బొల్లినేని శ్రీనివాస్‌పై సీబీఐ దాడులు

CBI Attacks On Bollineni Srinivas Rao - Sakshi

జీఎస్టీ సీనియర్ అధికారి బొల్లినేనిపై అక్రమాస్తుల ఆరోపణలు

భారీగా ఆస్తులను గుర్తించిన సీబీఐ అధికారులు

ఎంపీ సుజనా చౌదరీ కేసులో ఫైళ్ల మార్పు

ఆయన భార్య బొల్లినేని శిరీషపై కూడా కేసు నమోదు

సాక్షి, హైదరాబాద్‌: జీఎస్టీ సీనియర్ అధికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్‌ కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్నా ఆరోపణలతో అధికారులు తొలుత ఆయనపై కేసు నమోదు చేసి.. దాడులు చేపట్టారు. రూ. 200 కోట్లు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని ఆయనపై అభియోగాలు మోపబడ్డాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన శ్రీనివాస్‌.. పదేళ్లకు పైగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లో పనిచేసిన అనుభవం ఉంది. ప్రసుత్తం ఆయన జీఎస్టీ సీనియర్ అధికారిగా పని చేస్తున్నారు. ఇప్పటి వరకు  ఆయన వద్ద నాలుగు కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. గాంధీతో పాటు ఆయన భార్య బొల్లినేని శిరీషపై కూడా కేసు నమోదు చేశారు.

రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరీకి సంబంధించిన కేసును విచారణ చేసిన గాంధీ.. చంద్రబాబు సూచనల మేరకు పలు ఫైళ్లల్లో మార్పులు చేసినట్టు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఆయనపై ఈడీ, కేంద్ర ఆర్థిక శాఖ, పీఎంవో  కార్యాలయం నుంచి అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో సీబీఐ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. గతంలో హైదరాబాద్‌ ఈడీ కార్యాలయం నుంచి బదిలీ అయినా.. అనధికారికంగా నెలరోజుల పాటు విధుల్లో కొనసాగారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో అనేక మంది టీడీపీ నేతలకు అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకోడానికి సహకరించినట్లు ఆయనపై అభియోగాలు మోపబడ్డాయి.

భారీగా అక్రమాస్తుల గుర్తింపు..
ఆయనపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఐపీసీ సెక్షన్ 109,13(2),13(1బీ) ప్రకారం అధికారులు కేసు నమోదు చేశారు. హోదాను అడ్డుపెట్టుకుని అక్రమాస్తులు సంపాదించినట్లు విచారణలో తెలుస్తోంది. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌లో భారీగా ఆస్తులు ఉన్నట్లు తెలుసింది. అధికారులు ఇ‍ప్పటి వరకు గుర్తించిన ఆస్తుల వివరాలు... కంకిపాడులో మూడు స్థలాలు, ప్రొద్దుటూరులో ఇళ్లు, కానూరులో 360 గజాల స్థలం, రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్‌లో 300 గజాల స్థలం, మరో రెండు స్థలాలు,  మదీనా గూడలో పది కుంటలు, విజయవాడ కంకిపాడులో 43 సెంట్లు, తుళ్లూరులో 42 సెంట్ల స్థలం,  కంకిపాడులో 2.96 సెంట్ల స్థలం, బ్యాంకు ఖాతాలో భారీగా నగదును గుర్తించారు. కూకట్పల్లి యాక్సిస్ బ్యాంక్ అకౌంట్లో రూ‌‌.20 లక్షలు, బంధువులు నరసింహారావు,శ్రీలత ఖాతాలో పది‌లక్షల నగదు, కుంటుబ సభ్యులపై ఫిక్సడ్ డిపాజిట్లు చేసినట్లు తెలిసింది.

సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో 1992లో విధుల్లో చేరిన గాంధీ.. 2002లో సూపరింటెండెండ్‌గా ప్రమోషన్ రావడంతో హైదరాబాద్ కమిషనరేట్‌లో చేరారు. 2003లో డీఆర్ఐలో చేరారు. 2004 నుంచి 2017 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లో పని చేశారు. ప్రసుత్తం ఆయన జీఎస్టీ సీనియర్ అధికారిగా కొనసాగుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top