నిరుద్యోగిత అంతం.. ప్రభుత్వ పంతం

AP Government Trying To Reducing The Unemployment  - Sakshi

ప్రారంభమైన కార్పొరేషన్‌ రుణాల దరఖాస్తు ప్రక్రియ

దాదాపు 12 కార్పొరేషన్‌లు, ఫెడరేషన్‌ల ద్వారా రుణాల మంజూరు

దరఖాస్తుకు ఈ నెల 30 ఆఖరు తేదీ

సాక్షి, సాలూరు (విజయనగరం): అన్ని వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాల మంజూరుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంకల్పించింది. 2019– 20 ఆర్థిక సంవత్సరంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా బ్యాంకు సబ్సిడీల రుణాల మంజూరుకు ప్రకటన వెలువడింది. ఈ నెల 10వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ధరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 30న ధరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు గడువుగా నిర్ధారించింది.

కార్పొరేషన్‌లు ఇవే..
బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, ఈబీసీ, క్రిస్టియన్‌ మైనారిటీ, వైశ్య, కాపు, వికలాంగులు, అత్యంత వెనుకబడిన కులాలు, ముస్లిం కార్పొరేషన్‌ల ద్వారా ఈ రుణాలు మంజూరు చేయనున్నారు. 50 శాతం సబ్సిడీపై రుణాలు ఇస్తారు.

దరఖాస్తు ఎలా?
https://apobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత వివిధ కార్పొరేషన్‌ల లింక్‌లు వస్తాయి. వాటిలో అభ్యర్థులకు సంబంధించిన కార్పొరేషన్‌పై క్లిక్‌ చేసుకోవాలి. తర్వాత అందులోని వివరాలు నమోదు చేయాలి .

గతంలో ధరఖాస్తు చేసుకున్న వారికి కూడా..
గత ఆర్థిక సంవత్సరంలో బీసీ, ఎస్సీ, కార్పొరేషన్ల ద్వారా వేలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరందరికి అప్పట్లో అధికారులు ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా వరకూ టీడీపీ వారికే లబ్ధి చేకూరింది. మండలానికి పరిమిత యూనిట్‌లే కేటాయించడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జన్మభూమి కమిటీలు రుణాలు తీసుకున్నారన్న విమర్శలు నాడు వినిపించాయి. ఈ క్రమంలో  చాలా మంది అర్హులైన వారికి రుణాలు అందకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వీరంతా పెండింగ్‌ జాబితాలో ఉన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో గతంలో దరఖాస్తు చేసుకుని లబ్ధిపొందని వారు కూడా తిరిగి దరఖాస్తును రెన్యువల్‌ చేసుకోవాలని సూచించింది.

భరోసా దొరికింది..
గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులకే లోన్‌లు మంజూరయ్యేవి. వైఎస్సార్‌సీపీకి చెందిన వారిమన్న కారణంగా ఎన్నిసార్లు లోన్‌లకు దరఖాస్తులు చేసుకున్నా నాటి టీడీపీ నాయకులు జన్మభూమి కమిటీలు రుణాలు మంజూరు చేయనివ్వలేదు. ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పనకు ఆర్థిక సహకారం అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలోనైనా రుణాలు మంజూరవుతాయని ఆశిస్తున్నాం. 
– గణపతి, దరఖాస్తుదారుడు, గడివలస గ్రామం, పాచిపెంట మండలం

రుణ దరఖాస్తుల రెన్యువల్‌కు అవకాశం
గత ఆర్థిక సంవత్సరంలో రుణ దరఖాస్తుల రెన్యువల్‌కు అవకాశం ఉంది. గతేడాది దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత దరఖాస్తునే రెన్యువల్‌ చేయించుకోవాలి. 
– రామారావు, ఎంపీడీఓ, పాచిపెంట మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top