాణం ఖర్చు పదికోట్లు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా ఖర్చు కానుంది.
విజయవాడ, గుంటూరుల్లో హోటళ్లు, రిసార్టులు రిజర్వు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా ఖర్చు కానుంది. ప్రాథమికంగా ఐదు కోట్ల రూపాయలు ఖర్చవుతుందని భావించినప్పటికీ.. అది రెట్టింపయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
వీవీఐపీలకు వసతి, రవాణా సౌకర్యం, సభావేదిక ఏర్పాట్లు, ప్రాంగణం ముస్తాబు, బందోబస్తులో ఉన్న పది వేల మంది పోలీసు, రెవెన్యూ సిబ్బందికి భోజనాలు అన్నీ కలిపి రూ.10కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఈనెల 8వతేదీన చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు, 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించిన విషయం తెలిసిందే.