అధికారుల మెడకు చంద్రన్న క్షేత్రం | Authorities in the field of neck Chandranna | Sakshi
Sakshi News home page

అధికారుల మెడకు చంద్రన్న క్షేత్రం

Jan 28 2015 3:08 AM | Updated on Sep 2 2017 8:21 PM

వ్యవసాయంలో సాంకేతిక మార్పులను వినియోగించుకుని అత్యధిక దిగుబడులకు రూపకల్పన చేస్తామని పదేపదే చెబుతూ వస్తున్న ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం సీజన్ ముగిశాక కళ్లు తెరిచింది.

సాక్షి, కడప : వ్యవసాయంలో సాంకేతిక మార్పులను వినియోగించుకుని అత్యధిక దిగుబడులకు రూపకల్పన చేస్తామని పదేపదే చెబుతూ వస్తున్న ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం సీజన్ ముగిశాక కళ్లు తెరిచింది. ఖరీఫ్, రబీకి సంబంధించి సీజన్ దాదాపు పూర్తయ్యే సమయంలో చంద్రన్న వ్యవసాయ క్షేత్రం పేరుతో హడావిడి చేస్తోంది. పంటలే లేనపుడు...భూ సేకరణ ఎలా?... ఎరువులు ఇప్పుడెలా ఖర్చు చేయాలి అంటూ పలువురు అధికారులు తమ చేత కాదని ఏకంగా లేఖల ద్వారా స్పష్టం చేశారు.

ఎలాగైనా 2014-15కు సంబంధించిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి విపరీతమైన ఒత్తిళ్లు స్థానిక వ్యవసాయాధికారులను వెంటాడుతున్నాయి. ఈ నేపధ్యంలో సీజన్ ముగిసిన తర్వాత చంద్రన్న వ్యవసాయ క్షేత్రాన్ని చేయలేక.... ఉన్నతాధికారుల ఒత్తిడి తట్టుకోలేక వ్యవసాయాధికారులు, ఏఈఓలు తలలు పట్టుకుంటున్నారు.
 
అక్టోబరులో ప్రారంభం కావాల్సి ఉండగా....
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్టోబరు రెండవ వారంలో చంద్రన్న వ్యవసాయక్షేత్రం పథకాన్ని అమలు చేస్తున్నట్లు నిబంధనలు తయారు చేసినా ఇప్పటివరకు అధికారుల దరిచేరలేదు. ఈ మధ్యకాలంలో జనవరి 2వ తేదీన వ్యవసాయశాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఖచ్చితంగా లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇదే అదునుగా భావించిన కొంతమంది ఉన్నతాధికారులు స్థానిక వ్యవసాయాధికారులపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు.

జిల్లాలో 12 వ్యవసాయ సబ్ డివిజన్లు ఉండగా, ఇందులో 12 మంది ఏడీలు, జిల్లాలోని 50 మండలాలకు సంబంధించి 11 మంది ఏఓలు, మండలానికి ఇద్దరు చొప్పున ఏఈఓలు ఉన్నారు. వీరందరికి సంబంధించి ఒక్కొక్కరికి 10 హెక్టార్లు చొప్పున తీసుకుని భూసార పరీక్షలకు మట్టిని సేకరించి..... కేంద్రానికి పంపితే అక్కడినుంచి వచ్చే నివేదికల ఆధారంగా ఎరువులను సూచిస్తూ ప్రణాళిక రూపొందిస్తారు. ఉదాహరణకు ఒక వ్యవసాయ డివిజన్‌కు సంబంధించి ఏడీ, ఏఓ, ఏఈఓలు 15 మంది ఉన్నారనుకుంటే.... వారందరికీ 150 నుంచి 170 హెక్టార్ల భూమిని దత్తత తీసుకుని పరీక్షలు నిర్వహించాలి.

భూసారపరీక్ష నివేదిక ప్రకారం భాస్వరం, పొటాష్, నత్రజని, యూరియా, మ్యాంగనీస్, జిప్సం, జింక్ తదితర ఎరువులు అవసరమని ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. తద్వారా ఒక్కొక్క డివిజన్‌కు 40 నుంచి 50 లక్షల విలువైన ఎరువులు, ఇతరత్రా యంత్రాలు వస్తే వాటిని రైతులకు సబ్సిడీపై అందజేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అక్టోబరు రెండవ వారంలో ప్రారంభమై యుద్ధ ప్రాతిపదికన చేసి ఉంటే రబీ రైతులకు అరుునా న్యాయం జరిగేది.  ఇప్పుడు మట్టి నమూనాలు, ఎరువులు, ఇతరత్రా రైతులు ఏం చేసుకుంటారని పలువురు అధికారులు ప్రశ్నిస్తున్నారు.
 
చేతులెత్తేసిన అధికారులు
చంద్రన్న వ్యవసాయ క్షేత్రంలో భాగంగా ప్రస్తుతం ఒత్తిడి చేసినా ఇప్పటికిప్పుడు లక్ష్యాలను ప్రారంభించలేమని పలువురు అధికారులు చేతులేత్తాశారు. అందుకు సంబంధించి జిల్లాలోని మూడు వ్యవసాయ డివిజన్లకు సంబంధించిన అధికారులు లేఖల ద్వారా చేయలేమని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఒక్క హెక్టారు కూడా ఇప్పటి పరిస్థితుల్లో చేయలేమని, ఉన్న పంటలు కూడా ఇప్పటికే అయిపోయాయని ఉన్నతాధికారులకు వివరించినట్లు సమాచారం.

మరికొన్ని డివిజన్లకు సంబంధించి 20-30 హెక్టార్లు సాధించామని చెబుతున్నా... అవన్నీ మొక్కుబడి వ్యవహారమే అని చెబుతున్నారు. ఏది ఏమైనా రైతులకు సంబంధించి సీజన్‌కు ముందస్తుగా చంద్రన్న క్షేత్రాన్ని తీసుకొస్తే బాగుంటుంది కానీ అంతా ముగిసిన తర్వాత తీసుకొచ్చి అమలు చేయాలనిచూడటం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement