విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న ఎన్నికల హామీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విస్మరించారని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, బొత్స సత్యనారాయణ విమర్శించారు.
హైదరాబాద్ : రాయలసీమ ప్రజలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ప్రజలకు పనికొచ్చే విషయాలపై అసెంబ్లీలో చర్చ జరగడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, బొత్స సత్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. బాబు ఏ మాత్రం మారలేదని, రైతు వ్యతిరేకి అని మరోసారి రుజువైందని వారు మండిపడ్డారు.
విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న ఎన్నికల హామీని చంద్రబాబు విస్మరించారని రఘువీరా, బొత్స విమర్శించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఛార్జీలు పెరగలేదు కానీ కిరణ్ కుమార్ సీఎంగా ఉన్నప్పుడు ఛార్జీలు పెరిగాయని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు.
గతంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఛార్జీలు పెరిగితే ప్రభుత్వంపై తిరగబడాలని, ధర్నాలు చేయాలని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఎలా పెంచారని వారు ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలపై రూ.1000కోట్ల భారం మోపారని వారు పేర్కొన్నారు. మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ, కేంద్రం సహకరిస్తున్నప్పటికీ ఛార్జీలు పెంచడం సబబు కాదన్నారు.