‘అన్న క్యాంటీన్లు’ డౌటే ! | anna canteens doubt in andhra pradesh | Sakshi
Sakshi News home page

‘అన్న క్యాంటీన్లు’ డౌటే !

Jun 5 2015 8:18 AM | Updated on Sep 3 2017 3:16 AM

‘అన్న క్యాంటీన్లు’ డౌటే !

‘అన్న క్యాంటీన్లు’ డౌటే !

పేదలకు ఐదు రూపాయలకే అన్నం పెట్టాలనే యోచనతో ప్రకటించిన అన్న క్యాంటీన్ల ఏర్పాటు అనుమానంగా మారింది.

సాక్షి, హైదరాబాద్: పేదలకు ఐదు రూపాయలకే అన్నం పెట్టాలనే యోచనతో ప్రకటించిన అన్న క్యాంటీన్ల ఏర్పాటు అనుమానంగా మారింది. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత ఏడాది కిందట చెప్పారు. 2014 అక్టోబర్ నుంచి తొలివిడతగా అనంతపురం, చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం జిల్లా కేంద్రాల్లో 35 సెంటర్లను ప్రారంభిస్తామని ప్రకటించారు.

ఎన్టీఆర్ క్యాంటీన్ల ద్వారా పేదలకు రూ.5కే సాంబారు అన్నం, రూ.3కు పెరుగన్నం, రూపాయికే ఇడ్లీ ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఏర్పాటుపై ప్రభుత్వంలో కదలిక కనిపించడంలేదు. క్యాంటీన్లు ప్రారంభించకుండానే వాటిని ఏర్పాటు చేస్తే అందులో భోజనం చేస్తారా అనే సందేహం ప్రభుత్వం వైపునుంచి వ్యక్తమైనట్లు సమాచారం. దీంతో క్యాంటీన్ల ఏర్పాటుపై ఇప్పట్లో ఆలోచించే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ పేరిట ప్రకటించిన పథకాన్నే పట్టించుకోవడం లేదు. తమిళనాడులో ‘అమ్మ క్యాంటీన్ల’ పేరిట ఆ ప్రభుత్వం ఈ పథకాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తోంది.

అంతేగాకుండా తెలంగాణలోని హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, ఇస్కాన్ సంయుక్తంగా ఇలాంటి పథకాన్నే జయప్రదంగా నిర్వహిస్తున్నాయి. అన్న క్యాంటీన్ల ఏర్పాటుకోసం పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణలతో కూడిన మంత్రుల బృందం తమిళనాడులోని అమ్మ క్యాంటీన్లపై రెండుసార్లు అధ్యయనం చేసి వచ్చింది. తమిళనాడులో మాదిరి ఇక్కడ ఆశించిన మేరకు స్పందన కనిపించకపోతే క్యాంటీన్లు ఏర్పాటుచేసినా ప్రయోజనం ఉండదనే రీతిలో పాలకులు ఆలోచిస్తుండటంతో ఆ పథకానికి ఇక మంగళం పాడినట్లేనన్న ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ముందు చెప్పినట్లు అనంతపురం, చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లోనైనా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని మంత్రి సునీత ప్రస్తావించగా.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుందామని అధికారులు చెప్పినట్లు సమాచారం. అన్న క్యాంటీన్లను ఎప్పుడు ఏర్పాటు చేస్తారా అని రిక్షా కార్మికులు, చిరు వ్యాపారాలు ఆశగా చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement