కునుకు లేకుండా చేస్తున్న మరో పైపులైన్ | Sakshi
Sakshi News home page

కునుకు లేకుండా చేస్తున్న మరో పైపులైన్

Published Mon, Jun 30 2014 2:04 AM

కునుకు లేకుండా  చేస్తున్న మరో  పైపులైన్ - Sakshi

మామిడికుదురు:  ‘నగరం’ మహా విస్ఫోటం కళ్లముందు కదలాడుతుండడంతో.. గెయిల్ సంస్థ తమ ఊళ్ల నుంచి వేసిన గ్యాస్ పైపులైన్లు నగరం ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తరచూ అవి లీకవుతూ ఉండడంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని తాటిపాక-కాకినాడ ట్రంక్ పైపులైన్ తరచూ మరమ్మతులకు గురవడం స్థానికులను భయానికి గురి చేస్తోంది. ఈ లైన్ వెళ్తున్న పాశర్లపూడిలో పైపులైన్లకు వారం రోజుల వ్యవధిలో కేవలం 500 మీటర్ల పరిధిలోనే ఆరుచోట్ల మరమ్మతులు చేశారు. భూమికి అయిదున్నర అడుగుల లోతులో ఏర్పాటు చేసిన 18 అంగుళాల పైపులైన్ల ద్వారా నిత్యం ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల సహజ వాయువు సరఫరా చేస్తున్నారు.

నగరం నుంచి కాకినాడ వరకూ ఒకటి, తాటిపాక నుంచి సామర్లకోట వరకూ మరొకటి ఈ పైపులైన్లు ఉన్నాయి. ఈ లైన్లలో ఎక్కడ లీకేజీలున్నా దానిని గుర్తించే యూనిట్ తాటిపాక టెర్మినల్‌లో ఉంది. ఆ పైపులు తరచూ మరమ్మతులకు గురవుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగా, భారీ విధ్వంసానికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. విజయవాడ ల్యాంకో ప్రాజెక్టుకు గ్యాస్ సరఫరా చేస్తున్న ఈ పైపులైన్ కంట్రోల్ యూనిట్ వాల్వ్ 10 కిలో మీటర్ల దూరంలోని దిండి గ్రామంలో ఉంది. ప్రమాద సమయానికి అక్కడ విధులు నిర్వహించే ఉద్యోగి అందుబాటులో లేకపోవడమే విస్ఫోటానికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గ్యాస్ లీక్‌పై  ఆందోళన

రాజోలు మండలం పొన్నమండ-8 బావి నుంచి జీసీఎస్‌కు చమురు, సహజవాయు నిక్షేపాలను తరలించే పైపులైన్ నుంచి  లీకేజీ జరిగింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఓఎన్‌జీసీ వైఖరిని నిరసిస్తూ ఆదివారం ధర్నాకు దిగారు. అయితే ఉత్పత్తి నిలిపివేసిన బావి నుంచి లీకేజీ వస్తోందని, దీనివల్ల ప్రమాదం లేదని అధికారులు చెప్పారు.
 
 

Advertisement
Advertisement