జాతీయస్థాయికి ‘రాజధాని’ అన్యాయం | AP farmers to request on arrange of national status to AP | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయికి ‘రాజధాని’ అన్యాయం

Feb 20 2015 5:16 AM | Updated on Sep 2 2017 9:35 PM

రాజధాని కోసం బలవంతపు భూసమీకరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు కలసివచ్చే రాజకీయపక్షాల, ప్రజాసంఘాలు..

మంగళగిరి: రాజధాని కోసం బలవంతపు భూసమీకరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు కలసివచ్చే రాజకీయపక్షాల, ప్రజాసంఘాలు, రాజధాని ప్రాంతరైతులతో కలిసి ఐక్యకార్యాచరణ వేదికను ఏర్పాటు చేయాలని రాజధాని రైతు, రైతుకూలీల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఐక్య చర్చావేదిక తీర్మానించింది. ఇప్పటి వరకు జరిగిన భూసమీకరణపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరింది. 

భూసేకరణ చట్టాన్ని మార్చడంపై ప్రముఖ సామాజికవేత్త అన్నాహజారే చేపట్టిన దీక్షకు మద్దతు తెలపాలని నిర్ణయించింది. ఒక బృందం ఢిల్లీ వెళ్లి హజారే దీక్షకు మద్దతు తెలపడంతో పాటు రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాన్ని వివిధ రాజకీయపక్షాల నాయకులు, ముఖ్యనేతలకు వివరించాలని తీర్మానించింది. సమితి ఆధ్వర్యంలో స్థానిక చిల్లపల్లి నాగేశ్వరావు కల్యాణమండపంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీల నేతలతో పాటు, ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాలు, మహిళా సంఘాలు , రైతులు భారీగా పాల్గొన్నారు.
 
 నష్టాలపై అవగాహన కల్పిద్దాం
 తొలుత వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ భూసమీకరణ వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తే 29 గ్రామాల్లో అంగీకార పత్రాలు ఇచ్చిన రైతుల్లో సగం మందికిపైగా వెనక్కి తీసుకునే అవకాశముందని చెప్పారు.  తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సైతం రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా పోరాడదామని చెప్పారని తెలిపారు.  మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ సీఆర్‌డీఏ  పేరుతో భూములను తీసుకుని వాటితో వ్యాపారం చేసి రాజధాని నిర్మిస్తావా, నిధులు లేనిది ఎలా నిర్మాణం సాగిస్తావు.. సీఎంగా అనుభవం ఉన్న వ్యక్తికి తెలియదా.. అని చంద్రబాబును ప్రశ్నించారు.
 
 గ్రామాలవారీ కమిటీలు అవసరం
 వైఎస్సార్ సీపీ రైతు విభాగం కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి మాట్లాడుతూ భూసమీకరణ వల్ల కలిగే నష్టాలను వివరించేందుకు గ్రామాల వారీగా కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. మాజీ మత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ భూములు లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.కృష్ణాడెల్టా పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ ఉద్యమాన్ని జాతీయస్థాయికి వెళ్లేలా కార్యాచరణను రూపొందించాలని కోరారు.
 
 అంగీకార పత్రాలు ఇస్తే ఆత్మహత్యలే..
 న్యాయవాది మల్లెల శేషగిగరిరావు మాట్లాడుతూ అంగీకారపత్రంతో ప్రభుత్వం ఇచ్చే రశీదుకు విలువ లేదన్నారు. అఖిల భారత రైతుసంఘం నాయకుడు కుమారస్వామి, రైతు నేతలు అనుమోలు గాంధీ, ఎంపీపీ పచ్చల రత్నకమారి, జనచైతన్యవేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement