అంగన్‌వాడీ వర్కర్ల శిక్షణ కేంద్రాలు మూసివేత

Anganwadi Training Centres Closed In West Godavari - Sakshi

దెందులూరు: జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ వర్కర్ల శిక్షణ కేంద్రాలు మూతపడ్డాయి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈ కేంద్రాలకు బ్యాచ్‌లను నిలిపివేశారు. దీంతో శిక్షణ కేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు.  కేంద్ర ప్రభుత్వం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆ«ధ్వర్యంలో 2002లో జిల్లాలోని దెందులూరు మండలంలో, 1983లో ఏలూరులో అంగన్‌వాడీ వర్కర్ల శిక్షణ కేంద్రాలను మంజూరు చేసింది. ఒక్కో కేంద్రంలో 13 మంది ఉద్యోగులను ఆవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన జిల్లా ఐసీడీఎస్‌ పీడీ ఎంపిక చేశారు. ఒక్కో కేంద్రంలో కో–ఆర్డినేటర్‌–1, ఇన్‌స్ట్రక్టర్‌లు–2, డ్రాయింగ్, క్రాఫ్ట్, టైలరింగ్‌ టీచర్‌లు–3 క్లర్క్‌–1, కంప్యూటర్‌ ఆపరేటర్‌–1, అటెండర్‌–1, వాచ్‌మెన్‌–1, కుక్‌–1, చౌకీదార్‌–1, స్వీపర్‌–1 ఉన్నారు.

ఒక్కొక్కరికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ వేతనం ఇచ్చేవారు. ఒక్కో బ్యాచ్‌లో 40 మంది అంగన్‌వాడీ వర్కర్లు, 50 మంది ఆయాలకు శిక్షణ ఇచ్చేవారు. 40 బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చారు. 2017 మార్చిలో ఈ శిక్షణ  కేంద్రాలకు బ్యాచ్‌లను ప్రభుత్వం నిలిపివేసింది. ఆ ఏడాది జూన్‌లో ఈ కేంద్రాల ఉద్యోగులు స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ను కలిసి పరిస్థితి వివరించారు. అనంతరం నో వర్క్, నో పే అంటూ  కమిషనర్‌ రెండు కేంద్రాలకు ఆదేశాలు పంపారు. దీంతో ఏలూరు, దెందులూరులో పనిచేస్తున్న 26 మంది వివిధ  ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. వీంతో ఆ కుటుంబాల జీవనం ప్రశ్నార్ధకంగా మారింది.  ఇటీవల దెందులూరులో పాదయాత్ర నిర్వహించిన  వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఇన్‌స్ట్రక్టర్‌లు, కో–ఆర్డినేటర్‌లు నివేదిక అందజేసి ఉపాధి కల్పించాలని వేడుకున్నారు.

నా సీనియారిటీ వృథా
స్త్రీ శిశు సంక్షేమ శాఖ అంగన్‌వాడీ వర్కర్ల శిక్షణ కేంద్రంలో ఇన్‌స్ట్రక్టర్‌గా 15 ఏళ్లు సేవలందించాను. అకస్మాత్తుగా శిక్షణ కేంద్రాలకు బ్యాచ్‌ల కేటాయింపు నిలిపివేశారు. 15 ఏళ్ల సీనియారిటీ వృధా అయ్యింది. చాలా బాధగా వుంది. – నిర్మల, ఇన్‌స్ట్రక్టర్‌

మా భవిష్యత్తు ఏమిటి?
అంగన్‌వాడీ వర్కర్ల ట్రైనింగ్‌ సెంటర్‌లకు బ్యాచ్‌ల కేటాయింపు నిలిపివేయటంతో ఉపాధి కోల్పోయాను. నాపై ఆధారపడ్డ కుటుంబ సభ్యుల జీవనం ప్రశ్నార్ధకంగా మారింది.– రాధ, ఇన్‌స్ట్రక్టర్‌

కనీస సమాచారం ఇవ్వలేదు
అంగన్‌వాడీ వర్కర్ల శిక్షణ కేంద్రాలకు కనీస సమాచారం ఇవ్వకుండా బ్యాచ్‌లను నిలిపివేశారు. ప్రస్తుతం మా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏళ్ల తరబడి సేవలందించాము. ప్రభుత్వం మాకు ఇచ్చే కానుక ఇదేనా.     – బెనర్జీ, ఇన్‌స్ట్రక్టర్‌

ప్రభుత్వం స్పందించాలి
అంగన్‌వాడీ వర్కర్ల శిక్షణ కేంద్రాలకు బ్యాచ్‌లను ప్రభుత్వం నిలిపివేసే ముందు ఈ కేంద్రాల్లో  సేవలందిస్తున్న సిబ్బంది గురించి ప్రభుత్వం ఆలోచించలేదు. మా భవిష్యత్తు అంధకారం చేస్తారా. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలేగానీ అదే సమస్యగా మారకూడదు. ప్రభుత్వం మానవతాదృక్పధంతో స్పందించి తిరిగి బ్యాచ్‌లను అంగన్‌వాడీ శిక్షణ కేంద్రాలకు పంపాలి.  – సుప్రియ, ఇన్‌స్ట్రక్టర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top