బంగ్లాదేశ్‌ నుంచి తిరిగొస్తామని అనుకోలేదు 

AP medical students stranded in Bangladesh due to lockdown returned to state - Sakshi

రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల సహకారంతో క్షేమంగా ఉన్నాం 

మెడిసిన్‌ చదువుతున్న తెలుగు విద్యార్థుల మనోగతం 

సాక్షి, నెల్లూరు: లాక్‌డౌన్‌ కారణంగా బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన మెడికల్‌ విద్యార్థులు 50 రోజుల అనంతరం రాష్ట్రానికి చేరుకున్నారు. బంగ్లాదేశ్‌ నుంచి విమానంలో చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న 13 మంది విద్యార్థులను ఏపీ అధికారులు నెల్లూరుకి తరలించారు. అక్కడ ఓ హోటల్లోని క్వారంటైన్లలో వారిని ఉంచారు. ఈ సందర్భంగా విద్యార్థులు ‘సాక్షి’తో మాట్లాడుతూ..లాక్‌డౌన్‌ కారణంగా బంగ్లాదేశ్‌లో వారు ఎదుర్కొన్న సమస్యలు, ఏపీ ప్రభుత్వం చూపిన చొరవను వివరించారు. కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి రాకపోకలు నిలిపివేయడంతో భయాందోళనకు గురయ్యామని, కుటుంబసభ్యులను తలచుకుంటూ కుమిలిపోతున్న తరుణంలో సీఎం వైఎస్‌ జగన్‌ తమను దేవుడిలా ఆదుకున్నారని తెలిపారు. ‘భారత్‌లో లాక్‌డౌన్‌ ప్రకటించారని తెలియగానే ఆందోళన చెందాం.

మా కళాశాల హాస్టల్లో ఉండే పలు దేశాలకు చెందిన విద్యార్థులు వారి దేశాలకు వెళ్లిపోగా, తెలుగు విద్యార్థులు బంగ్లాదేశ్‌లోనే చిక్కుకుపోయాం. భారత్‌కు వచ్చేందుకుగాను విమాన టికెట్‌ కోసం ఎంతో ప్రయత్నించాం. ఢాకా నుంచి చెన్నైకి టికెట్‌లను కొనుగోలు చేస్తే బంగ్లాదేశ్‌ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి, వందే భారత్‌ యాప్‌ ద్వారా మా వివరాలిచ్చాం. చివరికి ఢాకా నుంచి చెన్నై వరకు విమానం వేసి మమ్మల్ని తీసుకువచ్చారు. ఎయిర్‌పోర్టులో దిగగానే నెల్లూరుకు చెందిన అధికారులు మమ్మల్ని రిసీవ్‌ చేసుకొని నెల్లూరుకు తరలించి మమ్మల్ని క్వారంటైన్లలో ఉంచారు. స్టార్‌ హోటల్లో గదులిచ్చి, మంచి పౌష్టికాహారం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో మేము ఏపీకి రాగలిగాం. దీనికి సహకరించిన సీఎం వైఎస్‌ జగన్‌కు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని చెప్పారు.  

రాష్ట్రానికి 2 వేల మంది ప్రవాసాంధ్రులు 
విదేశాల్లో చిక్కుకున్న వారిలో రాష్ట్రానికి వస్తున్న ఆంధ్రులు 2,000 మందికిపైగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రవాసాంధ్రుల వ్యవహారాలు) వెంకట్‌ మేడపాటి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులను స్వదేశానికి రప్పించడానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డా. జైశంకర్‌కు పలుమార్లు ఈమెయిల్స్‌ పంపడంతో వారిని మంగళవారం నుంచి విమానాల్లో నేరుగా రాష్ట్రానికి పంపనున్నారని తెలిపారు. ఫిలిప్పీన్స్, యూఏఈ, యూకే, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, మలేసియా, ఐర్లాండ్, కజకిస్తాన్‌ నుంచి 13 విమానాలు మంగళవారం నుంచి జూన్‌ 1 వరకు నేరుగా ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలకు చేరుకుంటాయన్నారు. వీరితో పాటు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ విమానాశ్రయాలకు ఏపీకి చెందిన 200 మంది పైగా ప్రయాణికులు వస్తున్నారని చెప్పారు. వారిని పరీక్షించి  వైరస్‌ లక్షణాలున్న వారిని  కోవిడ్‌–19 ఆస్పత్రికి తీసుకువస్తారని వివరించారు. మిగిలిన వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌ కోసం సంబంధిత జిల్లాకు తీసుకెళ్తారు. 

విశాఖ చేరుకున్న ప్రవాసాంధ్రులు
ఎన్‌ఏడీ జంక్షన్‌ (విశాఖ పశ్చిమ): విశాఖ విమానాశ్రయానికి 314 మంది ప్రవాసాంధ్రులు చేరుకున్నారు. అబుదాబి నుంచి మంగళవారం రాత్రి 8.45 గంటలకు వచ్చిన విమానంలో 148 మంది చేరుకున్నారు. ఇందులో 87 మంది విశాఖ వాసులు. మనీలా నుంచి రాత్రి 8.30 గంటలకు వచ్చిన విమానంలో 166 మంది రాగా.. వీరిలో 8 మంది జిల్లా వాసులు ఉన్నారు. వీరికి ప్రత్యేక వైద్య పరీక్షలు చేశాక జిల్లాలకు తరలించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top