తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ ప్రారంభోత్సవానికి కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి ఈ నెల మూడోవారంలో రానున్న నేపథ్యంలో...
కృష్ణా జల వివాదాల వ్యవహారం...
ఈ నెల మూడో వారంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ ప్రారంభోత్సవానికి కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి ఈ నెల మూడోవారంలో రానున్న నేపథ్యంలో జరగనున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన అపెక్స్ కౌన్సిల్ భేటీకి ముందుగా ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యే ఆస్కారముంది. అపెక్స్ కౌన్సిల్ భేటీలో సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కాగా అపెక్స్ కౌన్సిల్ సమావేశానికంటే ముందుగా ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు... ఈఎన్‌సీలు మరోసారి భేటీ కావాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని తెలంగాణ అధికారులు ధ్రువీకరించారు. అపెక్స్ కౌన్సిల్ భేటీకి అవసరమైన ఎజెండా తయారీకి కూడా అధికారుల సమావేశం ఉపయోగపడుతుందని చెప్పారు. నాగార్జున సాగర్‌లో నీటి లభ్యత, డిమాండ్, భవిష్యత్ తాగునీటి అవసరాల గణాంకాల విషయంలో రెండు రాష్ట్రాలు పొంతనలేని లెక్కలు చెబుతున్నాయి.
రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు కూర్చుని ఒకే రకమైన గణాంకాలు సమర్పించాలని బోర్డు సూచించింది. సమావేశమైతే జరిగింది కానీ.. నీటి వినియోగం, డిమాండ్ విషయంలో ఏకాభిప్రాయానికి రావడం సాధ్యం కాలేదు. రెండు రాష్ట్రాలు పరస్పర సహకార ధోరణిలో వెళితేతప్ప సమస్యకు పరిష్కారం లభించదని సూచిస్తూ కృష్ణా నదీ బోర్డు ఇటీవల రెండు రాష్ట్రాలకు లేఖలు రాసింది. బోర్డు ద్వారా సమస్యకు పరిష్కారం లభించే అవకాశం లేకపోవడంతో అపెక్స్ కౌన్సిల్ భేటీయే ఇందుకు మార్గంగా భావిస్తున్నారు. తద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.