కనీస వేతనాలందక అంగన్‌వాడీ కార్యకర్తలు అవస్థలు పడుతున్నారు. వెట్టిచాకిరి చేస్తున్నా పాలకులు స్పందించడం లేదు.
మెదక్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: కనీస వేతనాలందక అంగన్‌వాడీ కార్యకర్తలు అవస్థలు పడుతున్నారు. వెట్టిచాకిరి చేస్తున్నా పాలకులు స్పందించడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణే గాక ప్రభుత్వం ఇతర పనులను సైతం వీరితోనే చేయిస్తోంది. పనిగంటలు, బాధ్యతలు పెరిగినా ఆ మేరకు జీతాలు పెరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంత చాకిరి చేస్తున్నా అంగన్‌వాడీ కార్యకర్తకు కేవలం రూ.3,700, ఆయాకు రూ.1,950 చొప్పున నామమాత్రపు జీతాలను చెల్లిస్తుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రీస్కూల్ నడిపిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు.
అందోళనబాట పట్టిన కార్యకర్తలు..
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనబాట పట్టారు. కనీస వేతనం రూ.10,000 చెల్లించాలని, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ప్రతి కేంద్రానికి సొంతభవనాన్ని సమకూర్చాలని, సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని, పెరిగిన ధరలకనుగుణంగా మెనూ చార్జీలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
మూతపడిన కేంద్రాలు..
అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు గత రెండు రోజులుగా ఆందోళనబాట పట్టడంతో ఆయా కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందక నానా ఇబ్బందులు పడుతున్నారు.