అదిగో అందాల గిరి

andhrapradesh tourisium spots

ప్రపంచ జీవకోటిని మేల్కొలిపే ఉదయభానుడి సువర్ణ కిరణాలను వీక్షించాలంటే నవ్యాంధ్ర రాష్ట్రంలోని బాపట్లలోని సూర్యలంకకు వెళ్లాలి. గిరి శిఖరాల నుంచి హోయలొలుకుతూ జాలువారే జలపాతాలను చూడాలంటే శ్రీశైలంలో తరించాలి. మానవ మహా నిర్మితమంటే నాగార్జునసాగర్‌ డ్యామ్‌ను చూడాలి. కానీ చారిత్రక ప్రాంతాన్ని తెలుసుకోవాలంటే ‘కొండవీడు’ ప్రాంతానికి వెళ్లి తీరాల్సిందే. యోధాను యోధులు, మరెందరో రాజులు మోహించిన సుందరస్వప్నం ఈ కొండవీడు ప్రాంతం.

యడ్లపాడు : క్రీ.శ 13వ శతాబ్దంలో ఒన్న ప్రాంతానికి కార్యస్థానంగా ఉన్న కొండవీడును 1325లో రెడ్డిరాజ్య స్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి రాజధానిగా చేసుకున్నారు. అనంతరం తన కుమారుడైన అనపోతరెడ్డి కొండవీడును శతృదుర్భేద్య గిరిదుర్గంగా మలిచారు. నాటి నుంచి రెడ్డిరాజుల ప్రధాన పాలనా కేంద్రంగా మారింది. ఆ తర్వాత గజపతులు కైవసం చేసుకున్న కుండీనపురంగా రాయల పరమైన విజయనగర సామ్రాజ్యంలోని ఓ భాగమైంది.

గోల్కొండ నవాబులు చేజిక్కించుకున్న ముర్త్తజానగరంగా పేరొందింది. చివరిగా ఫ్రెంచ్, బ్రిటీషువారికి హస్తగతమై పన్నెండామళ్ల పట్నంలోని ఓ పేటగా మార్పు చెందింది. వెరసి ఆంధ్రుల వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా, ప్రాచీన చరిత్రకు సజీవ సాక్ష్యమైంది. నాటి సంప్రదాయాలను భావితరాలకు తెలిపే మార్గదర్శకంగా నిలిచింది. అన్నింటికీ మించి పర్యాటక ప్రేమికులను పరవశింపజేసే రమణీయ ప్రకృతి శోభిత ప్రాంతంగా విరాజిల్లుతోంది.  

 అంతా అద్భుతమే..
అందమైన పల్లెలు..వాటి చుట్టూ హరివిల్లు రంగుల పూలవనాలు..పచ్చని తోటలు..చక్కని బాటలు..వాటి మధ్యలో రమణీయ ఆకృతులు కలిగిన గిరిజరులు, శిలా తోరణాలు, నాటి కళలను కళ్లకు కట్టే అద్భుత శిల్ప సంపద, అబ్బురపరిచే స్వాగత మహా ద్వారాలు, కింది నుంచి కోట వరకు పేర్చిన భారీ రాతి మెట్లు, వెలకట్టలేని అరుదైన ఔషధ మొక్కలు, కొండపై అంచుల్లో సింహాల్లా భీతిగొలిపిస్తూ కనిపించే భారీ బురుజులు..రాజసం..రాజ సౌరభం..రాజదర్పంతో ఉట్టిపడే రాజమహల్స్, అనంత సైన్యంతో దండయాత్ర చేసి శతృదుర్భేద్య రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నామంటూ విజయగర్వంతో సాక్ష్యమిస్తున్న జయస్థూపం. శైవవైష్టవ మతాలకు చెందిన ఎన్నో ఆలయాలు.

మంత్రులు.. సామాంతులు.. రాజులు..రారాజుల పాలనకు చిహ్నంగా అక్కడక్కడ వేయించిన శిలా శాసనాలు. 1700 అడుగుల ఎత్తులో ఉన్న 41 కొండల నడుమ 5 కిమీమీటర్ల మైదానంలా ఉన్న పీఠభూమి చుట్టూ ఉన్న 17 బురుజులు ఆకాశంలోంచి చూస్తుంటే భూతల స్వర్గాన్ని తలపిస్తూ దర్శనమిస్తాయి.. చూపురులను కట్టిపడేస్తాయి. చరిత వినేకొద్దీ ఆసక్తిని రేకిత్తిస్తాయి.

ఆకాశం చూసి అబ్బుర పడుతోంది..
ఇటీవల కురిసిన వర్షాలకు కొండపైన ఉన్న మూడు చెరువులు నిండి, ఎక్కడ చూసినా పచ్చని చెట్లు వాటి మధ్యలో పురాతన కట్టడాలు అక్కడికి చేరుకునేందుకు నిర్మిస్తున్న ఘాట్‌ రోడ్డును చూసి చూపు మరల్చలేం. ఆ సుందర మనోహర దృశ్యాలను వీక్షించాలంటే వేయి కళ్లు సరిపోయేలా లేవంటే నమ్మశక్యం కాదు. ఈ అద్భుత సుందర ప్రదేశాన్ని చూస్తుంటే ఐరోపా ఖండంలోని ఆల్ఫŠస్‌ పర్వతాలు, బ్రిజిల్‌ దేశంలోని అమెజాన్‌ కొండలను తలపిస్తాయి.  

అన్ని హంగులూ ఇక్కడే..
నవ్యంధ్ర రాజధానికి మణిహారంగా రూపొందే అవకాశం కొండవీడుకే ఉంది. ఇక్కడ అసంపూర్తి అభివృద్ధి పనుల్ని త్వరితగతిన పూర్తి చేస్తే విహారయాత్రలకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. పర్యాటకులను ఆహ్లాదపరిచే అన్ని హంగులు కొండవీడులోనే ఉన్నాయి. కుటుంబ సభ్యులంతా కలిసి రోజంతా ఆనందించే ప్రకృతి సంపద ఉంది.     – కల్లి శివారెడ్డి, కన్వీనర్, కొండవీటికోట అభివృద్ధి కమిటీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top