ప్రజల కష్టాలు పట్టని అశోక్‌గజపతిరాజు

Botsa Satyanarayana Fires On TDP Government - Sakshi

సాక్షి, విజయనగరం : ఈ నాలుగేళ్లలో విజయనగరం జిల్లా సమస్యల గురించి కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా ఉన్నపుడు అశోక్‌గజపతిరాజు ఒక్కసారైనా చర్చించారా అని వైఎ‍స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అలా చర్చించి ఉంటే తల దించుకుంటానని ఆయన అన్నారు. బుధవారం విజయనగరం జిల్లాలో జరిగిన ‘వంచనపై గర్జన’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల కాలంలో విజయనగరం జిల్లాకు ఒరిగింది ఏమీ లేదని, రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారని విమర్శించారు.

రాచరికపు వ్యవస్థలో ఉన్న అశోక్‌గజపతిరాజుకు ప్రజల కష్టాలు పట్టవన్నారు. తోటపల్లి ప్రాజెక్టుకు సర్దార్ గౌతు లచ్చన్న పేరు పెట్టింది ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి అని, అబద్ధాలు చెప్పడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిట్టని ఆయన అన్నారు. నాలుగేళ్ల కాలంలో జిల్లాను ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. కోట సుందరీకరణ, విజ్జీ స్టేడియం అభివృద్ధి తప్ప ఇంకేమీ చేయలేదని అన్నారు. జిల్లాలో ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రైతులు నష్టపోతుంటే కనీసం నష్టపరిహారం అందించలేదని, జిల్లాలో రెండు షుగర్ ఫ్యాక్టరీలు ఉంటే ఒకటి మూసేశారన్నారు. బొబ్బిలి షుగర్ ఫ్యాక్టరీకి 7 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని తెలిపారు. 

శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి..
టీడీపీ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు. అత్యాచారాల నివారణకు చైతన్యం రావాల్సింది ప్రజల్లో కాదని, చంద్రబాబు నాయుడు కేబినేట్లో మార్పు రావాలని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు నాలుగేళ్ల అధికారంలో ఎందుకు నిరూపించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షం నీతి నిజాయితీల గురించి ప్రజలు చెప్తారని అన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top