రైల్వే జీఎంతో ఏపీ ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీ

AP MPs Meet With Railway GM In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: అమరావతి నూతన రైల్వేలైను, దక్షిణకోస్తా జోన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎంపీలమంతా దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాకు విజ్ఞప్తి చేశామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఎంపీ మిధున్‌రెడ్డి తెలిపారు. విజయవాడ, గుంతకల్లు, కర్నూలు, సికింద్రాబాద్ డివిజన్‌ పరిధిలోని ఏపీ ఎంపీలు మంగళవారం జీఎంతో భేటీ ఆయ్యారు. ఎంపీలు గోరంట్ల మాధవ్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వంగ గీతా, రెడప్ప, శ్రీకృష్ణదేవరాయలు, రఘురామకృష్ణంరాజు, కనకమేడల రవీంద్రబాబు, సత్యవతి, దుర్గా ప్రసాదరావు, వల్లభనేని బాలశౌరి, తలారి రంగయ్య, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, చింతా అనురాధ, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైజాగ్ డివిజన్‌లోనే వాల్తేర్ ఉండాలని ఎంపీలమంతా జీఎంకి వినతిపత్రం అందించమన్నారు. దీనికి టీడీపీ ఎంపీలు కూడా మద్దతు ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని కోరామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అన్ని అంశాలను సీఎం జగన్ దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లామని తెలిపారు. గత ఐదు ఏళ్లలో జరిగిన పనులు, రాబోయే ఐదు ఏళ్లలో ఎలాంటి పనులు చేపట్టాలనే అంశాలను చర్చించామని తెలిపారు. వాల్తేర్ లేని రైల్వే జోన్ వద్దని వైఎస్సార్‌సీపీతో పాటు టీడీపీ కూడా చెప్పిందని వెల్లడించారు. దీనికి సంబంధించి పార్లమెంటులో పోరాటం చేస్తామని తెలిపారు.

మౌలిక సదుపాయాలు కల్పన, 45 కిలోమీటర్ల ‘నడికుడి రైల్వే లైన్’ పూర్తి చేయాలని.. ‘కడప-బెంగళూరు రైల్వే లైన్‌’ను కూడా 2023 నాటికి పూర్తి చేయాలని చర్చించామన్నారు. గూడూరు, గుంతకల్, విజయవాడ డబ్లింగ్ పనులు త్వరలో పూర్తి చేయాలని.. స్టేషన్లలో ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. తాము ఇచ్చిన సూచనలు తీసుకుంటామని.. కోర్టు తీర్పు అనంతరం నడికుడి రైల్వేలైన్‌ను ఐదు నెలల్లో పూర్తి చేస్తామని జీఎం హామీ ఇచ్చారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో పనిచేసేవారికి వీలుగా అన్ని ప్రాంతాల నుంచి అమరావతికి రైళ్లు నడపాలని కాకినాడ ఎంపీ వంగా గీత జీఎంను కోరినట్టు తెలిపారు. జగ్గయ్యపేట రైల్వే లైను గురించి చర్చించామని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. వాల్తేరు డివిజన్ మాయమైపోతుందంటే బాధ కలిగిందని మొత్తం ఎంపీలంతా కలిసి వాల్తేరు గురించి మాట్లాడామని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ తెలిపారు. ఒక డివిజన్‌ని తీసివేయడం ఇప్పటి వరకు దేశ చరిత్రలో జరగలేన్నారు. అనంతపురం జిల్లాకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రతి రోజు అనంతపురంలో ఆగేలా చూడాలని జీఎంను కోరామన్నారు.

విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు వేగవంతం చేయటం, వచ్చే రైల్వే బడ్జెట్‌కు సంబంధించిన అంశాలు. కొత్త రైల్వే లైన్‌లు ఏర్పాటు చేయాలని విజయవాడ డివిజన్‌కు మరిన్ని కొత్త రైళ్లు ప్రవేశపెట్టాలని కోరినట్టు ఎంపీలు తెలిపారు. విజయవాడ డివిజన్ మరింతగా విస్తరించడంతో కొత్త కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశం ఉంటుందని జీఎం దృష్టికి తీసుకువచ్చామన్నారు. దక్షిణ కోస్తాజోన్‌కు మరింత భూమిని, ఉద్యోగుల సంఖ్యను కూడా పెంచాలని ఎంపీలు జీఎంకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. 

జగ్గయ్యపేట ప్రాంతంలో గత 30 ఏళ్లుగా గూడ్స్ రైళ్లు మాత్రమే తిరుగుతున్నాయని.. జగ్గయ్యపేట నుంచి విజయవాడకు ప్యాసింజర్‌ రైల్వే లైన్ వేసి, ప్రజల సౌకర్యం కోసం కృషి చేయాలని రైల్వే అధికారులకు ఎమ్మెల్యే సామినేని ఉదయభాను విజ్ఞప్తి చేశారు. అన్ని వివరాలతో కూడిన రిప్రజెంటేషన్ అందజేశారు. విజయవాడ  రైల్వే లైన్లలో ఇబ్బందులను ఎమ్మెల్యే మల్లాది విష్ణు జీఎం గజానన్‌కు వివరించారు. రామవరప్పాడు, గుణదల, మధురానగర్ ప్రాంతాలలో రైల్వే లైన్ల పారిశుధ్యంపై మాట్లాడామని మల్లాది మీడియాకు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్ల డబ్లింగ్ త్వరగా పూర్తి చేస్తామని జీఎం హమీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top