మహిళా శక్తి

Bycycle Petroling For Woman Safety Krishna - Sakshi

ఆకతాయిల ఆటలకు ఇక చెల్లుచీటి

రంగంలోకి దిగుతున్న మొబైల్‌ కాప్స్‌

మహిళలకు అండగా ప్రత్యేక శిక్షణ పొందిన వైనం

ఐదు జోన్లలో ఐదు బృందాలతో నిఘా

బెజవాడ కమిషనరేట్‌లో పైలెట్‌          ప్రాజెక్టుగా అమలు

సాక్షి, అమరావతిబ్యూరో: ప్రస్తుత రోజుల్లో ఆడపిల్లలు, మహిళలు గడప దాటాలంటేనే భయం.. యువతులు కాలేజీకి వెళితే ఈవ్‌టీజింగ్‌.. సినిమాకు వెళితే ఆకతాయిల వేధింపులు.. మహిళలు ఆఫీసుకు వెళితే బాసుల అసభ్య ప్రవర్తన.. ఇలా ఎటుచూసినా ఏదొక రూపంలో మహిళలు మగవారితో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి బెడద ఇకపై బెజవాడ మహిళలకు ఉండబోదు. పోలీసు శాఖ అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ‘శక్తి మొబైల్‌ కాప్స్‌’ పేరిట మహిళా పోలీసు బృందాలను రంగంలోకి దింపనుంది. వీరి రాకతో భవిష్యత్‌లో బెజవాడమహిళలు నిశ్చింతగా ఉండొచ్చని పోలీసులు భరోసా ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా  ఏర్పాటు చేసే ఉద్దేశంలో భాగంగా డీజీపీ ఠాకూర్‌  ‘శక్తి మొబైల్‌ కాప్స్‌’కు రూపకల్పన చేశారు. అందులో భాగంగా తొలుత బెజవాడను పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకున్నారు. మహిళల రక్షణ, భద్రత కోసం ‘శక్తి మొబైల్‌ కాప్స్‌’ టీమ్‌లు రాజధాని రహదారులపైకి రానున్నాయి. పోలీసు శాఖ నేతృత్వంలో బెజవాడ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో తొలిసారి పైలెట్‌ ప్రాజెక్టు కింద ఈ ‘శక్తి’ టీమ్‌లను నియమించనున్నారు. మహిళల రక్షణ బాధ్యతలు చూసే ఈ టీమ్‌ సభ్యులకు పోలీసు శాఖ ప్రత్యేక శిక్షణను ఇస్తోంది. శిక్షణ కార్యక్రమం పూర్తయిన వెంటనే వీరు రంగంలోకి దిగనున్నారు.

ఐదు టీమ్‌ల ఏర్పాటు..
నగర కమిషనరేట్‌ పరిధిలోని ఐదు జోన్లలో ఐదు బృందాలను నియమించనున్నారు. ఒక్కో బృందంలో ఐదుగురు మహిళా పోలీసులు ఉంటారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి విధులు అప్పగిస్తారు. శిక్షణలో తైక్వాండో, స్విమ్మింగ్, డ్రైవింగ్, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తోపాటు మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. నగర పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు ఆధ్వర్యంలో పనిచేసే ‘శక్తి మొబైల్‌ కాప్స్‌’ టీమ్‌ సభ్యులు నగరంలో నిరంతరం ఈ–బైస్కిళ్లపై గస్తీ నిర్వహిస్తూ ఆకతాయిలపై నిఘా          పెడతారు.

మహిళల భద్రతే లక్ష్యం..
మహిళల భద్రత, రక్షణే లక్ష్యంగా ఈ బృందాలు పనిచేస్తాయి. పోలీసు డ్రెస్‌లో ఉండే శక్తి టీమ్స్‌ సభ్యులు నగరంలో నిత్యం గస్తీ నిర్వహిస్తూ మహిళలకు రక్షణ కవచంలా ఉంటారు. మహిళలను ఎవరైనా వేధించినా.. వెకిలి చేష్టలకు పాల్పడినా తక్షణమే వారిని అదుపులోకి తీసుకుంటారు. ముఖ్యంగా విద్యార్థినులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను అరెస్టు చేసి చట్ట ప్రకాశం శిక్షించడం వీరి విధి. ఈవ్‌టీజర్ల తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు పిలి పించి వారి సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇవ్వడం, మళ్లీ పట్టుబడితే నిర్భయ కేసును నమోదు చేయడం ‘శక్తి కాప్స్‌’ ముఖ్య నిర్వహణ.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top