మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఫొటోను అసహ్యంగా పోస్టు చేయడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
► డీజీపీకి ఫిర్యాదు చేసిన బ్రాహ్మణ సంఘాలు
విజయవాడ : తెలుగుదేశం పార్టీకి చెందిన వెబ్‌సైట్ లో మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఫొటోను అసహ్యంగా పోస్టు చేయడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా, బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్‌గా పనిచేసిన వ్యక్తిని ఇటువంటి పోస్టుల ద్వారా అవమానించడంపై తక్షణం పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పలువురు బ్రాహ్మణ ప్రతినిధులు విజయవాడలోని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో ఐజీ మీనాకు వినతిపత్రం సమర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టారని, కార్పోరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించిన ప్రభుత్వం, ఇప్పుడు అదే సోషల్ మీడియాలో కృష్ణారావుపై వచ్చిన పోస్టులపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 48 గంటల్లో ఈ అసభ్య పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. ఐజీ మీనాను కలిసిన వారిలో బ్రాహ్మణ సంఘాల నేతలు యేలేశ్వరపు జగన్మోహన్ రాజు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ద్రోణంరాజు రవికుమార్, జింకా చక్రధర్ తదితరులు వున్నారు.