అక్రమ మైనింగ్‌పై దాడులు | Attacks on illegal mining | Sakshi
Sakshi News home page

అక్రమ మైనింగ్‌పై దాడులు

Nov 9 2013 1:34 AM | Updated on Sep 2 2017 12:25 AM

దాదాపు 70 ఎకరాల్లో బలభద్రపురంలో జరుగుతున్న ఎర్ర కంకర అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మూడు పొక్లెయిన్లు, రెండు లారీలను సీజ్ చేశారు. సుమారు రెండేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా, ఏ విధమైన అనుమతులు లేకుండా భారీ స్థాయిలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు.

 బలభద్రపురం (బిక్కవోలు), న్యూస్‌లైన్ :
 దాదాపు 70 ఎకరాల్లో బలభద్రపురంలో జరుగుతున్న ఎర్ర కంకర అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మూడు పొక్లెయిన్లు, రెండు లారీలను సీజ్ చేశారు. సుమారు రెండేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా, ఏ విధమైన అనుమతులు లేకుండా భారీ స్థాయిలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. వాస్తవానికి గురువారం రాత్రే దాడులు జరిగినప్పటికీ, శుక్రవారం మధ్యాహ్నం వరకు ఈ విషయం వెలుగు చూడలేదు. ఇప్పటికే సుమారు 50 అడుగుల లోతుకు మైనింగ్ జరగడంతో కోట్ల రూపాయల్లో తవ్వకాలు జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ తవ్వకాలు సుమారు 5 ఎకరాల్లో జరుగుతున్నట్టు మైనింగ్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏడీ కె.సుబ్బారెడ్డి తెలిపారు.
 
  ఈ తవ్వకాలు డొక్కా సూరమ్మకు చెందిన 1.5 ఎకరాలు, కానూరి గురువులుకు చెందిన 1.42, కానూరి అప్పారావుకు చెందిన 1.5, గుత్తుల నాగేశ్వరరావుకు చెందిన 1.65, టేకుమూడి వెంకటరావుకు చెందిన 1.5, ముంజులూరి రాజ్యలక్ష్మికి చెందిన 1.13, ముద్దాడ అప్పారావుకు చెందిన 1.4 ఎకరాల అసైన్డ్ భూమిలో కొందరు అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారని చెప్పారు. అయితే స్థానిక అధికారులకు తెలియకుండా రెండేళ్లుగా ఈ తవ్వకాలు జరగడానికి ఆస్కారం లేదని, వారి మద్దతుతోనే తవ్వకాలు జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా తవ్వకాలపై పరిశీలన పూర్తయిన అనంతరం ఎంత మేరకు అక్రమ మైనింగ్ జరిగిందో తేలుతుందని, ప్రస్తుతానికి వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.
 
  ఈ ప్రాంతంలో అధిక శాతం ఎర్ర కంకర క్వారీలు ఉన్నందున అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి అక్రమ తవ్వకాలు సాగిస్తున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎస్పీ డి నరసింహులు, అసిస్టెంట్ జియాలజిస్ట్ శ్రీనివాస్, విజిలెన్స్ సీఐ చవాన్, సర్వేయర్ పల్లాలు, స్థానిక ఆర్‌ఐ శాంతిప్రియ, సర్వేయర్ గోవిందరాజులు, వీఆర్వోలు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement