నిద్దరోతున్న నిఘా...

Cannabis is smuggled into various places across Vizianagaram - Sakshi

గంజాయి రవాణాకు విజయనగరం జిల్లా స్వర్గధామంగా మారుతోంది. అటు ఒడిశా... ఇటు విశాఖ ఏజెన్సీ నుంచి ఇతర ప్రాంతాలకు తరలించాలంటే కచ్చితంగా ఈ జిల్లాను దాటిపోవాల్సిందే. ఇక్కడ పేరుకు చెక్‌పోస్టులున్నా.. తనిఖీలు నామమాత్రమే. అందుకే అంతా ఈ మార్గాన్నే రవాణాకు ఎంచుకుంటారు. ఇక్కడి అధికారులను మచ్చిక చేసుకుంటే ఎంత పెద్ద మొత్తంలోనైనా సరకు దర్జాగా దాటించేయొచ్చు. ఇదే అదనుగా కొందరు జిల్లావాసులు సైతం ఈ వ్యాపారంవైపు మొగ్గు చూపిస్తున్నారు. ప్రమాదాల్లో వాహనాలు బోల్తాపడినప్పుడో... మరేదో సందర్భంలోనో... గంజాయి రవాణా గుట్టు రట్టవుతున్నా... మిగతా సమయాల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా అధికారుల సహకారంతో తరలిపోతూనే ఉంటుంది.

సాక్షి, విజయనగరం : ఒడిశా రాష్ట్రం నుంచి, విశాఖ అటవీప్రాంతం నుంచి విజయనగరం మీదుగా వివిధ ప్రాంతాలకు దర్జాగా గంజాయి అక్రమ రవాణా చేసేస్తున్నారు. ఈ అక్రమ రవాణా గురించి తెలిసినా జిల్లా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఏదో ప్రమాదాల్లో మాత్రమే ఈ విషయం గుట్టు రట్టవుతోంది. ఇటీవల కొందరు యువకులు ప్రయాణిస్తున్న వాహనం కొత్తవలస మండలంలో ప్రమాదానికి గురయింది. ఆ సందర్భంలో ఆ వాహనంలో గంజాయి లభ్యమైంది. రెండు రోజుల క్రితం మరోచోట వాహనం బోల్తా పడింది. దానిలోనూ గంజాయి బస్తాలు బయటపడ్డాయి.

తాజాగా తన పంట చేను పక్కన కళ్లంలో గంజాయి బస్తాలున్నాయని ఓ రైతు పోలీసులకు చెప్పాడు. ఇలాంటి సందర్భాల్లో తప్ప అధికారులు స్వతహాగా దాడులు చేస్తున్న ఉదంతాలు నామమాత్రంగానే ఉన్నాయి. స్మగ్లర్లతో పోలీస్, జీసీసీ, రెవె న్యూ, ఎక్సైజ్‌ శాఖలోని కొందరు సిబ్బంది సత్సంబంధాలు కలిగిఉండటం వల్లనే అక్రమ రవాణాను ‘మామూలు’గా తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పావులుగా మారుతున్న యువత 
గంజాయిని ఖరీదైన కార్లు, ఆటో రిక్షాలు, టూ వీలర్లు, బస్సులు, లారీల్లోనూ, చింతపల్లిలోని సీలేరు, ముంచింగ్‌పుట్టులో మాచ్‌ఖండ్‌ నది ద్వారా  తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, ముంబై, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాలకు, అక్కడి నుంచి విదేశాలకు స్మగ్లింగ్‌ చేస్తున్నారు. దీని కోసం గిరిజనులు, యువత, విద్యార్థులను కొరియర్లుగా వాడుకుంటున్నారు. వాహనాల్లో గంజాయి రవాణాకు ప్రత్యేక మార్పులు చేస్తున్నారు. ఇలా విజయనగరం మీదుగా నిత్యం రూ.లక్షల విలువ చేసే గంజా యి, విలువైన అటవీ ఉత్పత్తులు, కలప యథేచ్ఛగా అక్రమంగా రవాణా అవుతోంది.

ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగంలో ఎక్కడా చలనం ఉండటం లేదు. జిల్లా పరిధిలో విశాఖ–అరుకు రోడ్డులో బొడ్డవరలో ఉన్న చెక్‌పోస్ట్‌ అక్రమ వ్యాపారాలకు అడ్డాగా ప్రసిద్ధిగాంచింది. అరుకు, అనంతగిరి, పాడేరు, డుంబ్రిగూడ మండలాల నుంచి వచ్చే వాహనాలు బొడ్డవర చెక్‌పోస్ట్‌ దాటి జిల్లాలోకి రావాలి. ఎప్పుడైనా సమాచారం ఉంటేనే స్థానిక ఎక్సైజ్, పోలీస్‌ శాఖలు దాడులు చేస్తున్నాయి. మిగతా సందర్భాల్లో చూసీచూడనట్టు వదిలేస్తున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top