‘ఆంధ్రా’ గోల్కొండగా కొండవీడు..

Master Plan Ready To Develop Kondaveedu Area As Tourist Hub - Sakshi

ప్రగతి వైపు పరుగు.. పర్యాటకం వెలుగు 

బృహత్తర ప్రణాళికలు.. భారీగా నిధులు

అటవీ అందాలను తలపించేలా స్వాగత ద్వారం

రూ.13.35 కోట్ల విలువైన  పనులకు శ్రీకారం

చారిత్రక ప్రాభవానికి, తెలుగు వారి పౌరుషానికి నిలువెత్తు దర్పణంగా నిలిచిన కొండవీడు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మలిచేందుకు మాస్టర్‌ ప్లాన్‌ రెడీ అవుతోంది. మహోన్నత చరిత్ర, ప్రాచీన సంపద కలిగిన కొండవీడుకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిది. హైదరాబాద్‌కు వన్నె తెచ్చిన ‘ఆంధ్రా’ గోల్కొండగా కొండవీడుకు పూర్వవైభవాన్ని తెచ్చే ఆలోచన చేస్తోంది. ఇందుకు ఆద్యుడు మహానేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి. రాజన్న 2005 జులైలో రూ.5 కోట్ల నిధులిచ్చి కొండవీడు అభివృద్ధికి తొలిబీజం వేశారు. ఆ బీజమే సందర్శకులను ఆకర్షించే ‘ఘాట్‌రోడ్డు’ అనే మహావృక్షంగా రూపుదాల్చింది. పచ్చని ప్రకృతి.. ఆహ్లాద వాతావరణం సొంతం చేసుకున్న ఈ గిరిదుర్గం నేడు దశల వారీగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది.

యడ్లపాడు: కొండవీడు కోటను అభివృద్ధి చేసే దిశలో భాగంగా నగర వనం నిమిత్తం రూ.13.35 కోట్లు విడుదలయ్యాయి. వీటితో తలపెట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి సీహెచ్‌ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే విడదల రజిని, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు  రానున్నారు.

చదవండి: ఏడు ఊర్లు కలసి హాల్వి.. దీనికో చరిత్ర ఉంది!

అత్యంత ప్రాధాన్యంగా..
నియోజకవర్గ ఎమ్మెల్యే విడదల రజిని ప్రాధాన్యతనిచ్చిన అభివృద్ధి పనుల్లో కొండవీడు పర్యాటకం ఒకటి. శతాబ్దాల ఘన చరిత్రలో భావితరాలకు అందించాలనే లక్ష్యంతో కొండవీడు ప్రగతికి నడుంబిగించారు. అన్నిశాఖల వారిని సమన్వయం చేసుకు ని బృహత్తర ప్రణాళికలు రూపొందించింది. వివిధ శాఖల ఉన్నతాధికారులు, రాష్ట్రమంతుల్ని సైతం కొండవీడుకు తీసుకువచ్చి పర్యాటకంగా చేయాల్సిన పనులను గురించి వివరించారు. వారితో కలిసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి నివేదికలను సమర్పించారు. దీంతో కొండవీడు అభివృద్ధికి సుమారు వంద కోట్ల నిధులు వచ్చేలా మార్గం సుగమం అయ్యింది.

చూడముచ్చటైన అందాలు!
ఘాట్‌రోడ్డు ప్రారంభంలో చెక్‌పోస్టు నిర్మించగా..కొండపై చారిత్రక ప్రాంతం ప్రారంభంలో విభిన్నంగా నిర్మించిన ప్రవేశద్వారం (ఆర్చి) అటవీ అందాలకు ప్రతీకగా దర్శనమిస్తోంది. సందర్శకులకు అవసరమైన మౌలిక వసతులు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. చిన్నపిల్లల పార్కు, వాహనాల  పార్కింగ్, నడకదారుల ఏర్పాటు ఫ్లోరింగ్‌ టైల్స్‌తో సుందరీకరణ చేశారు. వాటర్‌ ఫౌంటెన్, సోలర్‌ విద్యుత్తు దీపాల ఏర్పాటు తదితర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మరుగుదొడ్ల నిర్మాణం, ఆంజనేయస్వామి గుడి పక్కన 10వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ట్యాంక్‌ నిర్మాణం కొనసాగుతోంది. కొండపై ఉన్న చెరువుల గట్లపై నడకదారి..దానికిరువైపులా మొక్కలు..రక్షణగా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. సందర్శకుల కోసం చెట్ల కొమ్మల ఆకారంలో బల్లలు, అక్కడక్కడా చెట్ల చుట్టూ అరుగులు ఏర్పాటు చేసి సుందరీకరణ చేశారు.  కొండవీడు రాకపోకలకు అనువుగా రూ.24 కోట్ల వ్యయంతో దింతెనపాడు వయా కొండవీడు, ఫిరంగిపురం రోడ్డు(డీఎస్‌ రోడ్డు)  పనులు కొనసాగుతున్నాయి.

చరిత్ర పేజీలో అభివృద్ధి అక్షరాలు లిఖించాలి  
చారిత్రక, పర్యాటక ప్రాంతాల ప్రగతికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. కొండవీడు అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చూపే చొరవ.. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ఇప్పటికే కోటిన్నర నిధులతో ప్రగతి సాధించగా, తాజాగా వచ్చిన కేంద్ర అటవీ అనుమతులతో రూ.11.80 కోట్ల తో రెండోదశ ఘాట్‌రోడ్డు, రూ.3.5 కోట్లతో విద్యుత్‌సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నాం. ఇలా కొండవీడు చరిత్ర పుస్తకంలో అభివృద్ధి అక్షరాలతో లిఖించిన పేజీల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్ష. 
– విడదల రజిని, ఎమ్మెల్యే  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top